
సాక్షి, బెంగళూరు: మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నేతలిపుడు నిందారోపణలకు దిగుతున్నారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి నెల రోజులు గడవటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజుకుంటోంది. ప్రభుత్వం కూలిపోయింది మీ వల్లే అని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అంటే.. కాదు మీరు, మీ కుమారుల వల్లే కూలిపోయిందని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శలకు దిగారు.
కాంగ్రెస్ వల్లే కుమారస్వామికి అష్టకష్టాలు..
సంకీర్ణ ప్రభుత్వంలో తన కుమారుడు కుమారస్వామిని కాంగ్రెస్ నాయకులు అష్టకష్టాలు పెట్టి బాధపెట్టారని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పెట్టిన హింసలకు కుమారస్వామి నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకునేవారు. అది చూసి నాకు భోజనం చేయడానికి కూడా మనసొప్పేది కాదు. కాంగ్రెస్ నేతలు పెట్టే బాధల్ని తట్టుకోలేక సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమార స్వామి చాలాసార్లు ప్రస్తావించారు’’ అంటూ వెల్లడించారు.
పతనానికి దేవెగౌడ కారణం: సిద్దరామయ్య
జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడానికి తాను కారణం కాదని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారులే కారణమని, రాజకీయ దురుద్దేశంతో దేవెగౌడ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్‌ఆర్ బొమ్మై, ధరంసింగ్ ప్రభుత్వాలను దేవెగౌడ కూల్చిన విషయం తనకు తెలుసన్నారు. ç జేడీఎస్‌తో మైత్రి వద్దన్న మాట వాస్తవమేనని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పూర్తిగా సహకరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment