‘బ్రెగ్జిట్’పై జర భద్రం! | India should be ready with contingency plan on Brexit: Assocham | Sakshi
Sakshi News home page

‘బ్రెగ్జిట్’పై జర భద్రం!

Published Wed, Jun 22 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

‘బ్రెగ్జిట్’పై జర భద్రం!

‘బ్రెగ్జిట్’పై జర భద్రం!

భారత్ వాణిజ్య సంఘాల సూచన
ఎదుర్కొనడానికి భారత్ సిద్ధంగా
ఉండాలంటున్న అసోచామ్

న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే (బ్రెగ్జిట్) ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనడానికి భారత్ సిద్ధం కావాలని, బ్రిటన్ పరిణామాలతో భారత్ ప్రయోజనాలు ముడివడి ఉన్నాయని అసోచామ్‌సహా పలు వాణిజ్య సంఘాలు మంగళవారంనాడు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. గురువారం కీలక ప్రజాభిప్రాయం నేపథ్యంలో వాణిజ్య సంఘాలు ఈ సూచన చేయడం గమనార్హం.  బ్రిటన్, యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితుల వల్ల దీర్ఘకాలంలో ఫండ్స్ తమ పెట్టుబడులకు భారత్ మార్కెట్‌వైపు చూసే అవకాశం ఉందని పేర్కొన్న అసోచామ్, అయితే ఏదైనా జరగవచ్చన్న ధోరణిలో, విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థగా పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడింది.

వేగంగా మారుతున్న ఆర్థిక పరిణామాలను ఎదుర్కొనడానికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ తగిన చర్యలు తీసుకుంటారన్న విశ్వాసముందని సైతం ప్రకటన పేర్కొంది. బ్రిగ్జిట్ జరిగితే  కొంతకాలమైనా అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్‌లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావం భారత్‌పైనా ఉంటుందని వివరించింది.  ప్రపంచ స్థాయి సంస్థలకు బ్రిటన్ కీలకం కావడంతో బ్రెగ్జిట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొనడానికి ప్రధాన కారణమని వివరించింది.

 ఎఫ్‌సీఎన్‌ఆర్‌ల పునఃచెల్లింపుల తరుణం కీలకం..
పైగా ఈ పరిణామం అంతా ఎఫ్‌సీఎన్‌ఆర్ (ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్) డిపాజిట్లు పునఃచెల్లింపుల సమయంలో జరగడం కీలకాంశమని, దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించింది. 2013లో విదేశీ కరెన్సీ బాండ్లు జారీ ద్వారా బ్యాంకులు 24 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను సమీకరించాయి. ఈ ఏడాది చివరకు ఆ బాండ్ల మెచ్యూరిటీ ఉంది. అప్పట్లో రూపాయి విలువను పటిష్టపర్చేదిశగా దేశంలోకి విదేశీ మారకాన్ని తేవాలన్న లక్ష్యంతో విదేశీ కరెన్సీ బాండ్ల జారీకి ఆర్‌బీఐకి అనుమతినిచ్చింది. ఈ విషయంలో  విదేశీ మారకద్రవ్య నిల్వలకు సంబంధించి భరోసా ఉన్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తలు అవసరమని విశ్లేషించింది.

 భారత్ ప్రయోజనాలు ముడివడి ఉన్నాయి: సీఐఐ
ఇదిలాఉండగా, సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ.. తాజా ‘బ్రిగ్జిట్’ పరిణామాలు భారత్ ప్రయోజనాలకు ముడివడి ఉన్న అంశంగా పేర్కొన్నారు. యూరోప్‌లోని పలు దేశాలతో పోల్చితే, బ్రిటన్‌లో భారత్ భారీ పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. మన దేశం బ్రిటన్ మూడవ అతిపెద్ద ఇన్వెస్టర్ అన్న విషయాన్ని ప్రస్తావించారు. దేశాల పరంగా చూస్తే... భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో బ్రిటన్‌ది 12వ స్థానంగా వివరించారు. భారత్ వాణిజ్య మిగులు ఉన్న 25 ప్రముఖ దేశాల్లో బ్రిటన్‌ది 7వ స్థానంగా  (2015-16లో 3.64 బిలియన్ డాలర్లు) పేర్కొన్నారు. మారిషస్, సింగపూర్ తరువాత భారత్‌లో బ్రిటన్ అతిపెద్ద మూడవ ఇన్వెస్టర్ అని గణాంకాలు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ... ఆయా అంశాల నేపథ్యంలో తాజాగా ఆ దేశంలో పరిణామాలపై జాగరూకత అవసరమని సూచించారు.

 దేశంపై ప్రభావం ఉంటుంది: ఫిక్కీ
బ్రెగ్జిట్ గనుక జరిగితే... ఆ ప్రభావం భారత్‌పై ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ పేర్కొన్నారు. ప్రత్యేకించి బ్రిటన్‌తో వ్యాపారాలు నిర్వహిస్తున్న భారత్ కంపెనీలపై ప్రతికూలత ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడులతో పాటు బ్రిటన్‌కు ఫ్రొఫెషనల్స్ కదలికలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిక్కీ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పౌండ్‌లో ఒడిదుడుకుల ప్రభావం అటు భారత్ వ్యాపారాలపైనా, కరెన్సీపైనా కీలకమేనని వివరించారు.
జాగ్వార్‌కు బ్రెగ్జిట్ భయం!
లండన్: బ్రిటన్‌లో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ, టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్)ను బ్రెగ్జిట్ భయాందోళన వేధిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ తప్పుకుంటే ఈ సంస్థ లాభాలు భారీగా హరించుకుపోయే ప్రమాదం ఉందన్నదే ఆందోళనకు కారణం. ఈ దశాబ్దం చివరి నాటికి సుమారుగా బిలియన్ పౌండ్ల మేర (సుమారుగా రూ.10వేల కోట్ల రూపాయలు) లాభాలను కోల్పోయే అవకాశం ఉందని కంపెనీ వర్గాల సమాచారం.

ఈ మేరకు కంపెనీ ముఖ్య ఆర్థికవేత్త డేవిడ్‌రియా ఓ అంతర్గత నివేదికను రూపొందించారు. బ్రిటన్ ఈయూలోనే ఉండాలా లేదా అన్నది గురువారం జరిగే ఓటింగ్‌లో ప్రజలు తేల్చనున్న విషయం తెలిసిందే. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన క్రమంలో... ఈయూతో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీంతో ఎగుమతులపై సుమారు 10 శాతం టారిఫ్, దిగుమతి చేసుకునే పరికరాలపై 4 శాతం టారిఫ్  చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా. 2015-16లో జేఎల్‌ఆర్ పన్నులకు ముందు లాభం 1.6 బిలియన్ పౌండ్లుగా ఉంది. జేఎల్‌ఆర్ సంస్థ గతేడాది మొత్తం కార్ల విక్రయాల్లో సుమారు 25 శాతం యూరోప్‌లోనే అమ్ముడుపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement