వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మండిపడ్డారు. దీర్ఘకాలంగా హాంకాంగ్ సంపాదించుకున్న పేరుప్రతిష్టలు, వైభవాన్ని కాలరాసేలా డ్రాగన్ విపరీత చర్యకు పాల్పడిందని విరుచుకుపడ్డారు. హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ట్రంప్ శుక్రవారం శ్వేతసౌధంలో మాట్లాడుతూ.. ‘‘హాంకాంగ్ ప్రజలకు ఇది తీరని విషాదం. కేవలం వారికి మాత్రమే కాదు.. చైనా ప్రజలకు.. చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి ఇదో పెను విషాదం’’ అని పేర్కొన్నారు. (స్వేచ్ఛకు సంకెళ్లు: మరో వివాదంలో చైనా)
అదే విధంగా హాంకాంగ్‌పై చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ.. అగ్రరాజ్యం హాంకాంగ్‌కు కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేయాలని తన పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ‘‘హాంకాంగ్‌కు కల్పించే ప్రత్యేక సదుపాయాలను తొలగించే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించాను. నేరస్తుల అప్పగింత, ఎగుమతుల నియంత్రణ, సాంకేతికత ఉమ్మడి వినియోగం తదితర పలు కీలక ఒప్పందాలపై ఇది ప్రభావం చూపుతుంది’’ ట్రంప్ పేర్కొన్నారు. అంతేగాక అమెరికా యూనివర్సిటిల్లోని కొంతమంది చైనీస్ విద్యార్థులపై నిషేధం విధించనున్నట్లు తెలిపారు. తమ వాణిజ్య రహస్యాలను తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం దీర్ఘకాలంగా ప్రయత్నిస్తోందని.. ఈ క్రమంలో చైనా మిలిటరీతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న విద్యార్థులపై నిషేధం విధించేందుకు ఆదేశాలు జారీ చేశారు. (డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్)
చైనా పునరాలోచించాలి.. ప్రసక్తే లేదు!
హాంకాంగ్‌పై చైనా చట్టాన్ని అమెరికాతో పాటుగా బ్రిటన్, జపాన్ కూడా తీవ్రంగా ఖండించాయి. చైనా నిర్ణయంపై పునరాలోచన చేయాలని.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా ఈ అంశంపై చర్చ జరగాల్సి ఆవశ్యకత ఉందన్నాయి. 1984 నాటి అప్పగింత ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని బ్రిటన్ మండిపడింది. ఆ ఒప్పందం ప్రకారం 2047 వరకు హాంకాంగ్ స్వతంత్రంగా కొనసాగేందుకు చైనా అంగీకరించిందని.. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ వద్ద రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని పేర్కొంది. ఇక ఈ అమెరికా, బ్రిటన్ విమర్శలపై స్పందించిన యూఎన్ చైనా విభాగం..‘‘చైనా అంతర్గత వ్యవహారమైన హాంకాంగ్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా సహించం. భద్రతా మండలిలో దీని గురించి ఎటువంటి చర్చ జరుగబోదు. యూఎస్, యూకే డిమాండ్లకు అర్థం లేదు’’అని ఓ ప్రకటన విడుదల చేసింది.(వారంలోగా చైనాపై కఠిన చర్యలు: ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment