ఈ సారి కూడా కుటుంబ రాజకీయాలే....
‘స్థానిక’ ఎన్నికల్లో కూడా కుల రాజకీయాలు
ధనవంతులకే ప్రాధాన్యం
టికెట్ దక్కకపోతే ఇతర పార్టీల్లోకి జంప్ !
ప్రధాన పార్టీలకు దడ
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇక జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కని నేతలంతా ఇతర పార్టీల్లో చేరి బీఫాం తీసుకోవడమో లేదంటే రెబల్స్‌గానో బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రెబల్స్ అన్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా తయారవుతున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 13న 15 జిల్లా పంచాయతీ, 95 తాలూకా పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి విడతలో పోలింగ్ జరగనున్న జిల్లా, తాలూకా పంచాయతీల్లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది.
ఓటర్లను ఆకర్షించే దిశగా అభ్యర్థులంతా ప్రచారంలో మునిగిపోయారు. ఇదే సందర్భంలో ఆయా పార్టీల్లో టికెట్‌లు దక్కని అభ్యర్థులు రెబల్స్‌గా బరిలోకి దిగి తమకు టికెట్ కేటాయించని పార్టీల అభ్యర్థులు ఎలాగైనా సరే ఓటమి పాలయ్యేలా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు నగర, బెంగళూరు గ్రామీణ, రామనగర, చిత్రదుర్గ, దావణగెరె, కోలారు, చిక్కబళ్లాపుర, తూమకూరు ఇలా మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న అన్ని ప్రాంతా ల్లోనూ రెబల్ అభ్యర్థులు ప్రధాన పార్టీల నేతలకు చెమటలు పట్టిస్తున్నారు. ఇక తమ సొంత పార్టీ నుంచి టికెట్ దక్కని వారంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి బి-ఫారం తీసుకొని పోటీలో నిలబడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పట్టున్న స్థానికులు ఇతర పార్టీల్లో చేరిపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలా అన్ని డైలమాలో పడిపోతున్నాయి.
ఈ సారి కూడా
ఇక ఈ సారి కూడా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణ, కె.ఎస్.ఈశ్వరప్ప కుమారుడు కాంతరాజు, కోలారు ఎంపీ కె.హెచ్.మునియప్ప కుమార్తె రూపా శశిధర్, మాజీ మంత్రి ఎం.బి.పాటిల్ కుమారుడు వినయ్ పాటిల్, ఎమ్మెల్సీ వివేక్‌రావ్ పాటిల్ కుమారుడు ప్రణయ్ పాటిల్, మాజీ మంత్రి ఉమేష్ కత్తి కుమారుడు నిఖిల్ కత్తి, ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్ భార్య భారతి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణప్ప కుమారుడు వెంకటేష్ ఇలా చాలా మంది ప్రముఖుల కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం గమనార్హం.
ధన ప్రవాహం.....
ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయా జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల్లో ధన ప్రవాహం కనిపిస్తోంది. గ్రామాల్లోని స్త్రీ శక్తి సంఘాలు, యువ సంఘాలు, స్వచ్ఛంద సేవా సంఘాలు ఇలా అన్ని సంఘాల ద్వారా ఓటర్లకు డబ్బును చేర్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సందర్భంలో మద్యం, చీరలు, ముక్కుపుడకలు, గృహోపకరణాలు ఇలా వివిధ రకాల బహుమతులను ఓటర్లకు అందజేసి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టేదిశగా పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.