దావోస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. గత నవంబర్‌లో ముస్లిం వ్యతిరేక వీడియోలను ఓ బ్రిటన్ సంస్థ ట్వీట్ చేయగా.. దానిని ట్రంప్ రీట్వీట్ చేయటం తీవ్ర దుమారాన్ని లేపింది. దీనిపై దావోస్‌లో ఐటీవీ ‘గుడ్ మార్నింగ్ బ్రిటన్ కార్యక్రమం’ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సారీ చెప్పేశాడు.
‘‘గతంలో వారిని నేను భయంకరమైన త్యాంహాకార ప్రజలుగా అభివర్ణించారని(రీట్వీట్ గురించి) మీరు(వ్యాఖ్యాత పైర్స్ మోర్గాను ఉద్దేశించి) నన్ను అడొగచ్చు. కానీ, అలా చేసినందుకు క్షమాపణలు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాలన్నింటితో మైత్రి కొనసాగించాల్సిందే తన అభిమతమని.. అందుకు ఎవరూ వ్యతిరేకులు కాదని.. అయితే కవ్వింపు చర్యలు, ఉగ్రవాదం పెంచి పోషించే దేశాల విషయంలోనే తాను కఠినంగా వ్యవహరిస్తానని ట్రంప్ వివరించారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ఆరోపణలు, పుకార్లు, వివాదాలపై ట్రంప్ సమాధానాలిచ్చారు. గురువారం ఈ ఇంటర్వ్యూ జరగ్గా... జనవరి 28న ఇది టెలికాస్ట్ కానుంది.
అసలు విషయం... కాగా, బ్రిటిష్ మితవాద సంస్థ 'బ్రిటన్ ఫస్ట్' డిప్యూటీ లీడర్ జేదా ఫ్రాంన్సన్.. మూడు ముస్లిం వ్యతిరేక వీడియోలను ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. వాటిని ట్రంప్ గత నవంబర్ లో రీట్వీట్ చేయగా.. అది పెద్ద ఎత్తున్న దుమారం రేపింది. దీనిపై స్పందించిన బ్రిటన్ ప్రధాని థెరెసా మే ట్రంప్‌ను విమర్శించారు కూడా. నాలుగు కోట్ల మందికి ట్రంప్ తప్పుడు సంకేతాలు అందిస్తున్నాడని.. ఇది మంచి పని కాదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే వెంటనే ట్రంప్ దానికి కౌంటర్ కూడా ఇచ్చారు. ‘తనను విమర్శించడం మాని బ్రిటన్‌లో 'ఉగ్రవాదం'పై దృష్టి పెట్టాలని’ థెరెసాకు ట్రంప్ సూచించారు.
ఆ తర్వాతి పరిణామాలతో అమెరికా-ఇంగ్లాండ్ మధ్య దూరం కాస్త పెరుగుతూ వస్తోంది. ఈ మధ్యే లండన్‌లో పర్యటించాల్సిన డొనాల్డ్ ట్రంప్ ‘పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల సంకేతాలు అందటంతో’’ తన పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. ఇప్పుడు ఈ క్షమాపణలతో వివాదానికి ట్రంప్ ముగింపు పలకాలని భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment