చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా! | White House Crucial Comments About Actions On China Amid Covid 19 | Sakshi
Sakshi News home page

చైనాపై చర్యలు: ‘త్వరలోనే ఓ వార్త వినబోతున్నారు’

Published Thu, Jul 9 2020 9:15 AM | Last Updated on Thu, Jul 9 2020 7:43 PM

White House Crucial Comments About Actions On China Amid Covid 19 - Sakshi

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్‌-19)‌ వ్యాప్తి నేపథ్యంలో చైనాపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి వ్యాప్తితో పాటు వివిధ అంశాల పట్ల డ్రాగన్‌ దుందుడు వైఖరికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలే మెకానీ బుధవారం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనాపై అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో ఇప్పుడే చెప్పలేను. అయితే సరైన సమయంలో చైనాపై తీసుకోనున్న చర్యలపై కొన్ని రోజుల్లోనే ఓ వార్త వినబోతున్నారు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నారు.

కాగా చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా కారణంగా ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే అక్కడ దాదాపు ముప్పై లక్షల మందికి కరోనా సోకగా.. సుమారు లక్షన్నరకు పైగా కోవిడ్‌ మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా మహమ్మారి గురించి ముందే సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, డ్రాగన్‌కు మద్దతుగా నిలిచారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా మండిపడ్డారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం నుంచి డబ్ల్యూహెచ్‌ఓకు అందే నిధులు సైతం నిలిపివేశారు. (చైనాపై మరోసారి ట్రంప్‌ తీవ్ర విమర్శలు)

హాంకాంగ్‌ విషయంలో
అదే విధంగా గత కొన్ని నెలలుగా అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న వేళ.. ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న డ్రాగన్‌పై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసేలా చైనా అక్కడ ప్రవేశపెట్టిన జాతీయ భద్రతా చట్టంపై విరుచకుపడింది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌కు అమెరికా కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేయాలని తన పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ట్రంప్‌ ఇంతకుముందే స్పష్టం చేశారు. నేరస్తుల అప్పగింత, ఎగుమతుల నియంత్రణ, సాంకేతికత  ఉమ్మడి వినియోగం తదితర పలు కీలక ఒప్పందాలపై ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. (విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!)

ఉగర్‌ ముస్లింలపై చైనా అకృత్యాలపై
ఇక వీటితో పాటు అమెరికా జర్నలిస్టులపై ఆంక్షలు, ఉగర్‌ ముస్లింల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరు, టిబెట్‌పై డ్రాగన్‌ విధానం తదితర అంశాలపై కూడా అగ్రరాజ్యం ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలే మెకానీ బుధవారం స్పందించారు. అయితే ఇటీవల వైట్‌హౌజ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రెయిన్‌, విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చేస్తున్న వ్యాఖ్యల గురించి స్పందించేందుకు కేలె నిరాకరించారు.

చైనా యాప్‌లపై నిషేధం దిశగా అమెరికా
కాగా జాతీయ భద్రత, ప్రజల గోప్యత హక్కుకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున టిక్‌టాక్‌, వీచాట్‌ తదితర చైనా యాప్‌లపై నిషేధం విధించనున్నట్లు మైక్‌ పాంపియో, ఓ బ్రెయిన్‌ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాక చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత్‌- చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ డ్రాగన్‌ దుందుడుకు చర్యలను ఖండించిన పాంపియో.. అవసరమైతే భారత్‌కు మద్దతుగా అమెరికా బలగాలు రంగంలోకి దిగుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా హాంకాంగ్‌ విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డ ఓ బ్రెయిన్‌.. డ్రాగన్‌ ఆగడాలకు అడ్డుకుంటామని, వారి ఆటలు సాగనివ్వమని చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement