విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ నిప్పులు చెరిగారు. రెండేళ్ల మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు కేబినేట్ పునర్వ్యవస్థీకరణే నిదర్శనమని ఆయన ఆరోపించారు. గురువారం విజయవాడలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశానికి ప్రకాశ్ కారత్ ముఖ్య అతిథిగా హాజరై... ప్రసంగించారు.
కొత్త ఉద్యోగాల కల్పనతోపాటు నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన సంగతిని ప్రకాశ్ కారత్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు.
7వ వేతన సంఘం నివేదిక ప్రకారం దేశంలో 7.74 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే.. దేశంలో 8 రెట్లు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచిందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయని... దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రంలో మత విద్వేషాలు రేపుతున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.