
గందరగోళాన్ని అడ్డుపెట్టుకొని సభలో బిల్లు ప్రవేశపెట్టామంటే కుదరదు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) చాలా తీవ్రమైన అంశం అని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. దీనిపై సభలో చర్చ జరగాలని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తనను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరిన సందర్భంగా కారత్ విలేకరులతో మాట్లాడారు. ప్రతి పార్టీ, ప్రతి సభ్యుడు అభిప్రాయం చెప్పే హక్కు ఉందన్నారు. సభలో బిల్లును ఏదోలా నెట్టుకొచ్చేద్దాం అన్న ధోరణిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం అని తెగేసి చెప్పారు.
గడిచిన గురువారం పార్లమెంటులో జరిగిన ఘటనలు దురదృష్టకరమైనవని అన్నారు. ఆ ఘటనలను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. ఏపీ పునర్విభజన బిల్లును లోక్‌భలో ప్రవేశపెట్టామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటలను కూడా ఖండిస్తున్నామన్నారు. ఆ సమయంలో సభలో తీవ్ర గందరగోళం ఉందని, దానిని అడ్డంపెట్టుకుని సభలో బిల్లు ప్రవేశపెట్టామని ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రతిపక్షాలు దీన్ని అంగీకరించడంలేదని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో కూడా తాము చెప్పినట్లు కారత్ తెలిపారు.