బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. 650 సీట్లున్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెల్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కీర్ స్టార్మర్ మాజీ మానవ హక్కుల న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మ్యూజీషియన్ కూడా. ఆయన వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. గత 50 ఏళ్లలో ఈ వయసులో బ్రిటన్ ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. అంతేగాక పార్లమెంట్‌కు ఎన్నికైన తొమ్మిదేళ్లలోనే ప్రధానమంత్రి పదవి చేపడుతుండటం మరో విశేషం.
సెప్టెంబరు 2, 1962న జన్మించిన కీర్.. రోడ్నీ స్టార్‌మర్, లండన్ శివార్లలో ఒక ఇరుకైన ఇంట్లో బాల్యాన్ని గడిపాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. లీడ్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో న్యాయ విద్యను అభ్యసించాడు. అనంతరం వామపక్ష కారణాలు, డిఫెండింగ్ ట్రేడ్ యూనియన్లు, మెక్‌డొనాల్డ్స్ వ్యతిరేక కార్యకర్తలు, విదేశాల్లోని ఖైదీల మరణ శిక్షలు వంటి వాటిపై దృష్టి సారించాడు. అనంతరం మానవ హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు
తొలుత 2003లో ఉత్తర ఐర్లాండ్‌లోని పోలీసులు మానవ హక్కుల చట్టంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అయిదేళ్ల తర్వాత లేబర్ పార్టీకి చెందిన గోర్డాన్ బ్రౌన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.
2008 నుంచి 2013 మధ్య వరకు ఎంపీలు తమ ఖర్చులను దుర్వినియోగం చేయడం, జర్నలిస్టుల ఫోన్ హ్యాకింగ్, గ్లండ్‌లో యువత అల్లర్ల వంటి విచారణలను ఆయన పర్యవేక్షించాడు. తన పనితనంతో క్వీన్ ఎలిజబెత్ 2 చేత నైట్ ర్యాంక్ బిరుదు పొందారు.
50 ఏళ్ల వయసులో కీర్ స్టామర్ రాజకీయాల్లోకి రావడం గమనార్హం. 2015 నార్త్ లండన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.
స్టార్మర్‌కు వివాహం కాగా భార్య పేరు విక్టోరియా. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్‌లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లల ఉన్నారు. శుక్రవారం వరకు పనిలో నిమగ్నమయ్యే కీర్.. శని, ఆదివారాలు మాత్రం పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తాడు.
రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో సుధీర్ఘకాలం కొనసాగారు. ఆయన ఆధునిక రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటారనే పేరు ఉంది. ఈ ఎన్నికల్లో బ్రిటన్‌లో రాజకీయాలను తిరిగి సేవలోకి తీసుకురావాలి.. పార్టీ కంటే దేశం ముందు అనే ప్రధాన నినాదాలతో ప్రచారంలో ముందుకు సాగారు. గత 14 ఏళ్లలో కన్జర్వేటివ్ పార్టీ అయిదుగురు ప్రధానులను మార్చిన ఉద్దేశంలో ఆయన ఈ నినాదాలను నడిపించారు.
ప్రజలు మార్పును కోరుకుంటే వారు లేబర్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పారు. దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలి.2019 తర్వాత లేబర్ పార్టీ ప్రధాన నాయకుడిగా అవతరించిన కీర్.. తమ ప్రభుత్వం మొత్తం దృష్టి దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆరోగ్య సేవపైనే ఉంటుందని చెప్పారు.
కాగా యూకే పార్లమెంట్‌లో మొత్తం 650 సీట్లు ఉండగా 400కు పైగా మెజార్టీ స్థానాల్లో లేబర్ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ఆపార్టీ చీఫ్ కీర్ స్టార్మర్ తన నియోజకవర్గం లండన్‌లోని హోల్‌బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్‌లో 18,884 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాను గెలిపించినందుకు నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ ప్రకటించారు.
ఇక రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 112 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతుంది.
భారత్- బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..
లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్-యూకే సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. యూకే- భారత్ సంబంధాలను బలోపేత చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో స్టార్మర్ పేర్కొన్నాడు. కశ్మీర్ వంటి సమస్యలపై లేబర్ పార్టీ వైఖరిని కూడా తెలియజేస్తూ.. భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్‌తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశయంతో ఉన్నట్లు నొక్కిచెప్పారు. ఇక భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్ధతతో ఉన్నట్లు అతని మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. కాగా గత రెండు ఏళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారతదేశం, బ్రిటన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment