లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మే తన సొంత పార్టీ ఎంపీల నుంచే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ (యురోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం) వ్యవహారంలో మే వైఖరిని వ్యతిరేకిస్తూ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు థెరెసా మే ప్రభుత్వంపై గురువారం అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఈయూతో మే కుదుర్చుకుంటున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మంత్రివర్గంలోని నలుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఒప్పందం అర్ధరహితంగా, బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందని వారంతా ఆరోపిస్తున్నారు.
బ్రెగ్జిట్ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభమై 20 నెలల్లో ముగిసేలా ఓ ఒప్పందాన్ని థెరెసా మే ఈయూ తో కుదుర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు బుధవారం రాత్రే విడుదలైంది. బిల్లులోని నిబంధనలపై తన నిరసన తెలుపుతూ మొదటగా భారత సంతతి వ్యక్తి, ఉత్తర ఐర్లాండ్ శాఖ మంత్రి శైలేశ్ వర తన పదవికి రాజీనామా చేశారు. థెరెసా మేపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టాలంటే మే ప్రత్యర్థులకు ఆమె సొంత పార్టీ నుంచే కనీసం 48 మంది ఎంపీల మద్దతు కావాలి. వారు ఎలాగోలా ఇంత మందిని కూడగట్టినా.. మేను పదవి నుంచి దించడానికి మాత్రం 158 మంది మద్దతు అవసరం. అంతమంది మే ప్రత్యర్థుల వైపు లేరని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment