కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సిద్దు! | Siddaramaiah plotted MLA exodus to become Karnataka | Sakshi
Sakshi News home page

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సిద్దు!

Published Mon, Jul 8 2019 2:26 AM | Last Updated on Mon, Jul 8 2019 2:26 AM

Siddaramaiah plotted MLA exodus to become Karnataka - Sakshi

దేవెగౌడ, సిద్దరామయ్య, యడ్యూరప్ప

కర్ణాటక రాజకీయాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. 13మంది కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాతో కన్నడ డ్రామా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నిలబడుతుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ.. కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణంలో మాత్రం లుకలుకలు బహిర్గతమయ్యాయి. మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య కావాలనే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంగా ఒప్పుకోమంటూ మాజీ ప్రధాని, జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ దేవేగౌడ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదనే సంకేతాలనిచ్చాయి. అయితే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేనప్పటికీ.. పిల్లి పోరు – పిల్లి పోరు కోతి తీర్చినట్లు.. కాంగ్రెస్‌–జేడీఎస్‌ విభేదాలను సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ కాచుకుని కూర్చొంది. తాజా పరిణామాలను ఆ పార్టీ నిశితంగా గమనిస్తోంది. అవసరమైతే రాష్ట్రపతిపాలన పెట్టయినా పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం లేకపోలేదు.

సిద్దరామయ్యే అంతా చేస్తున్నారా?
అయితే ఉన్నపళంగా ప్రభుత్వం పడిపోయే అవకాశాల్లేవని.. ఒక్కొక్క ఇటుక రాలిపోతున్నట్లుగా కుమారస్వామి ప్రభుత్వం మెల్లిగా కూలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటైనప్పటినుంచీ సున్నితమైన బంధాలపైనే నడుస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితుల వెనక మాజీ సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని జేడీఎస్‌ ఆరోపిస్తోంది. రాజీనామాలు చేసిన కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు సిద్దు మద్దతుందని కుమారస్వామి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. సిద్దు ప్రోద్బలంతోనే వీరంతా రాజీనామాలకు పాల్పడ్డారంటున్నారు.

ఆయన్ను సీఎం చేస్తేనే రాజీనామాలు వెనక్కు తీసుకుంటామంటూ రెబల్‌ ఎమ్మెల్యేలు చెప్పడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అటు కాంగ్రెస్‌ కూడా ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే.. సిద్దరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అయితే దీనికి జేడీఎస్‌ కచ్చితంగా ఒప్పుకునే అవకాశం లేదు. అయితే.. ఇదంతా మంగళవారం సభకు రానున్న స్పీకర్‌.. ఈ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తారా? లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిద్దు అభ్యర్థిత్వానికే కాంగ్రెస్‌ జై కొడితే.. జేడీఎస్‌ ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలూ లేకపోలేదు.  

ఆపరేషన్‌ ‘లోటస్‌’
పార్లమెంటు ఎన్నికల వరకు నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ తాజా పరిణామాల నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించింది. మరింత మంది సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే పరిస్థితులను ప్రోత్సహిస్తే.. కమలం పార్టీ గద్దెనెక్కేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. ఇలా జరిగితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. విప్‌ ధిక్కరించారనే వివాదమూ ఉండదు. తద్వారా ఎలాంటి వివాదం లేకుండా బీజేపీ సర్కారు ఏర్పాటు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మిగిలిన ఎమ్మెల్యేలను బీజేపీ టికెట్లపై బరిలో దింపి గెలిపించుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందనే చర్చ జరుగుతోంది.

ఎవరి బలమెంత?
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలుంటారు. ఇందులో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది బలం ఉండాల్సిందే. ప్రస్తుత జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ బలం 118. ఒకవేళ ఈ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే కూటమి ఎమ్మెల్యేల సంఖ్య 105 (కాంగ్రెస్‌ 69, జేడీఎస్‌ 34, బీఎస్పీ 1, స్వతంత్రులు 1)కు చేరుతుంది. బీజేపీ సొంత బలం కూడా 105. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 106 (స్పీకర్‌ను మినహాయిస్తే). ఇది బీజేపీ, సంకీర్ణ సర్కారు మధ్య నువ్వా–నేనా అనే పరిస్థితి నెలకొంటుంది. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యేను లాక్కుంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement