బలపరీక్షలో రావత్ గెలుపు
* ఉత్తరాఖండ్‌లో గట్టెక్కిన కాంగ్రెస్ సర్కారు
* అనుకూలంగా 33 మంది, వ్యతిరేకంగా 28 మంది ఓటు
గెలుపు వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
* నేడు అధికారికంగా ప్రకటించనున్న సుప్రీంకోర్టు
* ఇప్పటికైనా ఉత్తరాఖండ్ అభివృద్ధికి కలసిరండి: రావత్
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠ మధ్య మంగళవారం జరిగిన ఉత్తరాఖండ్ బలపరీక్షలో రావత్ సర్కారు గట్టెక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమాచారం మేరకు రావత్‌కు అనుకూలంగా 33 మంది ఓటేయగా, 28 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 90 నిమిషాల ఓటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసిన అధికారులు సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించారు. గెలుపు వివరాలను సుప్రీంకోర్టు నేడు అధికారికంగా ప్రకటించనుంది.
రావత్ సర్కారు విజయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందంటూ మార్చి 28న మోదీ సర్కారు రాష్ట్రపతి పాలన విధించడం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సరితాఆర్య తెలిపిన వివరాల ప్రకారం.. రావత్‌కు అనుకూలంగా 33 మంది ఓటేశారు. దాంతో బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. బీజేపీకి చెందిన భీమ్‌లాల్ ఆర్య, కాంగ్రెస్‌కు చెందిన రేఖా ఆర్యలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు సమాచారం.
రావత్‌కు అనుకూలంగా ఓటేసిన వారిలో 27 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీఎస్పీకి చెందిన ఇద్దరు, యూకేడీ నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్రులున్నారు. 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు అనర్హులని సోమవారం హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 61 మందే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటింగ్ కోసం మంగళవారం ఉదయం రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలనను తొలగించారు.
ఉదయం నుంచే ఉత్కంఠ.. బలపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉదయం నుంచే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉద్యోగులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. 11 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ గంట పాటు సాగింది. అసెంబ్లీ గేటు బయట విలేకర్లు, పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఇంతలో నైనిటాల్ ఎమ్మెల్యే సరిత ఆర్య బయటకొచ్చి ఆనందంతో రావత్ గెలిచారంటూ ప్రకటించారు. సుప్రీం ఆదేశాల మేరకు బలపరీక్ష క్రమశిక్షణ మధ్య సాగిందన్నారు.
ఘర్షణ వాతావరణం వద్దు: రావత్
బలపరీక్ష ముగిసిన వెంటనే హరీశ్ రావత్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఒక్కో ఎమ్మెల్యేకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. బలపరీక్ష వివరాల్ని బుధవారం సుప్రీంకోర్టు వెల్లడిస్తుందన్నారు. తాను చిన్న రాష్ట్రానికి చిన్న ముఖ్యమంత్రినని, ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికి ఉత్తరాఖండ్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని బలమైన నేతలు స్నేహ హస్తం అందించాలని కోరారు.
రాజ్యసభలో రగడ: ఉత్తరాఖండ్ ఆర్థిక బిల్లును సోమవారం నాటి అదనపు జాబితాలో పెట్టడంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించగా మళ్లీ పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ బలపరీక్ష నేపథ్యంలో మంగళవారం రాజ్యసభ బోసి పోయి కన్పించింది. పాలక, ప్రతిపక్ష సభ్యులు చాలా మంది హాజరుకాలేదు. సమాధానాలు కోరిన పలువురు సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో కనిపించలేదు. కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ ప్రజాసంక్షేమంపై కీలకమైన ప్రశ్నలు సంధించినా.. ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడంతో సహాయమంత్రి సమాధానమిచ్చారు.
మోదీ సర్కారుకు ఎదురుదెబ్బ: సోనియా
బలపరీక్ష ముగియగానే ఇది ప్రజాస్వామ్య విజయమంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పేర్కొన్నారంటూ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. ఈ విజయం మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టని సోనియా చెప్పారన్నారు. రావత్ విజయం బీజేపీకి ఎదురుదెబ్బ కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ అంతర్గత సమస్య వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. హరీశ్ రావత్ గెలుపును కొనుగోలు చేశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం చెపుతారంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకుని సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేల్ని కొన్నారంటూ ఆయన విమర్శించారు.
పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే
ప్రజాప్రతినిధులు సొంత పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరాలనుకుంటే తక్షణం రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఒకవేళ ప్రజాప్రతినిధి వేరే పార్టీ మారాలనుకుంటే అతన్ని తక్షణం అనర్హుడ్ని చేయాలన్నారు. ఉత్తరాఖండ్ బలపరీక్ష నేపథ్యంలో మాట్లాడుతూ.. ‘ఒక ప్రజాప్రతినిధి పార్టీ మారాలనుకుంటే రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి పదవికి రాజీనామా చేయాలి. బలపరీక్షకు సంబంధించి స్పీకర్ పాత్రతో పాటు ఫిరాయింపుల చట్టం అమలు నిబంధనల్నీ పునఃపరిశీలించాలి’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి మారిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.