Bregjit
-
ఆడవాళ్ల భుజాలను కూడా వదలరా!
లండన్ : 'హలో... మీరు చేసే కామెంట్లకు సమాధానాలిచ్చే తీరిక నాకు లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేనేమీ మందుతాగి పార్లమెంట్‌కు రాలేదు. హ్యాంగోవర్లో కూడా లేను. అలాగని టీనేజ్ అమ్మాయిని కూడా కాను. బిడ్డకు పాలిచ్చే తల్లినీ అంతకన్నా కాను. నేనేమి చెత్తకుప్ప నుంచి లేచి రాలేదు. నాకేం తెలుసు? ఆడవాళ్ల భుజాలు చూసినా ఉద్రేకానికి గురవుతారని'' అంటూ 59 ఏళ్ల ట్రేసీ బ్రాబిన్ తన ట్విటర్లో పెట్టిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ట్రెసీ బ్రాబెన్.. బ్రిటన్ పార్లమెంటులో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. కాగా రెండురోజుల కిందట బ్రెగ్జిట్ పై చర్చలో భాగంగా పార్లమెంటులో జరిగిన చర్చలో ఆమె అద్భుతంగా మాట్లాడారు. అయితే ఆ సమయంలో ట్రెసీ ధరించిన డ్రెస్ భుజాల నుంచి జారిపోవడం, ఆ ఫొటోలు వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. 'ఒక బాధ్యత గల ఎంపీగా ఇలాంటి బట్టలేసుకుని పార్లమెంట్ కు రావొచ్చా? భుజాలను చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించడం ఏం బాలేదు' అంటూ ట్రోలర్లు ట్రెసీపై విరుచుకుపడ్డారు.( ట్రోల్స్‌కు బదులిచ్చిన ఎంపీ నుస్రత్ జహాన్) Hello. Sorry I don’t have time to reply to all of you commenting on this but I can confirm I’m not.... A slag Hungover A tart About to breastfeed A slapper Drunk Just been banged over a wheelie bin. Who knew people could get so emotional over a shoulder... 🙄 https://t.co/sTWWiEY2TF — Tracy Brabin MP 🌹 (@TracyBrabin) February 4, 2020 నెటిజన్ల వేధింపులు విపరీతంగా పెరిగిపోవడంతో ఎంపీ ట్రెసీ బాబ్రెన్ తన ట్విటర్ వేదికగా వారికి ఘాటుగానే సమాధానమిచ్చారు. స్పీకర్ పిలవడంతో సడెన్ గా నిలబడ్డానని, సభలో తాను మాట్లాడే విషయం అందరికీ వినబడాలన్న ఉద్దేశంతో మైక్ ముందుకు వంగానని, దాంతో డ్రెస్ కొంచెం స్లిప్ అయిందని తెలపారు. అంతమాత్రానికే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఎంపీ వివరించారు. మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులకు ఇదొక ఉదాహరణ అని చెప్పారు. కాగా గతేడాది భారత పార్లమెంటులోనూ ఇలాంటి సందర్భమే ఒకటి చోటుచేసుకుంది. తృణముల్ కాంగ్రెస్ నుంచి కొత్తగా ఎన్నికైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తిలు జీన్స్, మోడ్రన్ డ్రెస్సుల్లో లోక్ సభకు రావడం, వాళ్లపై ట్రోలర్లు విరుచుకుపడటం, వారు కూడా అదే స్థాయిలో తిప్పికొట్టడం తెలిసిందే.(‘ఇరుకు’ మాటలు) -
రసకందాయంలో బ్రెగ్జిట్
లండన్: బ్రెగ్జిట్ రాజకీయం మళ్లీ రసకందాయంలో పడింది. వచ్చే నెలలో ఆకస్మిక ఎన్నికలు నిర్వహించాలన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతిపాదనకు పార్లమెంటు మంగళవారం మోకాలడ్డింది. ఈ అంశంపై ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించిన ప్రధాని వచ్చే నెల బ్రస్సెల్స్‌లో జరగబోయే ఈయూ సమావేశంలో సరికొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని స్పష్టం చేశారు. బ్రెగ్జిట్ గందరగోళానికి కారణమైన ప్రతిపక్షాలు తమ బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోతున్నాయని, ఓటర్లు వీరికి తగిన సమాధానం చెప్పే రోజు త్వరలోనే రానుందని విమర్శించారు. బ్రెగ్జిట్ ఒప్పందంలో మార్పుల్లేకపోతే బ్రిటన్‌కు జరిగే నష్టానికి సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేయాలన్న ప్రధాని డిమాండ్‌ను పార్లమెంటు తోసిరాజనడం గమనార్హం. బ్రిటిష్ చట్టాల ప్రకారం ఆకస్మిక ఎన్నికలకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైన నేపథ్యంలో తాము వాటిని అడ్డుకుంటున్నట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అక్టోబరు 31 లోపు ఒప్పందం కుదుర్చుకోవడం లేదంటే జాప్యం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తుండగా జాప్యం చేసేందుకు తాను సిద్ధంగా లేనని జాన్సన్ చెబుతూండటం సమస్యను జటిలతరం చేసింది. అయితే అక్టోబరు 31లోపు ఒప్పందం కుదరకపోతే జాప్యం చేసేందుకు పార్లమెంటులో ఓ బిల్లు చర్చకు వస్తున్న సంగతి ప్రస్తావించాల్సిన అంశం. 17న బ్రస్సెల్స్‌లో జరిగే ఈయూ సమావేశం బ్రెగ్జిట్ వ్యవహారానికి కీలకం కానుంది. -
బ్రిటన్‌లో కొత్త వీసా విధానం!
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకొచ్చిన (బ్రెగ్జిట్) అనంతరం ఆ దేశ వలస విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్రిటన్ తన వలస నిబంధనల్లో భారీ మార్పులు చేపడుతోంది. బ్రెగ్జిట్ అనంతరం వీసాలు, వలసల విషయంలో అవలంబించాల్సిన వ్యూహాలపై రూపొందించిన శ్వేతపత్రాన్ని బుధవారం ఆ దేశ పార్లమెంటులో హోంశాఖ మంత్రి సాజిద్ జావీద్ ప్రవేశపెట్టారు. అత్యున్నత నైపుణ్యానికి పట్టం గట్టేలా ఉన్న ప్రతిపాదిత విధానం భారతీయ విద్యార్థులకు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా తగిన ప్రతిభా సంపత్తి ఉన్నట్టయితే బ్రిటన్‌లో పని చేసేందుకు వీలవుతుంది. విదేశీ విద్యార్థులు బ్రిటన్‌లో చదువుకుంటే వారి విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం పనిచేసుకునే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ విధానం బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత (2021 డిసెంబర్ తర్వాత) 2025 వరకూ దశలవారీగా అమలవుతుంది. దీని ప్రకారం ఈయూ సహా ప్రపంచం మొత్తానికీ ఒకే రకమైన వలస విధానాన్ని బ్రిటన్ అమలులోకి తెస్తుంది. ఇప్పటిలా ఈయూలోని 28 దేశాల ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలుండదు. అయితే ఈయూ నుంచి వచ్చే సందర్శకులు మాత్రం వీసా లేకుండా బ్రిటన్ సందర్శించవచ్చు. వీసాల సంఖ్యపై పరిమితులుండవు.. ప్రస్తుతం బ్రిటన్ ఏడాదికి 20,700 ఉద్యోగ వీసాలు (టైర్ 2 వీసాలు) జారీ చేస్తోంది. బ్రెగ్జిట్ తర్వాత ఇలాంటి పరిమితులు ఏమీ ఉండబోవు. దీంతో వైద్యం, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన భారతీయ నిపుణులకు ఈ విధానం లబ్ధి చేకూర్చగలదని భావిస్తున్నారు. కొద్దిపాటి నైపుణాలు ఉన్న ఉద్యోగులు/కార్మికులు ఏడాది వీసాపై వెళ్లి పని చేసేందుకు కూడా ఈ విధానం వీలు కల్పిస్తుంది. అయితే ఇలాంటి వారు తమతో కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు, యూకేలో నివాస హక్కులు అడిగేందుకు అంగీకరించబోమని బ్రిటన్æ హోం మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. ఈ తరహా వీసాలు కొన్ని దేశాలకు మాత్రమే ఇవ్వాలనేది వలస విధానంలోని ఒక అంశం. ఇందులో భారత్ కూడా ఉన్నదా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బ్రిటన్‌లో ఇప్పటివరకు నైపుణ్యాలు అంతగా అవసరం లేని ఉద్యోగాలను అధికభాగం యూరప్ దేశాల ప్రజలే చేస్తున్నారు. అయితే ఐదేళ్లపాటు విదేశీ నిపుణులను కంపెనీలు నియమించుకుంటే వారికి కనీస వేతనం 30,000 పౌండ్లు ఉండాలనే అంశం వివాదాస్పదంగా మారింది. దీనిపై కంపెనీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు ఆరునెలల పాటు బ్రిటన్‌లో ఉండి ఉద్యోగం చేసుకునేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది. -
నన్ను తొలగిస్తే ‘బ్రెగ్జిట్’ సంక్లిష్టం: థెరిసా
లండన్: తనని పదవి నుంచి తొలగిస్తే యూరోపియన్ యూనియన్(ఈయూ)తో బ్రెగ్జిట్ చర్చలు క్లిష్టతరమవుతాయని బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన పార్టీ ఎంపీలను హెచ్చరించారు. భవిష్యత్‌లో బ్రిటన్–ఈయూ సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ముసాయిదా విషయంలో ప్రధానితో అధికార కన్జర్వేటివ్ ఎంపీలు పలువురు విభేదించిన సంగతి తెలిసిందే. వచ్చే వారం రోజులు బ్రిటన్‌కు కీలకమని, ఈయూ నాయకులతో సమావేశమై మరిన్ని చర్చలు జరుపుతానని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 48 మంది సభ్యుల మద్దతును రెబెల్ ఎంపీలు కూడగట్టారా? అని ప్రశ్నించగా..ఇప్పటి వరకైతే లేదని బదులిచ్చారు. -
బ్రెగ్జిట్ సుడిగుండంలో థెరిసా మే
బ్రెగ్జిట్ పరిణామాలతో బ్రిటిష్ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి (బ్రెగ్జిట్) సంబంధించిన విధివిధానాలపై ప్రధానమంత్రి థెరిసా మే ప్రవేశపెట్టిన ఒప్పంద ముసాయిదాకు కేబినెట్ ఆమోదం లభించినప్పటికీ, సొంత పార్టీలో (కన్సర్వేటివ్) తిరుగుబాటు తలెత్తింది. పలువురు కేబినెట్ సహచరులు ఇప్పటికే రాజీనామా చేశా రు. ప్రతిపక్ష లేబర్ పార్టీ, మిత్రపక్షమైన డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ దీన్ని తీవ్రంగా విభేదిస్తున్నాయి. చీలిపోయిన పార్టీ దేశానికి దిశానిర్దేశకత్వం చేయలేదని బ్రిటిష్ మీడియా విశ్లేషిస్తోంది. క్రిస్మస్‌లోగా థెరిసా పదవి నుంచి తప్పుకోవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. బ్రెగ్జిట్ సాధ్యమా? నవంబరు 25న జరిగే ఈయూ ప్రత్యేక సమావేశంలో ఈ ఒప్పందంపై యూనియన్ నాయకులు సంతకాలు చేసే అవకాశముంది. దాని కంటే ముందు, ఈయూలోని 27 దేశాల్లో 65 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే 20 దేశాలు దీనిపై ఆమోదముద్ర వేయాలి. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఇవన్నీ డిసెంబరులోగా పూర్తి కావాల్సి వుంది. డిసెంబరులో బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సివుంది. నేడు అవిశ్వాసం..? నిబంధనల ప్రకారం – పార్లమెంట్లో 15శాతం మంది (48మంది ఎంపీలు) అవిశ్వాస లేఖలు సమర్పిస్తే ప్రధాని సాధ్యమైనంత త్వరగా సభ విశ్వాసం పొంది తీరాలి. ఇప్పటికి 21 మంది ఎంపీలు అవిశ్వాస లేఖలు సమర్పించినట్టు ప్రకటించారు. అయితే, ఈ సంఖ్య 48కి చేరిందని కొందరు కన్జర్వేటివ్ బ్రెగ్జిటీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం థెరిసా విశ్వాస పరీక్ష ముప్పును ఎదుర్కొంటున్నారు. ► నెట్సెన్ ఇటీవల జరిపిన సర్వే ప్రకారం – తాజాగా 59 శాతం మంది బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్నారు. (2016 జూన్ 23న జరిగిన రెఫరెండంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం, వ్యతిరేకంగా 48.1 శాతం ఓట్లు వచ్చాయి). ► ఈయూలో ఉండటం వల్ల బ్రిటన్ నష్టపోతున్నదంటున్నారు బ్రెగ్జిటీర్లు.. రాజకీయ సంకోభాన్ని నివారించాలంటే మరో రెఫరెండానికి వెళ్లాల్సిందేనని, పార్లమెంట్ రెఫరెండానికే ఓటు వేస్తుందని కన్సర్వేటివ్ పార్టీ ‘పీపుల్స్ ఓట్’ క్యాంపెయినర్లు భావిస్తున్నారు. ► బ్రెగ్జిట్ ముసాయిదా ఉభయ పక్షాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉందంటున్నారు ఈయూ మధ్యవర్తి మైఖేల్ బెర్నర్. దీనిపై మరోసారి చర్చలు జరిపేది లేదని జర్మనీ చాన్సరల్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ► ఈ ఒప్పందం బెస్ట్ డీల్.. ఒకవేళ బ్రెగ్జిట్ విషయంలో బ్రిటన్ వెనక్కి మళ్లినా అందుకు తాము సిద్ధమేనని అంటున్నారు ఈయూ అధ్యక్షుడు డొనాల్ట్ టస్క్. బ్రెగ్జిట్ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ► 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమిస్తుంది. తర్వాత మొదలయ్యే 21 మాసాల పరివర్తనా కాలంలో.. ఎటువంటి సుంకాలు లేకుండా ఈయూ–యూకే స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. ఈయూ నిబంధనలను బ్రిటన్ అనుసరించాల్సివుంటుంది. ► ఆర్థిక లావాదేవీల పరిష్కారంలో భాగంగా విడిపోయేటప్పుడు ఈయూకి బ్రిటన్ 39 బిలియన్ పౌండ్లు (5100 కోట్లు) చెల్లించాలి. ► పౌరుల నివాస హక్కులకు ఈ ఒప్పందం గ్యారెంటీ ఇస్తుంది. ఇప్పుడు వున్న చోటే చదువుకుని, ఉద్యోగాలు చేసే వీలుంటుంది. ► బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో భాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ప్రస్తుతానికి ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరు. రాకపోకలకు ఎలాంటి ఆంక్షలూ వుండవు. -
బ్రెగ్జిట్‌పై ముందుకే థెరెసా మే
లండన్: ప్రస్తుతం కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందంపై స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నా తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగేందుకే బ్రిటన్ ప్రధాని థెరెసా మే మొగ్గుచూపుతున్నారు. పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమేనన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రజల భయాలను పోగొట్టేందుకు వారడిగే ప్రశ్నలకు తానే జవాబుచెప్తానన్నారు. యురోపియన్ యూనియన్ (ఈయూ)తో థెరెసా కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం ముసాయిదా బుధవారం విడుదలైనప్పటి నుంచి మంత్రులు సహా కొందరు ఎంపీలు థెరెసాను వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం బ్రిటన్ ప్రజలకు మంచిదేననీ, తన దృక్పథంలో ఇది అత్యుత్తమ ఒప్పందమన్నారు. -
బ్రిటన్ ప్రభుత్వంలో ‘బ్రెగ్జిట్’ చిచ్చు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మే తన సొంత పార్టీ ఎంపీల నుంచే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ (యురోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం) వ్యవహారంలో మే వైఖరిని వ్యతిరేకిస్తూ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు థెరెసా మే ప్రభుత్వంపై గురువారం అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఈయూతో మే కుదుర్చుకుంటున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మంత్రివర్గంలోని నలుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఒప్పందం అర్ధరహితంగా, బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందని వారంతా ఆరోపిస్తున్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభమై 20 నెలల్లో ముగిసేలా ఓ ఒప్పందాన్ని థెరెసా మే ఈయూ తో కుదుర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు బుధవారం రాత్రే విడుదలైంది. బిల్లులోని నిబంధనలపై తన నిరసన తెలుపుతూ మొదటగా భారత సంతతి వ్యక్తి, ఉత్తర ఐర్లాండ్ శాఖ మంత్రి శైలేశ్ వర తన పదవికి రాజీనామా చేశారు. థెరెసా మేపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టాలంటే మే ప్రత్యర్థులకు ఆమె సొంత పార్టీ నుంచే కనీసం 48 మంది ఎంపీల మద్దతు కావాలి. వారు ఎలాగోలా ఇంత మందిని కూడగట్టినా.. మేను పదవి నుంచి దించడానికి మాత్రం 158 మంది మద్దతు అవసరం. అంతమంది మే ప్రత్యర్థుల వైపు లేరని తెలుస్తోంది. -
ఈయూపై ట్రంప్ కేసు వేయమన్నారు
లండన్: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలకు బదులు దానిపై కేసు వేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు సూచించారని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆదివారం వెల్లడించారు. నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ట్రంప్ శుక్రవారం మేతో భేటీ అవ్వడం తెలిసిందే. అంతకు రెండ్రోజుల ముందు కూడా.. మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్ వ్యూహాలను ట్రంప్ విమర్శించారు. శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ‘ఈయూతో ఎలా వ్యవహరించాలనే దానిపై నేను థెరెసాకు ఓ సలహా ఇచ్చాను. ఆమెకు అది బహుశా క్రూరమైనదిగా, చాలా క్లిష్టమైనదిగా అనిపించవచ్చు’ అని అన్నారు. ఆ సలహా ఏంటో చెప్పాలని ఓ విలేకరి ఆదివారం మేను కోరగా ‘నేను ఈయూతో చర్చలు జరపకుండా దానిపై కేసు వేయాలని ఆయన చెప్పా రు’ అని అన్నారు. అయితే తాను ఈయూతో చర్చలతోనే ముందుకెళ్తాననీ ఆమె చెప్పారు. -
బ్రిటన్‌లో ‘బ్రెగ్జిట్’ చిచ్చు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరీసామే చిక్కుల్లో పడ్డారు. సోమవారం ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడంతో.. బ్రిటన్ రాజకీయం వేడెక్కింది. బ్రెగ్జిట్ విషయంలో మే అనుసరిస్తున్న వ్యూహాలతో విభేదిస్తూ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ రాజీనామా చేయగా.. కాసేపటికే విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో బ్రెగ్జిట్ అనంతరం యురోపియన్ యూనియన్ దేశాలతో అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాలు తీసుకున్న మూడ్రోజుల్లోపే ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీనికితోడు వీరిద్దరూ బ్రెగ్జిట్ విధానపర నిర్ణయాలనే కారణంగా చూపుతూ రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చ మొదలైంది. థెరీసా మే రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. థెరీసా మే కేబినెట్లో బోరిస్‌కు బ్రెగ్జిట్ అనుకూల మంత్రుల పోస్టర్‌బాయ్‌గా పేరుంది. తిరుగుబాటు యోచన లేదు ప్రధాని థెరీసా మేతో విధానపరమైన అంశాల్లో విభేదాల కారణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్ ప్రకటించారు. ఈయూతో బ్రిటన్ ప్రభుత్వ చర్చల ప్రక్రియలో తనను సంప్రదించడంలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్ వెల్లడించారు. అయితే, మేకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తే ఆలోచన లేదని చెప్పారు. -
ఊరిస్తున్న బ్రిటన్ వీసా..
లండన్: విదేశీ వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూర్చేలా.. తన వలస విధానం(ఇమిగ్రేషన్ పాలసీ)లో మార్పులు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇమిగ్రేషన్ పాలసీలో సవరణల్ని ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బ్రిటన్ వ్యాపార సంస్థలు, కంపెనీలు తమ అవసరం మేరకు విదేశీ వృత్తి నిపుణుల్ని నియమించుకునేందుకు అవకాశం కల్పించేలా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ఈ సవరణల్లో ప్రతిపాదించారు. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం మన వృత్తి నిపుణులకు మేలు చేకూరుస్తుందని భారత ఐటీ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. విదేశీ వృత్తి నిపుణుల కోసం బ్రిటన్ జారీ చేస్తోన్న టైర్ 2 వీసాల ప్రక్రియలో ఇంతవరకూ కఠిన నిబంధనలు కొనసాగాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్ మానవవనరుల కొరతతో ఇబ్బందిపడుతోంది. దాన్ని అధిగమించేందుకు వలస విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వీసాల పరిమితిని సడలించడంతో పాటు.. ప్రస్తుతం కొనసాగుతున్న కఠిన నిబంధనల్ని సమీక్షించాలని ప్రతిపాదించింది. వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాలని స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని పార్లమెంటుకు తెలిపింది. బ్రిటన్ పార్లమెంట్ ప్రకటన ప్రకారం.. ‘ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేయడానికి వచ్చే వైద్యులు, నర్సుల్ని టైర్–2 వీసాల పరిధి నుంచి మినహాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని వెల్లడించారు. ప్రస్తుతం నెలకు 1,600 వరకూ టైర్ 2 వీసాలు జారీ చేస్తుండగా.. ఆ కేటగిరి నుంచి వైద్యులు, నర్సుల్ని మినహాయించడంతో భారతీయ వైద్యులు, నర్సులు లబ్ధి పొందనున్నారు. ఇతర కీలక వృత్తులను టైర్ 2 కేటగిరీ నుంచి మినహాయించవచ్చని భావిస్తున్నారు. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు టాలెంట్ వీసాను జారీ చేయనున్నట్లు సవరణల్లో బ్రిటన్ వెల్లడించింది. ఆహ్వానించదగ్గ పరిణామం: ఫిక్కీ బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిక్కీ, బ్రిటిష్ పరిశ్రమల సమాఖ్య స్వాగతించాయి. ‘భారతీయ నిపుణులు ఎంతో కాలంగా ఈ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టైర్ 2 వీసా కేటగిరీని సులభతరం చేయాలన్న బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో వృత్తి నిపుణులు బ్రిటన్‌లో పనిచేసేందుకు మార్గం సులభతరమవుతుంది. దీర్ఘకాలంలో బ్రిటన్ వ్యాపార సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుంది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) అధ్యక్షుడు రశేష్ షా అన్నారు. రెండు దేశాల మధ్య ఉత్సాహపూరితమైన వాణిజ్య, ఆర్థిక సంబంధాల కోసం స్వేచ్ఛాయుత, నిజాయితీ, పారదర్శకతతో కూడిన వీసా నిబంధనల కోసం ఫిక్కీ ప్రయత్నాలు చేసిందని ఆయన చెప్పారు. బ్రిటన్ వ్యాపార సంస్థలు ఈ సంస్కరణల్ని ఆహ్వానిస్తాయని, అంతర్జాతీయ నైపుణ్యం, ప్రతిభ బ్రిటన్ కంపెనీలకు కీలకమని బ్రిటన్ పరిశ్రమ సమాఖ్యకు చెందిన ముఖ్య అధికారి మాథ్యూ ఫెల్ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ఝలక్ బ్రిటన్‌లో విద్యార్థి వీసాలకు సంబంధించి ‘లో రిస్క్’ దేశాల జాబితా నుంచి భారత్‌ను మినహాయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వలస విధానం సవరణల్లో భాగంగా విదేశీ విద్యార్థులకు ఇచ్చే ‘టైర్ 4’ వీసాలకు సంబంధించి 25 దేశాల విద్యార్థులకు నిబంధనల్లో సడలింపు నిచ్చారు. ఈ జాబితాలో ఉన్న అమెరికా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎప్పటినుంచో సడలింపు కొనసాగుతుండగా.. తాజాగా చైనా, బహ్రైన్, సెర్బియా తదితర దేశాల్ని చేర్చారు. జూలై 6 నుంచి ఇది అమల్లోకి రానుంది. జాబితాలోని దేశాలకు చెందిన విద్యార్థులు పెద్దగా తనిఖీలు ఎదుర్కోవాల్సిన అవసరముండదు. అయితే మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోక తప్పదు. ఇది అవమానకరమని, తప్పుడు సంకేతాలు పంపుతుందని భారత సంతతి వ్యాపారవేత్త లార్డ్ కరణ్ బిలిమోరియా విమర్శించారు. -
బ్రిటన్ ‘వీసా’ సరళతరం!
లండన్: బ్రెగ్జిట్ తర్వాత తీవ్రమైన మానవవనరుల కొరతతో సతమతమవుతున్న బ్రిటన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలుచేస్తున్న వలస విధానం(ఇమిగ్రేషన్ పాలసీ)లో సవరణలను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచింది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలు మరింతమంది విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల భారత్‌కు చెందిన ఐటీ నిపుణులకు గణనీయమైన లబ్ధి కలగనుంది. ప్రస్తుతం వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాల్సిందిగా స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు టాలెంట్ వీసాను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేయడానికి వచ్చే నర్సులకు ఇస్తున్న టైర్–2 వీసాల గరిష్ట పరిమితిని బ్రిటన్ ఇంతకుముందు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. -
బ్రెగ్జిట్‌కు ముహూర్తం 2019, మార్చి 29
లండన్: ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ముహూర్తం ఖరారైంది. 2019, మార్చి 29, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈయూ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తామని ప్రధాని థెరిసా మే శుక్రవారం ప్రకటించారు. బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని చేరుస్తూ సవరణలు చేసిన తరువాత ఈయూ నిష్క్రమణ చట్టాన్ని వచ్చే వారంలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమని, ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధత, నిజాయతీపై సందేహం అక్కర్లేదని ‘ది డైలీ టెలిగ్రాఫ్’కు రాసిన వ్యాసంలో ఆమె తెలిపారు. చారిత్రక ఈయూ నిష్క్రమణ చట్టం ముందరి పేజీలోనే బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని స్పష్టంగా ప్రచురిస్తామని వెల్లడించారు. -
స్కాట్లాండ్ స్వాతంత్య్రంపై రెఫరెండం!
లండన్: బ్రెగ్జిట్ (ఐరోపా దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలగడం) నేపథ్యంలో స్కాట్లాండ్ ప్రయోజనాలను బ్రిటన్ పట్టించుకోవడం లేదనీ, కాబట్టి యూకే నుంచి స్కాట్లాండ్కు స్వాతంత్య్రం కోసం ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)కు పార్లమెంటు అనుమతి కోరతానని స్కాట్లాండ్ అధ్యక్షురాలు (ఫస్ట్ మినిస్టర్) నికోలా స్టర్జన్ సోమవారం అన్నారు. 2014లోనే స్కాట్లాండ్కు స్వాతంత్య్రంపై రెఫరెండం పెట్టగా అక్కడి ప్రజలు యూకేతో కలిసి ఉండటానికే ఓటు వేయడం తెలిసిందే. ‘యూకేతోపాటు స్కాట్లాండ్ కూడా ఐరోపా కూటమి నుంచి బయటకు రావాలా? స్వత్రంత్ర దేశంగా ఉండి అటు యూకేతోనూ, ఇటు కూటమితోనూ సంబంధాలను నెరపాలా? అనే రెండు ఎంపికలు ప్రజలకు ఉండేలా చర్యలు తీసుకుంటా’అని స్టర్జన్ చెప్పారు. -
‘పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాతే బ్రెగ్జిట్’
లండన్ : యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు రావాలంటే (బ్రెగ్జిట్) కచ్చితంగా పార్లమెంటులో చట్టం చేయాల్సిందేనని ఆ దేశ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో లిస్బన్ ఒప్పందం (ఈయూ రాజ్యాంగం) లోని ఆర్టికల్ 50 ప్రకారం మార్చి చివరి లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న బ్రిటిష్ ప్రధాని థెరిసా మేకు చుక్కెదురైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ న్యూబెర్జర్ మంగళవారం తీర్పు వెలువరించారు. బ్రిటన్ ఎంపీలు, మంత్రులు బ్రెగ్జిట్‌కు మద్దతు తెలిపేంత వరకు బ్రిటిష్ ప్రధాని ఈయూతో అధికారి కంగా చర్చలు జరప కూడదన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ.. బ్రిటిష్ ప్రజలు ఈయూ నుంచి వైదొలగాలని తీర్పు ఇచ్చారని, ఆర్టికల్ 50 ద్వారా మార్చి చివరిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయ డంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా కేసు వేసి ఉద్యమం నడిపిన భారత సంతతి మహిళ గినా మిల్ల ర్ సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. -
బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే
- రెండో మహిళా ప్రధానిగా పగ్గాలు - కామెరాన్ రాజీనామాకు రాణి ఆమోదం లండన్ : బ్రిటన్ రెండో మహిళా ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం పగ్గాలు చేపట్టారు. కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక థెరిసా భర్త ఫిలిప్‌తో కలసి అధికారిక నివాసమైన 10 డౌన్స్ట్రీట్లోకి అడుగుపెట్టారు. అక్కడ అప్పటికే వేచిఉన్న అంతర్జాతీయ మీడియానుద్దేశించి ప్రసంగించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటికొచ్చిన బ్రిటన్ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలైన 59 ఏళ్ల థెరిసా చెప్పారు. బ్రెగ్జిట్ రెఫరెండం తీర్పుతో ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన డేవిడ్ కామెరాన్ బుధవారం సాయంత్రం తన భార్య సమంతా, ముగ్గురు పిల్లలతో కలసి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ రాణి రెండో ఎలిజబెత్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ఆమె ఆమోదం తెలిపారు. తర్వాత థెరిసాను ప్రధానిగా పగ్గాలు చేపట్టాలని రాణి ఆహ్వానించారు. కామెరాన్ కేబినెట్లో హోంమంత్రిగా చేసిన థెరిసా.. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో పనిచేశారు. గత 50 ఏళ్లలో బ్రిటన్ హోం మంత్రిగా ఎక్కువ కాలం చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. కెరిసా ఇక కేబినెట్‌పై తనదైన ముద్ర వేయనున్నారు. కామెరాన్ మంత్రివర్గంలో ఉద్యోగకల్పన మంత్రిగా పనిచేసిన భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు థెరిసా కీలక శాఖను అప్పగించే అవకాశముంది. గుజరాత్‌కు చెందిన 44 ఏళ్ల ప్రీతి బ్రెగ్జిట్‌కు అనుకూలంగా గళమెత్తారు. మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధాని (1979-1990)గా పనిచేశారు. కామెరాన్ భారతీయ విందు.. ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటున్న సందర్భంగా కామెరూన్ తన సహచర మంత్రులకు, సన్నిహితులకు 10 డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయంలో వీడ్కోలు విందు ఇచ్చారు. హైదరాబాదీ శాఫ్రాన్ చికెన్, కశ్మీరీ రోగన్ జోష్, సమోసాలు, సాగ్ ఆలూ, శాగ్ పన్నీర్, పాలక్ గోస్ట్, రైస్ వంటి రుచికరమైన భారతీయ వంటకాలను ఏర్పాటు చేశారు. ఆరేళ్ల తర్వాత ప్రధానిగా ఆఖరి రోజును పూర్తి చేసుకున్న అనంతరం కామెరాన్ పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోతున్నప్పటికీ తాము ఈయూతో సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
బ్రెగ్జిట్ ఉద్యమనేత ఫారేజ్ రాజీనామా
లండన్ : యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ ఉద్యమించిన నిగెల్ ఫారేజ్.. తన లక్ష్యం నెరవేరిందని పేర్కొంటూ సోమవారం యూకే ఇండిపెండెంట్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ‘బ్రెగ్జిట్’ తన రాజకీయ లక్ష్యమని, దానిని నెరవేర్చానని, తనకు ఎటువంటి అధికార కాంక్షలూ లేవని, తన జీవితం మళ్లీ తనకు కావాలని కోరుకుంటున్నానని ఫారేజ్(52) చెప్పారు. 1999లో యూకేఐపీ నుంచి ఈయూ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఫారేజ్.. ‘నా వంతు పని నేను చేశానని నేననుకుంటున్నా’ అని అన్నారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటర్లను ఒప్పించడానికి ఫారేజ్ క్షేత్రస్థాయిలో ప్రత్యేక ప్రచారం చేపట్టి చాలా సభలు నిర్వహించి ప్రసంగించారు. -
లండన్ డిప్యూటీ మేయర్‌గా రాజేశ్ అగర్వాల్
లండన్: బ్రెగ్జిట్ కారణంగా లండన్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించటంలో మేయర్ సాదిక్ ఖాన్‌తో కలిసి క్రియాశీలకంగా వ్యవహరిస్తానని.. లండన్ కొత్త డిప్యూటీ మేయర్ (బిజినెస్)గా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తోపాటు ప్రపంచదేశాలకు లండన్ చాలా కీలక ప్రాంతమని.. అందుకే ఇక్కడ పరిస్థితులు కుదురుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు. విదేశీ మారక ద్రవ్య సేవల సంస్థకు సీఈవోగా ఉన్న రాజేశ్ అగర్వాల్‌ను బుధవారం లండన్ డిప్యూటీ మేయర్ (బిజినెస్)గా.. మేయర్ సాదిక్ ఖాన్ నియమించారు. లండన్‌తోపాటు బర్మింగ్‌హామ్, ఫ్రాన్స్, స్పెయిన్‌లోనూ రాజేశ్ వ్యాపారం విస్తరించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి లండన్‌కు వచ్చిన ఈయన.. చిన్న కంపెనీతో జీవితం ప్రారంభించి.. నేడు వేల కోట్లకు అధిపతయ్యాడు. -
బ్రిటన్ పీఠం కోసం రేసు మొదలు
లండన్: బ్రెగ్జిట్ రెఫరెండం నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన డేవిడ్ కామెరాన్ స్థానంలో కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు కన్సర్వేటివ్ పార్లమెంటు సభ్యుల మధ్య రేసు మొదలైంది. బ్రెగ్జిట్ అనుకూల శిబిరాన్ని ముందుండి నడిపిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ఈ పోటీలో ముందంజలో ఉన్నారు. హోంమంత్రిథెరెసా మే కూడా తనకు అనుకూలంగా బలమైన మద్దతు కూడగడుతున్నారు. అయితే.. ఉత్తమ ప్రధాని ఎవరు కాగలరంటూ యుగవ్ అనే సంస్థ చేసిన సర్వేలో బోరిస్ (18 శాతం) కన్నా థెరెసా(19 శాతం) వైపు స్వల్పంగా మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రెగ్జిట్ రెఫరెండం ద్వారా బ్రిటన్ వైదొలగడం తెలిసిందే. కాగా. బ్రిటన్ వైదొలగినా మనగలిగేంత బలంగా యూరోపియన్ యూనియన్ ఉందని జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మంగళవారం పేర్కొన్నారు. -
లేబర్ పార్టీలో ‘బ్రెగ్జిట్’ సంక్షోభం
పార్టీ అధ్యక్షుడు జెర్మీ కార్బిన్‌పై కీలక ఎంపీల తిరుగుబాటు - విదేశాంగ కార్యదర్శిపై వేటేసిన అధ్యక్షుడు జెర్మీ కార్బిన్ - నిరసనగా ఆరుగురు షాడో కేబినెట్ మినిస్టర్ల రాజీనామా - అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానంపై నేడు చర్చ.. రేపు రహస్య ఓటింగ్? లండన్: బ్రెగ్జిట్ రెఫరెండం ప్రభావం యూకే ప్రతిపక్ష లేబర్ పార్టీపై పెను ప్రభావాన్ని చూపింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. దీంతో పార్టీ చీఫ్ జెర్మీ కార్బిన్.. తన విదేశాంగ కార్యదర్శిపై వేటు వేయగా.. తదనంతర పరిణామాలతో ఆరుగురు షాడో కేబినెట్ మినిస్టర్లు (ప్రభుత్వానికి సలహాలు, సూచనలిచ్చే ప్రతిపక్ష పార్టీ కీలక నేతలు) రాజీనామా చేశారు. కార్బిన్ నాయకత్వంపై నమ్మకం తగ్గిపోతోందని షాడో విదేశాంగ కార్యదర్శి హిల్లరీ బెన్ అనడంతోనే వేటు పడింది. ‘జెర్మీకి ఫోన్ చేసి.. మీరు పార్టీ నేతగా ఉన్నంతకాలం బ్రిటన్‌లో అధికారంలోకి వస్తామనే నమ్మకం లేదని చెప్పాను. వచ్చే ఎన్నికలు చాలా కీలకమన్నాను. దీంతో నాపై వేటు వేశారు’ అని ఆమె తెలిపారు. ఒక వేళ కార్బిన్ అవిశ్వాసం ఎదుర్కొనేందుకు ఇష్టపడకపోతే రాజీనామాలు చేయండని తోటి షాడో కేబినెట్ సభ్యులతో చెప్పినట్లు వెల్లడించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే కార్బిన్ షాడో కేబినెట్ మంత్రులు హీదీ అలెగ్జాండర్ (ఆరోగ్యం), గ్లోరియా డీ పీరో (యూత్), అయాన్ ముర్రే (స్కాట్లాండ్ వ్యవహారాలు), సీమా మల్హోత్రా (ఆర్థిక, భారత సంతతి), లూసీ పావెల్ (టాన్స్‌పోర్టు), మెక్‌కార్తీ (పర్యావరణం) రాజీనామా చేశారు. మరికొందరు షాడో కార్యదర్శులు కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. రెఫరెండం ఫలితాన్ని ప్రభావితం చేయటంలో కార్బిన్ విఫలమయ్యారంటూ పలువురు లేబర్ పార్టీ ఎంపీలూ విమర్శిస్తున్నారు. ఇద్దరు లేబర్ ఎంపీలు కార్బిన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పార్టీ చైర్మన్ క్రైయర్కు అందజేశారు. దీనిపై సోమవారం పార్టీ భేటీలో చర్చించనున్నారు. చైర్మన్ అంగీకరిస్తే.. మంగళవారం రహస్య బాలెట్లో కార్బిన్‌పై అవిశ్వాస పరీక్ష జరగనుంది. లేబర్ పార్టీలో మెజారిటీ సభ్యులు ఈయూలోనే ఉండాలని వాదించినా ఓటర్లలో ఈ అభిప్రాయాన్ని కలిగించటంలో అధిష్టానం విఫలమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోసారి రెఫరెండానికి భారీ మద్దతు బ్రెగ్జిట్‌పై మళ్లీ రెఫరెండం నిర్వహించాలంటూ మొదలైన ఉద్యమానికి భారీ మద్దతు లభిస్తోంది. 48 గంటల్లోనే 30 లక్షల మంది ఈ ఆన్లైన్ పిటిషన్‌కు మద్దతు తెలిపారని యూకే పార్లమెంటు వెబ్సైట్ పేర్కొంది. లక్షమంది సంతకాలు చేసిన ఏ పిటిషన్‌నైనా హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చర్చిస్తారు. దీనికి 30 లక్షల మంది మద్దతుండటంతో.. మంగళవారం జరిగే హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చర్చకు రావొచ్చు. -
దండ దండగ యాత్రా?
భారత కంపెనీలకు కలసిరాని విదేశీ టేకోవర్లు టాటా స్టీల్ నుంచి రిలయన్స్ దాకా ఇదే తీరు కలిసొచ్చిన కాస్త కంపెనీలక్కూడా బ్రెగ్జిట్ దెబ్బ టాటా మోటార్స్, మదర్సన్ సుమీ... అన్నిటిదీ ఇదే తీరు యూరప్‌లో ఎక్కువ వ్యాపారం ఉండటమే కారణం ఇవి రాజులు... రాజ్యాల కథలు కావు. కంపెనీలు... దేశాల కథలు. మన కంపెనీలకు కాలం కలిసొచ్చి... విదేశీ కంపెనీల్ని కొన్నాయి. కలిపేసుకున్నాయి. కాకపోతే కాలం తిరగబడింది. కొన్న కంపెనీల నుంచి ఆదాయం లేక... మరింత పెట్టుబడి పెట్టలేక... అమ్మకానికి పెట్టాయి. కొన్న ధరకన్నా తక్కువకే అమ్మేస్తున్నాయి. టాటామోటార్స్, మదర్సన్ సుమీ వంటి కంపెనీల పరిస్థితి మాత్రం వేరు. వాటికి కొనుగోళ్లు కలిసొచ్చాయి. అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోతుండటం ఈ కాస్త విజయాల్ని కూడా కమ్మేసే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వీటి వ్యాపారాలు... లాభాలు అత్యధికం యూరప్ నుంచే వస్తున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వె ళితే... ఆయా కంపెనీలు బ్రిటన్‌తో పాటు ఈయూలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అనుమతులు క్లిష్టమవుతాయి. ఖర్చులు పెరిగి... ఆ ప్రభావం అమ్మకాలు, లాభాలపై పడుతుంది. దీంతో కలిసొచ్చిన దండయాత్రలు కూడా దండగయాత్రలుగా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏ కంపెనీ టేకోవర్ ఎలా మారిందనే విశ్లేషణే... ఈ వారం ‘ఫోకస్’ -సాక్షి, బిజినెస్ విభాగం 1 టాటా స్టీల్-కోరస్ ఫార్చ్యూన్-500 నుంచి రూ.20వేల కోట్ల నష్టాల్లోకి 2007లో ఆంగ్లో-డచ్ ఉక్కు దిగ్గజం కోరస్‌ను టాటా స్టీల్ సంస్థ కొనుగోలు చేసింది. అలా... టాటా గ్రూప్ బిటన్ ఉక్కు రంగంలోకి అడుగుపెట్టింది. నిజానికప్పుడు అదో సంచలనం. బ్రిటిష్ సంస్థను టాటాలు కొనుగోలు చేయటంతో దేశంలో భావోద్వేగ పూరిత శుభాభినందనలు కూడా వెల్లువెత్తాయి. దీనికోసం టాటా స్టీల్ నెలల తరబడి బ్రెజిల్‌కు చెందిన సీఎస్ఎన్ సంస్థతో హోరాహోరీగా పోటీ పడింది. 14 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించింది. చివరికి... సీఎస్ఎన్ కన్నా కేవలం 5 పెన్స్లకన్నా తక్కువకు బిడ్ వేయగలిగింది. అంటే మన కరెన్సీలో కేవలం ఐదు రూపాయలు. అలా కోరస్‌ను టేకోవర్ చేసింది. 25 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రపంచంలోనే 5వ అతి పెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఆవిర్భవించింది. ఫార్చ్యూన్ 500 బహుళ జాతి సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ సంస్థగా నిలిచింది. కానీ ఈ 5 పెన్స్‌ల విజయమిచ్చిన సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 2007లో టన్నుకు 550-575 డాలర్లున్న ఉక్కు రేటు (హాట్ రోల్డ్ కాయిల్స్) 2016లో 380 డాలర్లకు పడిపోయింది. కోరస్ కొనుగోలు కోసం సమీకరించిన భారీ రుణాలు ఒకవైపు.. కంపెనీ నష్టాలు మరోవైపు టాటా స్టీల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కోరస్‌ను కొన్నాక అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పరిస్థితులు దిగజారాయి. డిమాండ్ క్షీణించి, ధర పడిపోవటంతో గత ఐదేళ్లలో టాటా గ్రూప్ 2 బిలియన్ పౌండ్లు (దాదాపు రూ.20వేల కోట్లు) నష్టపోయింది. మరిన్ని పెట్టుబడులు పెట్టలేక... అమ్మేయాలని నిర్ణయించుకుంది. డిమాండ్ లేక కొనుగోలుదారులూ పెద్దగా ముందుకు రాలేదు. చివరకు లాంగ్ స్టీల్ వ్యాపారాన్ని, సంబంధిత ప్లాంటును మాత్రం విక్రయించగలిగింది. మిగిలిన వ్యాపారాన్ని తానే నిర్వహించాలని చూస్తున్నా... తాజా బ్రెగ్జిట్ దెబ్బ మరింత కుంగదీసే ప్రమాదం కనిపిస్తోంది. బ్రిటిష్ కంపెనీ కోరస్‌ను టాటా స్టీల్ టేకోవర్ చేయటం ఓ సంచలనం. హోరాహోరీ పోరులో కేవలం 5 పెన్స్‌ల తేడాతో దీన్ని చేజిక్కించుకుంది. కానీ భారీ నష్టాలతో యూకే ఆస్తుల్నిపుడు విక్రయిస్తోంది. 2 మిట్టల్ స్టీల్ - ఆర్సెలర్ నెంబర్-1 మిట్టల్.. అమ్మకాల పరంపర భారతదేశం నుంచి వలస వెళ్లి బ్రిటన్‌లో ఉక్కు వ్యాపారిగా ఎదగటమే లక్ష్మీ నివాస్ మిట్టల్ సాధించిన తొలి విజయం. నెదర్లాండ్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మిట్టల్ స్టీల్స్... 2006లో లగ్జెంబర్గ్‌కు చెందిన ఆర్సెలర్ స్టీల్‌ను ఏకంగా 32 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దాంతో ప్రపంచంలోనే నెంబర్-1 ఉక్కు కంపెనీగా నిలిచింది. మరి ఈ సమాచారం ఇండియాను ఎంత సంబరపరచిందో ఊహించటం కష్టమా!. కాకపోతే 2008 నుంచి మొదలైన మంద గమన ప్రభావం ఆర్సెలర్ మిట్టల్‌పై ఎక్కువే పడింది. ఉక్కుకు డిమాండ్ పడిపోయింది. దీంతో సంస్థకున్న 25 బ్లాస్ట్ ఫర్నేస్‌లలో తొమ్మిదింట ఉత్పత్తిని నిలిపేసింది. ఫ్రాన్స్‌లో రెండు ఫర్నేస్‌లను మూసేసింది. అదే ఏడాది తన యూరోపియన్ వ్యాపారం తాలూకు మొత్తం విలువను ఏకంగా 4.3 బిలియన్ డాలర్ల మేర తగ్గించి చూపించింది. రెండేళ్ల కిందట గ్రూప్‌లోని ఒక కంపెనీలో వాటాల్ని 770 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. రెండునెలల కిందట మార్చిలో సెంట్రల్ ట్రినిడాడ్ ప్లాంటును మూసి వేయటంతో పాటు... అమెరికాలోని రెండు ప్లాంట్లను అమ్మేయాలని కూడా నిర్ణయించింది. ఈ కథలు వేరు. భారీగా వెచ్చించి... టేకోవర్ చేసినా... తరవాత దాన్నుంచి లాభాలు రాబట్టలేక వెనక్కి తిరిగిన కథలు కావివి. విదేశీ కంపెనీని కొనుగోలు చేయటమే కాక... అందరి అంచనాలనూ తల్ల కిందులు చేస్తూ దాని రాతను మార్చేసిన భారతీయ కంపెనీల కథలివి. అయితే చరిత్రను తిరగరాసిన ఈ కంపెనీల్లో కొన్ని తాజా బ్రెగ్జిట్ దెబ్బకు తల్లకిందులయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వాటి విజయమే కాక... కార్యకలాపాలు కూడా యూరప్మీదే ఆధారపడ్డాయి మరి. ఎస్సార్ గ్లోబల్ - స్టాన్‌లో రిఫైనరీ రిఫైనరీ జాతకం మారింది... ఎస్సార్ గ్లోబల్‌లో ఎస్సార్ ఆయిల్ యూకే... 2011లో బ్రిటన్‌కు చెందిన స్టాన్‌లో రిఫైనరీని కొనుగోలు చేసింది. అప్పటిదాకా ఆ రిఫైనరీ షెల్ కంపెనీ యాజమాన్యంలో ఉండేది. ఇందుకోసం ఎస్సార్ సంస్థ 350 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఎస్సార్ ఆయిల్ ఇప్పటిదాకా ఆ రిఫైనరీపై దాదాపు 1.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అప్పట్లో దుర్భరమైన స్థితిలో ఉన్న పాత ప్లాంటు... ప్రస్తుతం బ్రిటన్‌లోని వ్యూహాత్మక రిఫైనరీల్లో ఒకటిగా ఎదిగింది. దేశంలో రవాణాకు ఉపయోగించే ఇంధనాల్లో 16% వాటాను ఇదే సరఫరా చేస్తోంది. (4.4 బిలియన్ లీటర్ల డీజిలు, 3 బిలియన్ లీటర్ల పెట్రోలు, 2 బిలియన్ లీటర్ల విమాన ఇంధనం). 3 హావెల్స్- సిల్వేనియా అద్భుతంగా ఎదిగినా... విదేశీ డీల్ ముంచింది... హావెల్స్. రాజస్థాన్ కేంద్రంగా విదేశాలకు సైతం విస్తరించిన దేశీ దిగ్గజం. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన హావెల్స్ ఇండియా... 2007లో తనకన్నా ఒకటిన్నర రెట్లు పెద్దదైన యూరోపియన్ కంపెనీ సిల్వేనియాను 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కాకపోతే ఆ డీల్ సంస్థకు ప్రాణాంతకమైంది. 2000లో రూ.100 కోట్ల నుంచి 2006లో రూ.1,600 కోట్ల స్థాయికి ఎగిసిన హావెల్స్... అప్పట్లో 60-70 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కంపెనీలను కొందామని పలు ప్రయత్నాలు చేసింది. అయినా కుదరలేదు. అదే సమయంలో దానికి ఐదారు రెట్ల విలువైన సిల్వేనియా ఆఫర్ వచ్చింది. దీంతో 300 మిలియన్ డాలర్లు వెచ్చించడానికి కూడా సై అంటూ ముందడుగు వేసేసింది. అప్పటి కరెన్సీ మారక విలువ ప్రకారం దాదాపు రూ. 2,000 కోట్లు వెచ్చించిన హావెల్స్, ఆ తర్వాత దాదాపు మరో రూ.1,000 కోట్లు కుమ్మరించింది. కానీ కంపెనీ అమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఇటీవలే 80 శాతం వాటాలను షాంఘై ఫెయిలో అకౌస్టిక్స్‌కు రూ. 1,340 కోట్లకు అమ్మేసింది. 4 శ్రీ రేణుకా షుగర్స్- డూబ్రెసిల్ కర్ణాటకలో హవా... బ్రెజిల్ దివాలా శ్రీరేణుకా షుగర్స్ అంటేనే సంచలనం. కర్ణాటకలో రైతులందరినీ ఒక్కటి చేసి... వారికి వాటాలిచ్చి మరీ ఆరంభించిన ఈ సంస్థ అతి త్వరగా అంతర్జాతీయ కీర్తిని సంపాదించింది. చక్కెర తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల జాబితాలో ఉన్న ఈ సంస్థ... 2010లో రూ.1,312 కోట్లతో బ్రెజిల్‌కు చెందిన రేణుక డూ బ్రెసిల్‌ను కొనుగోలు చేసింది. ఒక భారతీయ చక్కెర కంపెనీ... విదేశీ సంస్థను కొనుగోలు చేయడం అదే ప్రథమం. కానీ, సరిగ్గా ఏడాది తర్వాత 2011లో ఒకసారి, ఆపైన 2014లో మరోసారి బ్రెజిల్లో ఏర్పడ్డ కరవు పరిస్థితులు కంపెనీని దెబ్బతీశాయి. బ్రెజిల్ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, చక్కెర ధరలు పడిపోవడం దీనికి తోడయ్యింది. ఈ పరిణామాలతో రేణుకా బ్రెసిల్ దివాలా పిటిషన్ వేయాల్సి వచ్చింది. 5 ఎయిర్టెల్- జయిన్ రీఛార్జ్ చేయించలేక.. ఎయిర్టెల్ ఆఫ్రికా కాల్ కట్ దేశీ టెలికం రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎయిర్టెల్ సంస్థ... విదేశాల్లో విస్తరణకు అప్పట్లో రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆఫ్రికన్ టెలికం సంస్థ ఎంటీఎన్‌ను కొనేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తరవాత కువైట్ టెలికం కంపెనీ ‘జయిన్’ రూపంలో అవకాశం వచ్చింది. ఆఫ్రికాలోని 17 దేశాల్లో తమ టెలికం వ్యాపారాన్ని విక్రయిస్తామని ఆ సంస్థ ముందుకొచ్చింది. అవకాశం కోసం చూస్తున్న ఎయిర్టెల్... 2010లో ఏకంగా 10.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 73,211 కోట్లు) కొనేసింది. కొంత కసరత్తుతో భారీ లాభాలొస్తాయనుకున్న ఎయిర్‌టెల్‌కు మెల్లగా పరిస్థితి అర్థమయింది. ఒకవైపు లాభాలు లేవు. మరోవంక ఆఫ్రికాలో పాతుకుపోయిన ఎంటీఎన్‌ను అందుకోవడం తేలిక కాదని తెలిసింది. 2012 నుంచీ తమ నెట్‌వర్క్‌లు, ఐటీ కార్యకలాపాలను అవుట్సోర్సింగ్కు ఇచ్చి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంది. 2015 డిసెంబర్ క్వార్టర్లో ఆఫ్రికా యూనిట్ 74 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.506 కోట్లు) నష్టాన్ని ప్రకటించింది. తట్టుకోలేక 2016 జనవరిలో సియెరా లియోన్, బుర్కినా ఫాసో దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్ని ఫ్రాన్స్‌కి చెందిన టె లికం సంస్థ ఆరెంజ్‌కు ఎయిర్టెల్ విక్రయించింది. 2015 అక్టోబర్‌లో ఆఫ్రికాలోని 8,300 మొబైల్ టవర్లను 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 11,000 కోట్లు) అమ్మేసింది. తాగాగా మిగిలిన 3,700 టవర్లను కూడా విక్రయించడానికి ఒప్పందం చేసుకుని... టవర్ల వ్యాపారం నుంచి బయటపడింది. వ్యాపారం మొత్తాన్ని అమ్మేసే పరిస్థితి లేకపోవడంతో పార్టు పార్టుగా అమ్మాల్సి వస్తోందనేది నిపుణుల మాట. ఇండియా వేరు. ఆఫ్రికా వేరని ఎయిర్‌టెల్‌కు ఇప్పుడు తెలిసొచ్చింది. 10.7 బిలియన్ డాలర్లు పెట్టి గల్ఫ్ కంపెనీ జయిన్కు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని టేకోవర్ చేసింది. ఇపుడు వదిలించుకుంటోంది. జీవీకే టు అదానీ... ⇒మన కంపెనీల విదేశీ వేటలో... అటు కలిసిరాక, ఇటు రద్దవక అలా ఊగిసలాడుతున్న డీల్స్ చాలానే ఉన్నాయి. ళీ జీవీకే -హ్యాంకాక్ సంస్థలు కలిసి ఆస్ట్రేలి యాలోని గెలీలీ బేసిన్లో భారీ బొగ్గు గనులను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే రకరకాల ఇబ్బందులతో ఇది ముందుకు సాగటం లేదు. రుణభారం పెరుగుతోంది. ⇒ఆస్ట్రేలియాలోని కోలీలో బొగ్గు వెలికితీతకు గ్రిఫిన్ కోల్ మైన్స్‌తో ల్యాంకో ఒప్పందం చేసుకుంది. గ్రిఫిన్ కోసం ల్యాంకో 600 మి. డాలర్లు వెచ్చించింది. రూ.37వేల కోట్ల రుణ భారమున్న ల్యాంకోకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వడ్డీల భారం పెరుగుతోంది. ⇒ఆస్ట్రేలియాలోని అబాట్ పాయింట్ పోర్టు లో అదానీ గ్రూప్ దాదాపు మూడు బిలియన్ డాలర్ల దాకా వెచ్చించింది. మరో 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసుకుంది. కాకపోతే అక్కడి ప్రాజెక్టులకు పర్యావరణపరమైన అనుమ తులు రావటం లేదు. న్యాయ వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. 6 రిలయన్స్- ఈగిల్ఫోర్డ్ షేల్ గ్యాస్ షేల్‌గ్యాస్‌లో వేలుపెట్టి ఊపిరాడని రిలయన్స్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశంలో నెంబర్-1 పెట్రో కెమికల్స్ కంపెనీ. చేతిలో డబ్బులుండటంతో వ్యాపార విస్తరణకున్న అవకాశాలన్నిటినీ అన్వేషించింది. అప్పుడప్పుడే షేల్ గ్యాస్‌కు బాగా ప్రాచుర్యం రావటంతో... అందులో పెట్టుబడి బంగారాన్ని పండిస్తుందని అంచనా వేసింది. అప్పట్లో ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగటమూ రిలయన్స్ ఆలోచనకు ఒక కారణం. దీంతో 2010లో అమెరికాలోని ఈగిల్ ఫోర్డ్ షేల్ గ్యాస్ ప్రాజెక్టులో 1.31 బిలియన్ డాలర్లు వెచ్చించి 45 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ వెంటనే పయోనీర్ సంస్థ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో దాదాపు 3.91 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. మొత్తమ్మీద 3 కంపెనీలతో మూడు జాయింట్ వెంచర్ల ద్వారా (అట్లాస్ ఎనర్జీ, కారిజో ఆయిల్ అండ్ గ్యాస్, పయోనీర్ నేచురల్ రిసోర్సెస్) అమెరికా షేల్ గ్యాస్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కాలుపెట్టింది. ఆర్థిక మాంద్యంతో ఇంధన వాడకం తగ్గింది. కానీ ప్రపంచవ్యాప్తంగా వాటిని ఉత్పత్తి చేస్తున్న దేశాలు తమ ఉత్పత్తిని మాత్రం తగ్గించలేదు. ఫలితం... డిమాండ్ తగ్గి, అమ్మకం రేటుకంటే ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. సాధారణంగా షేల్ గ్యాస్‌పై పెట్టే భారీ పెట్టుబడులపై లాభం రావాలంటే చమురు రేటు బ్యారెల్‌కు కనీసం 60 డాలర్లయినా ఉండాలి. సంప్రదాయ విధానాల్లో ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య దేశాలకు బ్యారెల్ 25 డాలర్లున్నా లాభాలే. ఒకప్పుడు 147 డాలర్లకు వెళ్లిన క్రూడాయిల్ ధర కొన్నాళ్లుగా 40-45 డాలర్ల దగ్గరే తిరుగుతోంది. నష్టాల్ని తట్టుకోలేని రిలయన్స్... ఈగిల్ ఫోర్డ్ పైప్‌లైన్ అసెట్స్‌ను 2015లో 1.07 బి. డాలర్లకు విక్రయించేసింది. టాటా మోటార్స్- జేఎల్ఆర్ లక్షకారే కాదు.. కోట్లకారూ మాదే టాటా మోటార్స్‌ది ఆది నుంచీ భారీ వాహనాల వ్యాపారమే. 1998లో తొలిసారి కార్లలోకి దిగింది. ఇండికాను మార్కెట్లోకి తెచ్చింది. మొదట్లో దానికొచ్చిన స్పందన అంతంతే. కార్ల వ్యాపారాన్ని అమ్మేస్తే మంచిదన్నారు కొందరు. అది తెలిసి ఫోర్డ్ అధికారులు కొందరు ముంబయిలోని టాటా కార్యాలయానికి వచ్చారు. చర్చల అనంతరం... డెట్రాయిట్ రావాలని పిలిచారు. 1999లో ఓ బృందం వెళ్లింది. అక్కడ ఎదురైన అనుభవమేంటో తెలుసా? ‘‘అయినా అనుభవం లేకుండా ఈ బిజినెస్‌లోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీకు ఉపకారం చేయడానికి మీ వ్యాపారాన్ని కొనాలా?’’ అంటూ అవమానించారు. ఆ అధికారులు న్యూయార్క్‌కు తిరిగి వచ్చారు. రతన్‌టాటాకు విషయం చెప్పారు. సరిగ్గా తొమ్మిదేళ్ల తరవాత... 2009లో అదే ఫోర్డ్‌కు చెందిన జాగ్వార్, ల్యాండరోవర్ బ్రాండ్లను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం సందర్భంగా ఫోర్డ్ మోటార్స్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ఏమన్నారో తెలుసా? ‘‘మా జేఎల్ఆర్ను కొని మాకు పెద్ద ఉపకారం చేశారు’’ అని. అలా... టాటామోటార్స్ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. నిజానికి ప్రపంచానికి ఇష్టమైన లగ్జరీ బ్రాండ్ జేఎల్ఆర్ను కొనటానికి టాటా ముందుకెళ్లినపుడు కూడా విపరీతమైన అవమానకర వ్యాఖ్యలు వినపడ్డాయి.‘‘ఏదో లక్ష రూపాయల నానో కారు తయారు చేసుకునే కంపెనీ..! అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లను నిర్వహించటం ఎలా కుదురుతుంది? ఫోర్డ్ వల్లే కానిది టాటా వల్ల ఏమవుతుంది?’’ అంటూ బోలెడన్ని విమర్శలు. పెదవి విరుపులు. కానీ రతన్ టాటా పట్టు వదల్లేదు. 2008లో జేఎల్ఆర్ బ్రాండ్లను సొంతం చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. వాటిని టర్న్ అరౌండ్ చేశారు. అమ్మకాలు పెంచారు. విమర్శించిన వాళ్లే తరవాత నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం టాటా మోటార్స్‌కి బిలియన్ల కొద్దీ పౌండ్ల లాభాలను ఆర్జించి పెడుతోంది జేఎల్ఆర్. లక్ష కారే కాదు... లక్ష డాలర్ల కారునూ తామే తయారు చేస్తామని నిరూపించారు. కాకపోతే బ్రెగ్జిట్ పెద్దదెబ్బే కొట్టింది. వ్యూహం ఎలా మార్చుకుంటారో చూడాల్సిందే!!. మదర్సన్ సుమి-పెగ్యుఫామ్ కస్టమర్ల సూచన.. కంపెనీకి కలిసొచ్చింది మదర్సన్ సుమి సిస్టమ్స్. పాసింజర్ కార్ల అద్దాలు, వైరింగ్‌కు సంబంధించి హార్నెస్‌లను (హోల్డర్), ప్లాస్టిక్ ఉపకరణాలను తయారు చేసే ఈ సంస్థ దేశంలో ఈ తరహా ఉత్పత్తుల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించింది. విదేశీ దిగ్గజాలు ఫోక్స్ వ్యాగన్, దైమ్లర్ వంటివి ఈ కంపెనీకి కస్టమర్లే. అలాంటి మదర్సన్ సుమీ... 2008లో యూకేకు చెందిన విజియోకార్ప్ను కొనుగోలు చేసింది. దీన్ని కొనుగోలు చేస్తే పనికొస్తుందని మదర్సన్కు సలహా ఇచ్చింది వేరెవరో కాదు. దాని కస్టమర్ దైమ్లర్. తననుంచీ కాంట్రాక్టులొస్తాయని దైమ్లర్ చెప్పింది. ఇక 2011లో జర్మనీకి చెందిన పెగ్యుఫామ్ గ్రూప్‌లో 80 శాతం వాటాలను మదర్సన్ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.890 కోట్లు వెచ్చించింది. అప్పటికి అంతంతమాత్రం పనితీరుతో ఉన్న పెగ్యుఫామ్ను... 2014లో అమెరికన్ కంపెనీ స్టోన్ రిడ్జ్కు చెందిన వైరింగ్ విభాగాన్ని కొనుగోలు చేసింది. ఈ మూడూ కొన్నపుడు సమస్యల్లోనే ఉన్నాయి. ఆ తరవాత పనితీరు మెరుగుపడి మదర్సన్ ఆదాయలు పెంచి... అంతర్జాతీయ కంపెనీగా మార్చాయి. అతిగా యూరప్పైన, యూకేపైన ఆధారపడటం వల్ల ఇది మున్ముందు పెను సవాళ్లు ఎదుర్కోక తప్పేట్టు లేదు. 2006లో టాటా స్టీల్ కోరస్ గ్రూప్ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం 12,780 మి.డాలర్లు. 2010లో భారతీ ఎయిర్టెల్ జయిన్ ఆఫ్రికా కార్యకలాపాల టేకోవర్‌కు పెట్టిన మొత్తం 10,700 మి.డాలర్లు. 2007లో నోవెలిస్కు హిందాల్కో పెట్టిన మొత్తం 5,706 మి.డాలర్లు. 2008లో జేఎల్ఆర్కు టాటా వెచ్చించిన మొత్తం 2,300 మి.డాలర్లు. ఎస్సార్ స్టీల్ అల్గోమా కోసం ఎస్సార్ గ్లోబల్ 1,421 మి.డాలర్లు పెట్టింది. శ్రీరేణుకా షుగర్స్‌ను దెబ్బతీసింది మాంద్యం కాదు... కరువు. బ్రెజిల్ చక్కెర కంపెనీని టేకోవర్ చేసినా... అక్కడొచ్చిన రెండు కరువులు కంపెనీని దెబ్బతీశాయి. విజయాలకు గానీ, పరాజయాలకు గానీ కీలకమైన కారణాలు ఒకటి- టైమింగ్. రెండోది - కొనుగోలు వ్యయం. టైమింగ్ విషయానికొస్తే... 2008 వరకూ అంతర్జాతీయంగా కంపెనీలకు మహర్దశ నడిచింది. 2009 తరవాత విలువలు క్షీణించాయి. 2011 తరవాత ఘోరంగా తగ్గాయి. ఆర్సెలర్‌ను మిట్టల్ 2006లో... కోరస్‌ను టాటా 2007లో... సిల్వేనియాను హావెల్స్ 2007లో కొన్నాయి. అప్పట్లో వాటి ధరలు గరిష్ఠంగా ఉన్నాయి. ఇక కొనుగోళ్లకు భారీ అప్పులు చేసిన కంపెనీలు కూడా తట్టుకోలేకపోయాయి. -
యూకే విహారయాత్ర 10 శాతం చౌక
బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో పౌండ్ విలువ క్షీణించడం వల్లే... విహార యాత్ర కోసం యూకే వెళ్లాలనుకుంటున్నారా? అయితే తక్షణమే ప్యాకేజీ సొమ్మును పూర్తిగా చెల్లించేయండి. ఎందుకంటే... బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో రూపాయితో పౌండ్ మారకం విలువ 10 శాతం క్షీణించడంతో మీ విహార యాత్ర ఖర్చు ఆ మేరకు తగ్గనుంది. పౌండ్ విలువలో క్షీణత వల్ల ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్‌లకు హాలిడే ట్రిప్పులు 10 శాతం చౌకగా లభించనున్నాయి. ఇప్పటికే హాలిడే ప్యాకేజీలు బుక్ చేసుకొని బస, స్థానిక రవాణా, పర్యాటక ప్రదేశాల సందర్శన వంటి వాటికి ఇంకా సొమ్ము చెల్లించని వారూ చార్జీల్లో 10 శాతం మేర లబ్ధి పొందొచ్చు. ఉదాహరణకు ఏడు రోజుల యూకే ప్యాకేజీ (రూ. 1.1 లక్షలు)పై రూ. 5 వేల నుంచి రూ. 6 వేలు, 10 రోజుల ప్యాకేజీ (రూ. 1.44 లక్షలు)పై రూ. 7 వేల నుంచి రూ. 8 వేలు తగ్గనుంది. -
ఈయూ.. బై బై..
యూరోపియన్ యూనియన్‌లో ఉండలేమని తేల్చిన బ్రిటన్ వాసులు - బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం మంది ఓటు - రాజీనామా చేస్తానంటూ బ్రిటన్ ప్రధాని ప్రకటన - అంతర్జాతీయంగా మార్కెట్ల అతలాకుతలం - స్టాక్స్, కరెన్సీలు, ముడిచమురు దారుణ పతనం - సురక్షిత పెట్టుబడిగా బంగారం మెరుపులు - మున్ముందు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు ప్రభావం ఇలా.. పౌండు చరిత్రాత్మక పతనం.. డాలర్ డ్రీమ్స్.. రూపాయి క్రాష్ బ్రిటన్‌తో లింకుంటే కుదేలే!! ఐటీలో అనిశ్చితి తప్పదు: నాస్కామ్ ఆందోళన అక్కర్లేదు: జైట్లీ భయపడొద్దు: రాజన్ బ్రిటన్‌తో విడిపోతాం - ఈయూతో కలిసుంటాం - బ్రెగ్జిట్ ఫలితాల నేపథ్యంలో స్కాట్లాండ్ అడుగులు - ఉత్తర ఐర్లాండ్‌లోనూ ఇవే డిమాండ్లు బ్రిటన్ పోతే పోనీ! డొనాల్డ్ టస్క్, ఈయూ అధ్యక్షుడు బ్రెగ్జిట్ ప్రభావం తమపై ఉండదని.. మిగిలిన 27 దేశాలతో కలిసి కూటమి బలంగానే ఉంటుందని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. రెఫరెండంపై బ్రిటన్లు పిచ్చి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఈయూలోని 27 దేశాల ప్రతినిధిగా చెబుతున్నా. మా ఐక్యత కొనసాగుతుంది’ అని టస్క్ తెలిపారు. ప్రజాతీర్పు వెల్లడైనందున ఈయూ నుంచి బ్రిటన్ వీలైనంత త్వరగా వెళ్లిపోయేలా ప్రయత్నాలు ప్రారంభించాలన్నారు. అనవసర ఆలస్యం వల్ల అనిశ్చితి పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే.. బ్రిటన్ నిర్ణయంతో తమ కూటమిలో చీలిక వస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని ఈయూ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్ తెలిపారు. నిర్ణయాన్ని గౌరవిస్తాం అమెరికా అధ్యక్షుడు ఒబామా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల నిర్ణయాన్ని తమ దేశం గౌరవిస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. యునెటైడ్ కింగ్డమ్తోపాటు యూరోపియన్ యూనియన్ ఎప్పటిలాగే అమెరికా భాగస్వాములుగా కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌లో జరిగిన రెఫరెండం ఫలితాలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. బ్రెగ్జిట్ అనంతర సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు ప్రశాంతమైన, స్థిరమైన, అనుభవం గల నాయకత్వం అవసరమని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. బ్రిటన్ ప్రజల ఎంపికను గౌరవిస్తున్నానంటూ ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇక సెలవ్!: డేవిడ్ కామెరాన్ (బ్రిటన్ ప్రధాని) ఈ చారిత్రక నిర్ణయంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవినుంచి తప్పుకోనున్నారు. బ్రెగ్జిట్ వ్యతిరేక వాదనను ముందుండి నడిపించిన కామెరాన్.. ఇకపైనా దేశాభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉంటుందని.. కొత్త నాయకత్వం దేశాన్ని ముందుకు నడపాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. టెన్ డౌనింగ్‌స్ట్రీట్ (యూకే ప్రధాని అధికారిక నివాసం) ముందు శుక్రవారం భార్య సమంతతో కలిసి ఉద్వేగంగా మాట్లాడిన కామెరాన్ ‘రెఫరెండం ప్రజాస్వామ్య విజయం. చారిత్రక నిర్ణయం. ఇందులో ప్రజల నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఫలితాలపై ఎటువంటి సందేహం లేదు. ఈ నిర్ణయం వల్ల మార్కెట్లకు వచ్చే ప్రమాదం లేదని, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందని.. ప్రపంచ దేశాలకు భరోసా ఇస్తున్నాను’ అని తెలిపారు. అక్టోబర్‌లో జరగనున్న కన్సర్వేటివ్ కాన్ఫరెన్స్‌లో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారన్నారు. విజయం సాధించిన బ్రెగ్జిట్ అనుకూల వర్గానికి కామెరాన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజా నిర్ణయంతో బ్రిటన్‌లో ఉన్న ఇతర యూరోపియన్ దేశాల ప్రజలకు, యూరోపియన్ దేశాల్లో ఉన్న బ్రిటన్లకు ప్రస్తుతానికి ఎలాంటి సమస్యా లేదని ఇప్పటివరకున్నట్లుగానే వస్తువులు, సేవల విషయంలో పెద్ద మార్పులేమీ ఉండవని కామెరాన్ తెలిపారు. ఇకపై యురోపియన్ యూనియన్‌తో చర్చించాల్సిన అంశాలపై వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరేళ్లపాటు యూకే ప్రధానిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందన్న కామెరాన్.. తమ ప్రభుత్వం విద్య, సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల, దృఢమైన సమాజ నిర్మాణంలో కృషి చేసి విజయం సాధించిందన్నారు. సోమవారం సమావేశం కానున్న బ్రిటన్ కేబినెట్.. కామెరాన్ పదవినుంచి తప్పుకునేందుకు తదుపరి చేయాల్సిన పనులను నిర్ణయించనుంది. 48.1 వ్యతిరేకం బ్రెగ్జిట్ అనుకూలం 51.9 సర్దుకునేందుకు కొంత సమయం: బోరిస్ జాన్సన్ (బ్రెగ్జిట్ ఉద్యమ నేత) రెఫరెండం తీర్పుతో ఉన్నపళంగా ఈయూతో తెగదెంపులు జరగవని.. అంతా సర్దుకునేందుకు కొంత సమయం పడుతుందని.. బ్రెగ్జిట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ తెలిపారు. ‘ఇది ప్రజా నిర్ణయం. ప్రజాస్వామ్య విజయం. ప్రజలు తమ నిర్ణయాన్ని ధైర్యంగా తెలియజేశారనేదానికి ఇదే నిదర్శనం. అయితే రెఫరెండంతో ఉన్నపళంగా మార్పులు సాధ్యం కాదు. అన్ని సర్దుకునేందుకు కొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ప్రధాని కామెరాన్‌పై బోరిస్ ప్రశంసలు కురిపించారు. ‘కామెరాన్ మా తరం చూసిన అసాధారణ నాయకుడు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ధైర్యమున్న వ్యక్తి’ అని కొనియాడారు. యురోపియన్ యూనియన్ గొప్ప ఆలోచన.. కానీ ఇది బ్రిటన్‌కు సరిపోదని అభిప్రాయపడ్డారు. ఎప్పటికీ బ్రిటన్ యూరప్‌లో భాగమేనన్నారు. ఈయూ నుంచి విడిపోతామంటూ చరిత్రాత్మక నిర్ణయం లండన్: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవటం) వివాదంపై బ్రిటన్లు శుక్రవారం చారిత్రక నిర్ణయాన్ని వెలువరిచారు. ఈ వివాదంపై నాలుగు నెలల ఉత్కంఠకు తెరదీస్తూ.. ఈయూతో నాలుగున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకునేందుకే మెజారిటీ బ్రిటన్లు మొగ్గుచూపారు. దీంతో, ఈయూలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్.. ఈయూనుంచి తప్పుకోనున్న రెండో దేశంగా (గ్రీన్లాండ్ తర్వాత) నిలిచింది. గురువారం జరిగిన రెఫరెండంలో 51.9 శాతం మంది బ్రెగ్జిట్‌కే మద్దతు తెలిపారు. యూకే ఎన్నికల కమిషన్ చీఫ్ జెన్నీ వాట్సన్ ప్రతిష్ఠాత్మకమైన మాంచెస్టర్ టౌన్‌హాల్ నుంచి ఈ ఫలితాలను వెల్లడించారు. దాదాపు 3.3 కోట్ల మంది బ్రిటన్లు (ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్, జీబ్రాల్టర్) రెఫరెండంలో పాల్గొనగా 1.74 కోట్ల మంది (51.9 శాతం) విడిపోవాలని.. 1.61 మంది (48.1 శాతం) ఈయూతో కలిసుండాలని తమ నిర్ణయాన్ని తెలియజేశారు. బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటర్ల మధ్య తేడా 12.69 లక్షలు మాత్రమే. లండన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో ఎక్కువ మంది యురోపియన్ యూనియన్లోనే ఉండాలని తమ అభిప్రాయాన్ని తెలపగా.. ఉత్తర, మధ్య ఇంగ్లాండ్, వేల్స్, మెజారిటీ ఇంగ్లీష్ కౌంటీలు మాత్రం బ్రెగ్జిట్‌కే మొగ్గుచూపాయి. రెఫరెండం ఫలితంతో.. త్వరలోనే ప్రధాని పదవినుంచి తప్పుకోనున్నట్లు బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరాన్ వెల్లడించారు. దేశాన్ని తదుపరి మజిలీకి తీసుకెళ్లటంలో తను సరైన వ్యక్తిని కాన్నారు. మూడు నెలల తర్వాత యూకేకు కొత్త ప్రధాని వస్తారని..ఆయన నాయకత్వంలోనే దేశం ముందుకెళ్తుందని కామెరాన్ స్పష్టం చేశారు. కామెరాన్ వారసుడిగా బ్రెగ్జిట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ పేరు వినబడుతోంది. పలువురు కన్జర్వేటివ్ పార్టీ నేతలూ పీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బ్రెగ్జిట్తో స్కాట్లాండ్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈయూలో యూకే కలిసుండాలని బలమైన ప్రజాభిప్రాయాన్ని తెలిపిన స్కాట్లాండ్.. తాజా ఫలితంతో.. యూకే నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఈయూలో కలవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జియాన్ ఈ విషయాన్ని చూచాయగా వ్యక్తం చేశారు. రెఫరెండం తర్వాత దేశం రెండుగా విడిపోయిందని.. అమెరికా, భారత్, చైనావంటి దేశాలతో ఈయూతో కలిసి వ్యాపారం చేసే అవకాశాన్ని కోల్పోయిందని కామెరాన్‌కు అత్యంత సన్నిహితుడైన భారత సంతతి ఎంపీ అలోక్ శర్మ తెలిపారు. బ్రెగ్జిట్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో పాటు వలసలపై కొత్త చర్చకు తెర లేచింది. ఇకపై యురోపియన్ దేశాలు, భారత్‌తోపాటు ప్రపంచ దేశాలతో బ్రిటన్ కొత్త వాణిజ్య బంధాలను నిర్వచించుకోవాల్సి ఉంటుంది. జర్మన్ చాన్స్‌లర్ అంజెలా మెర్కెల్ రెఫరెండాన్ని ఈయూకు పెద్ద దెబ్బ అని తెలపగా.. ఇది చాలా తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. ఈయూ పతనం మొదలైందని వస్తున్న వార్తలను యురోపియన్ కమిషన్ చీఫ్ జీన్ క్లాడ్ జంకర్ ఖండిచారు. కాగా, బ్రిటన్ నిర్ణయంతో నెదర్లాండ్స్, ఇటలీ కూడా రెఫరెండం ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాందిశీకులే అసలు సమస్య! బయటకు ఎన్ని కారణాలు చెబుతున్నా... ప్రస్తుతం ఈయూ దేశాల్ని కుదిపేస్తున్నది కాందిశీకుల సమస్యే. ఈయూ ఒప్పందాల ప్రకారం ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రజలు వలస వెళ్లొచ్చు. దీంతో ఆర్థిక అస్తవ్యస్థ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దేశాల నుంచి, సిరియా, ఇరాక్ వంటి కల్లోల దేశాల నుంచి బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాలకు లక్షల మంది తరలివస్తున్నారు. పలుచోట్ల వలసదారుల సంఖ్య పెరుగుతోంది. ఇది సామాజిక మార్పులకూ దారితీస్తోంది. పెపైచ్చు వారికి భృతి చెల్లిస్తూ... ఉద్యోగాలిప్పిస్తున్నా చాలామంది చేయటం లేదు. సులభంగా భృతి అందుకుని జీవించడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇది పన్ను చెల్లింపుదారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. కాందిశీకులపై రేగుతున్న అసంతృప్తి ఏ స్థాయికి వెళ్లిందంటే... ‘ఈయూ’లో బ్రిటన్ కొనసాగాలని ప్రచారం చేస్తున్న బ్రిటన్ మహిళా ఎంపీని వారం రోజుల కిందట ఓ అగంతకుడు కాల్చిచంపాడు. రెఫరెండంలో ప్రతిఫలించింది కూడా ఈ ఆవేదన... ఆగ్రహమే!!. -
‘బ్రెగ్జిట్’పై జర భద్రం!
♦ భారత్ వాణిజ్య సంఘాల సూచన ♦ ఎదుర్కొనడానికి భారత్ సిద్ధంగా ♦ ఉండాలంటున్న అసోచామ్ న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే (బ్రెగ్జిట్) ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనడానికి భారత్ సిద్ధం కావాలని, బ్రిటన్ పరిణామాలతో భారత్ ప్రయోజనాలు ముడివడి ఉన్నాయని అసోచామ్‌సహా పలు వాణిజ్య సంఘాలు మంగళవారంనాడు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. గురువారం కీలక ప్రజాభిప్రాయం నేపథ్యంలో వాణిజ్య సంఘాలు ఈ సూచన చేయడం గమనార్హం. బ్రిటన్, యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితుల వల్ల దీర్ఘకాలంలో ఫండ్స్ తమ పెట్టుబడులకు భారత్ మార్కెట్‌వైపు చూసే అవకాశం ఉందని పేర్కొన్న అసోచామ్, అయితే ఏదైనా జరగవచ్చన్న ధోరణిలో, విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థగా పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడింది. వేగంగా మారుతున్న ఆర్థిక పరిణామాలను ఎదుర్కొనడానికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ తగిన చర్యలు తీసుకుంటారన్న విశ్వాసముందని సైతం ప్రకటన పేర్కొంది. బ్రిగ్జిట్ జరిగితే కొంతకాలమైనా అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావం భారత్‌పైనా ఉంటుందని వివరించింది. ప్రపంచ స్థాయి సంస్థలకు బ్రిటన్ కీలకం కావడంతో బ్రెగ్జిట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొనడానికి ప్రధాన కారణమని వివరించింది. ఎఫ్సీఎన్ఆర్ల పునఃచెల్లింపుల తరుణం కీలకం.. పైగా ఈ పరిణామం అంతా ఎఫ్సీఎన్ఆర్ (ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్) డిపాజిట్లు పునఃచెల్లింపుల సమయంలో జరగడం కీలకాంశమని, దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించింది. 2013లో విదేశీ కరెన్సీ బాండ్లు జారీ ద్వారా బ్యాంకులు 24 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను సమీకరించాయి. ఈ ఏడాది చివరకు ఆ బాండ్ల మెచ్యూరిటీ ఉంది. అప్పట్లో రూపాయి విలువను పటిష్టపర్చేదిశగా దేశంలోకి విదేశీ మారకాన్ని తేవాలన్న లక్ష్యంతో విదేశీ కరెన్సీ బాండ్ల జారీకి ఆర్బీఐకి అనుమతినిచ్చింది. ఈ విషయంలో విదేశీ మారకద్రవ్య నిల్వలకు సంబంధించి భరోసా ఉన్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తలు అవసరమని విశ్లేషించింది. భారత్ ప్రయోజనాలు ముడివడి ఉన్నాయి: సీఐఐ ఇదిలాఉండగా, సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ.. తాజా ‘బ్రిగ్జిట్’ పరిణామాలు భారత్ ప్రయోజనాలకు ముడివడి ఉన్న అంశంగా పేర్కొన్నారు. యూరోప్‌లోని పలు దేశాలతో పోల్చితే, బ్రిటన్‌లో భారత్ భారీ పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. మన దేశం బ్రిటన్ మూడవ అతిపెద్ద ఇన్వెస్టర్ అన్న విషయాన్ని ప్రస్తావించారు. దేశాల పరంగా చూస్తే... భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో బ్రిటన్‌ది 12వ స్థానంగా వివరించారు. భారత్ వాణిజ్య మిగులు ఉన్న 25 ప్రముఖ దేశాల్లో బ్రిటన్‌ది 7వ స్థానంగా (2015-16లో 3.64 బిలియన్ డాలర్లు) పేర్కొన్నారు. మారిషస్, సింగపూర్ తరువాత భారత్‌లో బ్రిటన్ అతిపెద్ద మూడవ ఇన్వెస్టర్ అని గణాంకాలు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ... ఆయా అంశాల నేపథ్యంలో తాజాగా ఆ దేశంలో పరిణామాలపై జాగరూకత అవసరమని సూచించారు. దేశంపై ప్రభావం ఉంటుంది: ఫిక్కీ బ్రెగ్జిట్ గనుక జరిగితే... ఆ ప్రభావం భారత్‌పై ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ పేర్కొన్నారు. ప్రత్యేకించి బ్రిటన్‌తో వ్యాపారాలు నిర్వహిస్తున్న భారత్ కంపెనీలపై ప్రతికూలత ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడులతో పాటు బ్రిటన్‌కు ఫ్రొఫెషనల్స్ కదలికలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిక్కీ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పౌండ్లో ఒడిదుడుకుల ప్రభావం అటు భారత్ వ్యాపారాలపైనా, కరెన్సీపైనా కీలకమేనని వివరించారు. జాగ్వార్‌కు బ్రెగ్జిట్ భయం! లండన్: బ్రిటన్‌లో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ, టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్)ను బ్రెగ్జిట్ భయాందోళన వేధిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ తప్పుకుంటే ఈ సంస్థ లాభాలు భారీగా హరించుకుపోయే ప్రమాదం ఉందన్నదే ఆందోళనకు కారణం. ఈ దశాబ్దం చివరి నాటికి సుమారుగా బిలియన్ పౌండ్ల మేర (సుమారుగా రూ.10వేల కోట్ల రూపాయలు) లాభాలను కోల్పోయే అవకాశం ఉందని కంపెనీ వర్గాల సమాచారం. ఈ మేరకు కంపెనీ ముఖ్య ఆర్థికవేత్త డేవిడ్రియా ఓ అంతర్గత నివేదికను రూపొందించారు. బ్రిటన్ ఈయూలోనే ఉండాలా లేదా అన్నది గురువారం జరిగే ఓటింగ్‌లో ప్రజలు తేల్చనున్న విషయం తెలిసిందే. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన క్రమంలో... ఈయూతో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీంతో ఎగుమతులపై సుమారు 10 శాతం టారిఫ్, దిగుమతి చేసుకునే పరికరాలపై 4 శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా. 2015-16లో జేఎల్ఆర్ పన్నులకు ముందు లాభం 1.6 బిలియన్ పౌండ్లుగా ఉంది. జేఎల్ఆర్ సంస్థ గతేడాది మొత్తం కార్ల విక్రయాల్లో సుమారు 25 శాతం యూరోప్‌లోనే అమ్ముడుపోయాయి.