మోడీని గద్దెనెక్కించింది కార్పొరేట్లే
సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్
సాక్షి, హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన కార్పొరేట్ సంస్థలు, గుత్త పెట్టుబడిదారులే నరేంద్ర మోడీని తమ ప్రతినిధిగా ముందుకు తెచ్చి అందలం ఎక్కించారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వ్యాఖ్యానించారు. ఆ శక్తులకు హిందూ మతోన్మాదశక్తులు తోడుకావడంతో కాంగ్రెస్ సహా మిగతా పార్టీలేవీ ఎదురునిలవలేకపోయాయని ఆయన పేర్కొన్నారు. మున్ముందు ఆ శక్తుల దుర్నీతికి ఎదురుండదని.. వాటిని నిలువరించడమే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ముందున్న తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ‘ఎస్వీకే ట్రస్టు- వర్తమాన పరిస్థితులు- వామపక్షాల ముందున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో కారత్ ప్రసంగించారు. యూపీఏ పదేళ్ల పాలనలో అధిక ధరలతో ప్రజలు దుర్భరస్థితికి చేరడం, వ్యవసాయ రంగం కుదేలవడం, పారిశ్రామిక ప్రగతి కుంటుపడడం వంటి వాటి ఫలితంగా ప్రజల్లో తలెత్తిన అసమ్మతిని బీజేపీ సొమ్ము చేసుకుందని ఆయన పేర్కొన్నారు. యూపీఏ హయాం తొలినాళ్లలో సహజ వనరులను విచ్చలవిడిగా లూఠీ చేసిన కార్పొరేట్ శక్తులు.. లాభాలు తగ్గడంతో మరో ప్రత్యామ్నాయం కోసం వెతికి మోడీని తమ ప్రతినిధిగా ముందుకు తెచ్చాయని చెప్పారు. ఇదే అదునుగా భావించిన ఆర్‌ఎస్‌ఎస్ వంటి మతోన్మాద, హిందూత్వ శక్తులు వాటికి తోడయ్యాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట జరిగే ప్రచారం బీజేపీకి పెద్ద ముసుగు మాత్రమేనని కారత్ స్పష్టం చేశారు. మొత్తంగా దేశం తిరోగమనాన్ని చూడాల్సివస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నయా ఉదారవాద విధానాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయడం, బడుగు బలహీనవర్గాలను ఏకం చేస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించడం, ప్రజా రథాలను కదిల్చి మతతత్వ శక్తుల ఆగడాలను అరికట్టడమే ప్రస్తుతం వామపక్షాల ముందున్న కర్తవ్యమని చెప్పారు. ఇందుకు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
సింగపూర్ సరే.. సీమ సంగతి చూడండి: రాఘవులు
సీమాంధ్రను సింగపూర్‌గా మార్చడం సరే.. ముందు రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల సంగతి చూడాలని చంద్రబాబుకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సూచించారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్‌పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారని, ఆయన వాటిని నెరవేర్చాలని పేర్కొన్నారు. కార్పొరేట్ మయమైపోయిన ప్రస్తుత ఎన్నికల విధానాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు చట్టసభల్లో లేకపోవడం పేద ప్రజలకు పెద్ద లోటని, చట్టసభల్లో నానాటికీ రియల్టర్లు, బడా పారిశ్రామిక వేత్తల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.