సమైక్య పోరులో తోడుంటాం: ప్రకాశ్ కారత్ | Prakash karat assures ysr congress party against to bifurcation bill | Sakshi
Sakshi News home page

సమైక్య పోరులో తోడుంటాం: ప్రకాశ్ కారత్

Published Fri, Feb 7 2014 1:53 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

సమైక్య పోరులో తోడుంటాం: ప్రకాశ్ కారత్ - Sakshi

సమైక్య పోరులో తోడుంటాం: ప్రకాశ్ కారత్

* వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ హామీ
* పార్లమెంట్‌లో బిల్లును అడ్డుకునేందుకు పూర్తిగా మద్దతిస్తామని వెల్లడి
* మిత్రపక్షాలతోనూ మాట్లాడతామని హామీ
* సమైక్యంపై కేంద్ర అప్రజాస్వామిక వైఖరిని కారత్ దృష్టికి తీసుకెళ్లిన జగన్
* బీజేపీ అగ్రనేత అద్వానీతోనూ సమావేశమైన వైఎస్సార్ సీపీ అధినేత
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో అడ్డుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. సమైక్యం విషయంలో తాము తొలినుంచీ ఉన్న వైఖరినే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందకుండా చూసేందుకు ఇంటాబయటా పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి సాగేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తమ మిత్రపక్షాలైన ఏఐడీఎంకే, జేడీఎస్, జేడీయూలనూ సంప్రదించి బిల్లును అడ్డుకోవాల్సిందిగా కోరతామని హామీ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్ జగన్‌తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలు సీపీఎం ప్రధాన కార్యాలయంలో కారత్‌తో భేటీ అయ్యారు.  20 నిమిషాల పాటు వారు సమైక్యాంధ్యప్రదేశ్‌పై  చర్చించారు.
 
 ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాజ్యంగ నిబంధనలు, సంప్రదాయాలను తుంగలో తొక్కి పూర్తి అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కారత్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, బిల్లును వెనక్కి పంపాలని పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారని వివరించారు. రాష్ట్ర అసెంబ్లీకి పంపిన బిల్లులోనూ విభజన అనంతర పరిణామాలు, ఆర్థిక పంపిణీ, నీటి వనరుల నిర్వహణపై సరైన వివరణలు లేవని, దీన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ, మండలిలో పూర్తిగా వ్యతిరేకించారని తెలిపారు. సభలోని మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం విభజన బిల్లును తిరస్కరించారని గుర్తుచేశారు. ఇదే సమయంలో బిల్లును తిరస్కరిస్తున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానం మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందిందని, తిరస్కరించిన ఆ బిల్లును పార్లమెంట్‌కు సిఫార్సు చేయరాదని కోరారు. ఈ విషయంలో సీపీఎం మద్దతు కావాలన్నారు. ఉభయ సభల్లో ప్రవేశపెట్టే సమయంలో బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలని విన్నవించారు. దీనికి ప్రకాశ్ కారత్ పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు.
 
 బిల్లును వ్యతిరేకిస్తాం: కారత్
 ఈ భేటీ అనంతరం కారత్ విలేకరులతో మాట్లాడుతూ, ‘‘సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్  మొదటి నుంచీ రాష్ట్రం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాయి.  పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం జరగకుండా చూసేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై చర్చించుకున్నాం’’ అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయమై చర్చలేమీ జరుగలేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు  సంపూర్ణ మద్దతు ఉంటుందని కారత్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.
 
 అద్వానీతోనూ జగన్ భేటీ..
 లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్ జగన్, మేకపాటి, ఎస్పీవైలు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో పార్లమెంట్‌లో లాబీల్లో భేటీ అయ్యారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకర ణ బిల్లు విషయంలో బీజేపీ తన వైఖరిని మార్చుకోవాలని జగన్ కోరారు. బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రుల ప్రయోజనాలను పట్టించుకోకుండా, వారి అభిప్రాయాలకు ఏమాత్రం విలువనివ్వకుండా అడ్డగోలుగా విభజన చేస్తున్నారని వివరించారు. శాసనసభలో విభజన బిల్లును  తిరస్కరిస్తూ చేసినతీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించిందని అద్వానీ దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రధాన ప్రతిపక్షంగా వ్యతిరేకించాలని కోరారు. జగన్ విజ్ఞప్తికి అద్వానీ పూర్తి సానుకూలంగా స్పందించారని వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
 
 ఉత్తరాంధ్రలో 8, 9 తేదీల్లో ‘సమైక్య శంఖారావం’
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8, 9 తేదీల్లో ఉత్తరాంధ్రలో సమైక్య శంఖారావం యాత్ర చేపట్టనున్నారు. 8న విశాఖ జిల్లా చోడవరంలో మధ్యాహ్నం 3 గంటలకు, గాజువాకలో సాయంత్రం 5 గంటలకు  బహిరంగ సభల్లో పాల్గొంటారు. 9వ తేదీ ఉదయం 11 గంటలకు భోగాపురంలోనూ, సాయంత్రం 3 గంటలకు శ్రీకాకుళంలోనూ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం సభలో వైఎస్సార్ సీపీలో చేరతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement