
వాషింగ్టన్: బ్రిటన్ అమెరికాకు అత్యంత మిత్రదేశం.. కానీ ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మేను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. తాజాగా ఆయన థెరిస్సా మేను ఘాటుగా మందలించారు. ఆమె తనను విమర్శించడం మాని.. బ్రిటన్ కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇద్దరు హైప్రొఫైల్ అధ్యక్షులు ఇలా పబ్లిగ్గా రచ్చకెక్కడంతో ఇరుదేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి.
‘థెరిస్సా మే నా మీద ఫోకస్ చేయకు. బ్రిటన్‌లో చోటుచేసుకుంటున్న వినాశకర రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదంపై దృష్టి పెట్టు. మేం బాగానే ఉన్నాం’ అని ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు. ఇంతకుముందు మే ట్విట్టర్ హ్యాండిల్‌ను తప్పుగా ట్యాగ్ చేసి ఇదే ట్వీట్‌ను ట్రంప్ పెట్టారు. మళ్లీ దానిని సరిచేసి.. మేను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.
బ్రిటన్‌కు చెందిన తీవ్ర అతివాద గ్రూప్ ‘బ్రిటన్ ఫస్ట్’ ట్విట్టర్‌లో పోస్టుచేసిన ముస్లిం వ్యతిరేక వీడియోను ట్రంప్ రీట్వీట్ చేయడం.. ఇటు బ్రిటన్‌లో, అటు అమెరికాలో తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంలో ట్రంప్ తప్పుగా ప్రవర్తించారని, ఆయన విద్వేష ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని థెరిస్సా మే తీవ్రంగా తప్పుబట్టినట్టు ఆమె అధికార ప్రతినిధి వెల్లడించారు. అంతేకాకుండా బ్రిటన్ రాజకీయాల్లో ట్రంప్ జోక్యం చేసుకోవడం.. లండన్ ముస్లిం మేయర్ సాదిక్ ఖాన్‌ను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడంతో యూకే-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో థెరిస్సాను తీవ్రంగా తప్పుబడుతూ తాజాగా ట్రంప్ ట్వీట్ చేయడం దౌత్య ఉద్రిక్తతలు రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment