దండ దండగ యాత్రా? | Foreign takeover of Indian companies to come together | Sakshi
Sakshi News home page

దండ దండగ యాత్రా?

Published Sat, Jun 25 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

దండ దండగ యాత్రా?

దండ దండగ యాత్రా?

భారత కంపెనీలకు కలసిరాని విదేశీ టేకోవర్లు 
టాటా స్టీల్ నుంచి రిలయన్స్ దాకా ఇదే తీరు
కలిసొచ్చిన కాస్త కంపెనీలక్కూడా బ్రెగ్జిట్ దెబ్బ
టాటా మోటార్స్, మదర్సన్ సుమీ... అన్నిటిదీ ఇదే తీరు 
యూరప్‌లో ఎక్కువ వ్యాపారం ఉండటమే కారణం

 

ఇవి రాజులు... రాజ్యాల కథలు కావు. కంపెనీలు... దేశాల కథలు. మన కంపెనీలకు కాలం కలిసొచ్చి... విదేశీ కంపెనీల్ని కొన్నాయి. కలిపేసుకున్నాయి. కాకపోతే కాలం తిరగబడింది. కొన్న కంపెనీల నుంచి ఆదాయం లేక... మరింత పెట్టుబడి పెట్టలేక... అమ్మకానికి పెట్టాయి. కొన్న ధరకన్నా తక్కువకే అమ్మేస్తున్నాయి.


టాటామోటార్స్, మదర్సన్ సుమీ వంటి కంపెనీల పరిస్థితి మాత్రం వేరు. వాటికి కొనుగోళ్లు కలిసొచ్చాయి. అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోతుండటం ఈ కాస్త విజయాల్ని కూడా కమ్మేసే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వీటి వ్యాపారాలు... లాభాలు అత్యధికం యూరప్ నుంచే వస్తున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వె ళితే... ఆయా కంపెనీలు బ్రిటన్‌తో పాటు ఈయూలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అనుమతులు క్లిష్టమవుతాయి. ఖర్చులు పెరిగి... ఆ ప్రభావం అమ్మకాలు, లాభాలపై పడుతుంది. దీంతో కలిసొచ్చిన దండయాత్రలు కూడా దండగయాత్రలుగా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏ కంపెనీ టేకోవర్ ఎలా మారిందనే విశ్లేషణే... ఈ వారం ‘ఫోకస్’ -సాక్షి, బిజినెస్ విభాగం

 

1 టాటా స్టీల్-కోరస్
ఫార్చ్యూన్-500 నుంచి రూ.20వేల కోట్ల నష్టాల్లోకి

2007లో ఆంగ్లో-డచ్ ఉక్కు దిగ్గజం కోరస్‌ను టాటా స్టీల్ సంస్థ కొనుగోలు చేసింది. అలా... టాటా గ్రూప్ బిటన్ ఉక్కు రంగంలోకి అడుగుపెట్టింది. నిజానికప్పుడు అదో సంచలనం. బ్రిటిష్ సంస్థను టాటాలు కొనుగోలు చేయటంతో దేశంలో భావోద్వేగ పూరిత శుభాభినందనలు కూడా వెల్లువెత్తాయి. దీనికోసం టాటా స్టీల్ నెలల తరబడి బ్రెజిల్‌కు చెందిన సీఎస్‌ఎన్ సంస్థతో హోరాహోరీగా పోటీ పడింది. 14 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించింది. చివరికి... సీఎస్‌ఎన్ కన్నా కేవలం 5 పెన్స్‌లకన్నా తక్కువకు బిడ్ వేయగలిగింది. అంటే మన కరెన్సీలో కేవలం ఐదు రూపాయలు. అలా కోరస్‌ను టేకోవర్ చేసింది. 25 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రపంచంలోనే 5వ అతి పెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఆవిర్భవించింది. ఫార్చ్యూన్ 500 బహుళ జాతి సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ సంస్థగా నిలిచింది. కానీ ఈ 5 పెన్స్‌ల విజయమిచ్చిన సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 2007లో టన్నుకు 550-575 డాలర్లున్న ఉక్కు రేటు (హాట్ రోల్డ్ కాయిల్స్) 2016లో 380 డాలర్లకు పడిపోయింది. కోరస్ కొనుగోలు కోసం సమీకరించిన భారీ రుణాలు ఒకవైపు.. కంపెనీ నష్టాలు మరోవైపు టాటా స్టీల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కోరస్‌ను కొన్నాక అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పరిస్థితులు దిగజారాయి. డిమాండ్ క్షీణించి, ధర పడిపోవటంతో గత ఐదేళ్లలో టాటా గ్రూప్ 2 బిలియన్ పౌండ్లు (దాదాపు రూ.20వేల కోట్లు) నష్టపోయింది. మరిన్ని పెట్టుబడులు పెట్టలేక... అమ్మేయాలని నిర్ణయించుకుంది. డిమాండ్ లేక కొనుగోలుదారులూ పెద్దగా ముందుకు రాలేదు. చివరకు లాంగ్ స్టీల్ వ్యాపారాన్ని, సంబంధిత ప్లాంటును మాత్రం విక్రయించగలిగింది. మిగిలిన వ్యాపారాన్ని తానే నిర్వహించాలని చూస్తున్నా... తాజా బ్రెగ్జిట్ దెబ్బ మరింత కుంగదీసే ప్రమాదం కనిపిస్తోంది. బ్రిటిష్ కంపెనీ కోరస్‌ను టాటా స్టీల్ టేకోవర్ చేయటం ఓ సంచలనం. హోరాహోరీ పోరులో కేవలం 5 పెన్స్‌ల తేడాతో దీన్ని చేజిక్కించుకుంది. కానీ భారీ నష్టాలతో యూకే ఆస్తుల్నిపుడు విక్రయిస్తోంది.

 

 

 2 మిట్టల్ స్టీల్ - ఆర్సెలర్
నెంబర్-1 మిట్టల్.. అమ్మకాల పరంపర

భారతదేశం నుంచి వలస వెళ్లి బ్రిటన్‌లో ఉక్కు వ్యాపారిగా ఎదగటమే లక్ష్మీ నివాస్ మిట్టల్ సాధించిన తొలి విజయం. నెదర్లాండ్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మిట్టల్ స్టీల్స్... 2006లో లగ్జెంబర్గ్‌కు చెందిన ఆర్సెలర్ స్టీల్‌ను ఏకంగా 32 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దాంతో ప్రపంచంలోనే నెంబర్-1 ఉక్కు కంపెనీగా నిలిచింది. మరి ఈ సమాచారం ఇండియాను ఎంత సంబరపరచిందో ఊహించటం కష్టమా!.  కాకపోతే 2008 నుంచి మొదలైన మంద గమన ప్రభావం ఆర్సెలర్ మిట్టల్‌పై ఎక్కువే పడింది. ఉక్కుకు డిమాండ్ పడిపోయింది. దీంతో సంస్థకున్న 25 బ్లాస్ట్ ఫర్నేస్‌లలో తొమ్మిదింట ఉత్పత్తిని నిలిపేసింది. ఫ్రాన్స్‌లో రెండు ఫర్నేస్‌లను మూసేసింది. అదే ఏడాది తన యూరోపియన్ వ్యాపారం తాలూకు మొత్తం విలువను ఏకంగా 4.3 బిలియన్ డాలర్ల మేర తగ్గించి చూపించింది. రెండేళ్ల కిందట గ్రూప్‌లోని ఒక కంపెనీలో వాటాల్ని 770 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. రెండునెలల కిందట మార్చిలో సెంట్రల్ ట్రినిడాడ్ ప్లాంటును మూసి వేయటంతో పాటు... అమెరికాలోని రెండు ప్లాంట్లను అమ్మేయాలని కూడా నిర్ణయించింది.

 

ఈ కథలు వేరు. భారీగా వెచ్చించి... టేకోవర్ చేసినా... తరవాత దాన్నుంచి లాభాలు రాబట్టలేక వెనక్కి తిరిగిన కథలు కావివి. విదేశీ కంపెనీని కొనుగోలు చేయటమే కాక... అందరి అంచనాలనూ తల్ల కిందులు చేస్తూ దాని రాతను మార్చేసిన భారతీయ కంపెనీల కథలివి. అయితే చరిత్రను తిరగరాసిన ఈ కంపెనీల్లో కొన్ని తాజా బ్రెగ్జిట్ దెబ్బకు తల్లకిందులయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వాటి విజయమే కాక... కార్యకలాపాలు కూడా యూరప్‌మీదే ఆధారపడ్డాయి మరి.

 

ఎస్సార్ గ్లోబల్ - స్టాన్‌లో రిఫైనరీ
రిఫైనరీ జాతకం మారింది..
.
ఎస్సార్ గ్లోబల్‌లో ఎస్సార్ ఆయిల్ యూకే... 2011లో బ్రిటన్‌కు చెందిన స్టాన్‌లో రిఫైనరీని కొనుగోలు చేసింది. అప్పటిదాకా ఆ రిఫైనరీ షెల్ కంపెనీ యాజమాన్యంలో ఉండేది. ఇందుకోసం ఎస్సార్ సంస్థ 350 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఎస్సార్ ఆయిల్ ఇప్పటిదాకా ఆ రిఫైనరీపై దాదాపు 1.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అప్పట్లో దుర్భరమైన స్థితిలో ఉన్న పాత ప్లాంటు... ప్రస్తుతం బ్రిటన్‌లోని వ్యూహాత్మక రిఫైనరీల్లో ఒకటిగా ఎదిగింది. దేశంలో రవాణాకు ఉపయోగించే ఇంధనాల్లో 16% వాటాను ఇదే సరఫరా చేస్తోంది. (4.4 బిలియన్ లీటర్ల డీజిలు, 3 బిలియన్ లీటర్ల పెట్రోలు, 2 బిలియన్ లీటర్ల విమాన ఇంధనం).

 

3 హావెల్స్- సిల్వేనియా
అద్భుతంగా ఎదిగినా... విదేశీ డీల్ ముంచింది...

హావెల్స్. రాజస్థాన్ కేంద్రంగా విదేశాలకు సైతం విస్తరించిన దేశీ దిగ్గజం. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన హావెల్స్ ఇండియా... 2007లో తనకన్నా ఒకటిన్నర రెట్లు పెద్దదైన యూరోపియన్ కంపెనీ సిల్వేనియాను 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కాకపోతే ఆ డీల్ సంస్థకు ప్రాణాంతకమైంది. 2000లో రూ.100 కోట్ల నుంచి 2006లో రూ.1,600 కోట్ల స్థాయికి ఎగిసిన హావెల్స్... అప్పట్లో 60-70 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కంపెనీలను కొందామని పలు ప్రయత్నాలు చేసింది. అయినా కుదరలేదు. అదే సమయంలో దానికి ఐదారు రెట్ల విలువైన సిల్వేనియా ఆఫర్ వచ్చింది. దీంతో 300 మిలియన్ డాలర్లు వెచ్చించడానికి కూడా సై అంటూ ముందడుగు వేసేసింది. అప్పటి కరెన్సీ మారక విలువ ప్రకారం దాదాపు రూ. 2,000 కోట్లు వెచ్చించిన హావెల్స్, ఆ తర్వాత దాదాపు మరో రూ.1,000 కోట్లు కుమ్మరించింది. కానీ కంపెనీ అమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఇటీవలే 80 శాతం వాటాలను షాంఘై ఫెయిలో అకౌస్టిక్స్‌కు రూ. 1,340 కోట్లకు అమ్మేసింది.

 

4 శ్రీ రేణుకా షుగర్స్- డూబ్రెసిల్
కర్ణాటకలో హవా... బ్రెజిల్ దివాలా

శ్రీరేణుకా షుగర్స్ అంటేనే సంచలనం. కర్ణాటకలో రైతులందరినీ ఒక్కటి చేసి... వారికి వాటాలిచ్చి మరీ ఆరంభించిన ఈ సంస్థ అతి త్వరగా అంతర్జాతీయ కీర్తిని సంపాదించింది. చక్కెర తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల జాబితాలో ఉన్న ఈ సంస్థ... 2010లో రూ.1,312 కోట్లతో బ్రెజిల్‌కు చెందిన రేణుక డూ బ్రెసిల్‌ను కొనుగోలు చేసింది. ఒక భారతీయ చక్కెర కంపెనీ... విదేశీ సంస్థను కొనుగోలు చేయడం అదే ప్రథమం. కానీ, సరిగ్గా ఏడాది తర్వాత  2011లో ఒకసారి, ఆపైన 2014లో మరోసారి బ్రెజిల్‌లో ఏర్పడ్డ కరవు పరిస్థితులు కంపెనీని దెబ్బతీశాయి. బ్రెజిల్ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, చక్కెర ధరలు పడిపోవడం దీనికి తోడయ్యింది. ఈ పరిణామాలతో రేణుకా బ్రెసిల్ దివాలా పిటిషన్ వేయాల్సి వచ్చింది.

 

 5 ఎయిర్‌టెల్- జయిన్
రీఛార్జ్ చేయించలేక.. ఎయిర్‌టెల్ ఆఫ్రికా కాల్ కట్

దేశీ టెలికం రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎయిర్‌టెల్ సంస్థ... విదేశాల్లో విస్తరణకు అప్పట్లో రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆఫ్రికన్ టెలికం సంస్థ ఎంటీఎన్‌ను కొనేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తరవాత కువైట్ టెలికం కంపెనీ ‘జయిన్’ రూపంలో అవకాశం వచ్చింది. ఆఫ్రికాలోని 17 దేశాల్లో తమ టెలికం వ్యాపారాన్ని విక్రయిస్తామని ఆ సంస్థ ముందుకొచ్చింది. అవకాశం కోసం చూస్తున్న ఎయిర్‌టెల్... 2010లో ఏకంగా 10.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 73,211 కోట్లు) కొనేసింది. కొంత కసరత్తుతో భారీ లాభాలొస్తాయనుకున్న ఎయిర్‌టెల్‌కు మెల్లగా పరిస్థితి అర్థమయింది.

 
ఒకవైపు లాభాలు లేవు. మరోవంక ఆఫ్రికాలో పాతుకుపోయిన ఎంటీఎన్‌ను అందుకోవడం తేలిక కాదని తెలిసింది. 2012 నుంచీ తమ నెట్‌వర్క్‌లు, ఐటీ కార్యకలాపాలను అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంది. 2015 డిసెంబర్ క్వార్టర్లో ఆఫ్రికా యూనిట్ 74 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.506 కోట్లు) నష్టాన్ని ప్రకటించింది. తట్టుకోలేక 2016 జనవరిలో సియెరా లియోన్, బుర్కినా ఫాసో దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్ని ఫ్రాన్స్‌కి చెందిన టె లికం సంస్థ ఆరెంజ్‌కు ఎయిర్‌టెల్ విక్రయించింది.  2015 అక్టోబర్‌లో ఆఫ్రికాలోని 8,300 మొబైల్ టవర్లను 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 11,000 కోట్లు) అమ్మేసింది. తాగాగా మిగిలిన 3,700 టవర్లను కూడా విక్రయించడానికి ఒప్పందం చేసుకుని... టవర్ల వ్యాపారం నుంచి బయటపడింది. వ్యాపారం మొత్తాన్ని అమ్మేసే పరిస్థితి లేకపోవడంతో పార్టు పార్టుగా అమ్మాల్సి వస్తోందనేది నిపుణుల మాట.

 

ఇండియా వేరు. ఆఫ్రికా వేరని ఎయిర్‌టెల్‌కు ఇప్పుడు  తెలిసొచ్చింది. 10.7 బిలియన్ డాలర్లు పెట్టి గల్ఫ్ కంపెనీ జయిన్‌కు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని టేకోవర్ చేసింది. ఇపుడు   వదిలించుకుంటోంది.

 

జీవీకే టు  అదానీ...
మన కంపెనీల విదేశీ వేటలో... అటు కలిసిరాక, ఇటు రద్దవక అలా ఊగిసలాడుతున్న డీల్స్ చాలానే ఉన్నాయి. ళీ జీవీకే -హ్యాంకాక్ సంస్థలు కలిసి ఆస్ట్రేలి యాలోని గెలీలీ బేసిన్లో భారీ బొగ్గు గనులను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే రకరకాల ఇబ్బందులతో ఇది ముందుకు సాగటం లేదు. రుణభారం పెరుగుతోంది.

ఆస్ట్రేలియాలోని కోలీలో బొగ్గు వెలికితీతకు గ్రిఫిన్ కోల్ మైన్స్‌తో ల్యాంకో ఒప్పందం చేసుకుంది. గ్రిఫిన్ కోసం ల్యాంకో 600 మి. డాలర్లు వెచ్చించింది.  రూ.37వేల కోట్ల రుణ భారమున్న ల్యాంకోకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వడ్డీల భారం పెరుగుతోంది.

ఆస్ట్రేలియాలోని అబాట్ పాయింట్ పోర్టు లో అదానీ గ్రూప్ దాదాపు మూడు బిలియన్ డాలర్ల దాకా వెచ్చించింది. మరో 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసుకుంది. కాకపోతే అక్కడి ప్రాజెక్టులకు  పర్యావరణపరమైన అనుమ తులు రావటం లేదు. న్యాయ వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.

 

 6  రిలయన్స్- ఈగిల్‌ఫోర్డ్ షేల్ గ్యాస్
షేల్‌గ్యాస్‌లో వేలుపెట్టి ఊపిరాడని రిలయన్స్..

రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశంలో నెంబర్-1 పెట్రో కెమికల్స్ కంపెనీ. చేతిలో డబ్బులుండటంతో వ్యాపార విస్తరణకున్న అవకాశాలన్నిటినీ అన్వేషించింది. అప్పుడప్పుడే షేల్ గ్యాస్‌కు బాగా ప్రాచుర్యం రావటంతో... అందులో పెట్టుబడి బంగారాన్ని పండిస్తుందని అంచనా వేసింది. అప్పట్లో ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగటమూ రిలయన్స్ ఆలోచనకు ఒక కారణం. దీంతో 2010లో అమెరికాలోని ఈగిల్ ఫోర్డ్ షేల్ గ్యాస్ ప్రాజెక్టులో 1.31 బిలియన్ డాలర్లు వెచ్చించి 45 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ వెంటనే పయోనీర్ సంస్థ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌లో దాదాపు 3.91 బిలియన్ డాలర్ల  పెట్టుబడి పెట్టింది. మొత్తమ్మీద 3 కంపెనీలతో మూడు జాయింట్ వెంచర్ల ద్వారా (అట్లాస్ ఎనర్జీ, కారిజో ఆయిల్ అండ్ గ్యాస్, పయోనీర్ నేచురల్ రిసోర్సెస్) అమెరికా షేల్ గ్యాస్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కాలుపెట్టింది. ఆర్థిక మాంద్యంతో ఇంధన వాడకం తగ్గింది. కానీ ప్రపంచవ్యాప్తంగా వాటిని ఉత్పత్తి చేస్తున్న దేశాలు తమ ఉత్పత్తిని మాత్రం తగ్గించలేదు. ఫలితం... డిమాండ్ తగ్గి, అమ్మకం రేటుకంటే ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. సాధారణంగా షేల్ గ్యాస్‌పై పెట్టే భారీ పెట్టుబడులపై లాభం రావాలంటే చమురు రేటు బ్యారెల్‌కు కనీసం 60 డాలర్లయినా ఉండాలి. సంప్రదాయ విధానాల్లో ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య దేశాలకు బ్యారెల్ 25 డాలర్లున్నా లాభాలే. ఒకప్పుడు 147 డాలర్లకు వెళ్లిన క్రూడాయిల్ ధర కొన్నాళ్లుగా 40-45 డాలర్ల దగ్గరే తిరుగుతోంది. నష్టాల్ని తట్టుకోలేని రిలయన్స్... ఈగిల్ ఫోర్డ్ పైప్‌లైన్ అసెట్స్‌ను 2015లో 1.07 బి. డాలర్లకు విక్రయించేసింది.

 

టాటా మోటార్స్- జేఎల్‌ఆర్
లక్షకారే కాదు.. కోట్లకారూ మాదే

టాటా మోటార్స్‌ది ఆది నుంచీ భారీ వాహనాల వ్యాపారమే. 1998లో తొలిసారి కార్లలోకి దిగింది. ఇండికాను మార్కెట్లోకి తెచ్చింది. మొదట్లో దానికొచ్చిన స్పందన అంతంతే. కార్ల వ్యాపారాన్ని అమ్మేస్తే మంచిదన్నారు కొందరు. అది తెలిసి ఫోర్డ్ అధికారులు కొందరు ముంబయిలోని టాటా కార్యాలయానికి వచ్చారు. చర్చల అనంతరం... డెట్రాయిట్ రావాలని పిలిచారు. 1999లో ఓ బృందం వెళ్లింది. అక్కడ ఎదురైన అనుభవమేంటో తెలుసా? ‘‘అయినా అనుభవం లేకుండా ఈ బిజినెస్‌లోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీకు ఉపకారం చేయడానికి మీ వ్యాపారాన్ని కొనాలా?’’ అంటూ అవమానించారు. ఆ అధికారులు న్యూయార్క్‌కు తిరిగి వచ్చారు. రతన్‌టాటాకు విషయం చెప్పారు.

 
సరిగ్గా తొమ్మిదేళ్ల తరవాత... 2009లో అదే ఫోర్డ్‌కు చెందిన జాగ్వార్, ల్యాండరోవర్ బ్రాండ్లను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం సందర్భంగా ఫోర్డ్ మోటార్స్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ఏమన్నారో తెలుసా? ‘‘మా జేఎల్‌ఆర్‌ను కొని మాకు పెద్ద ఉపకారం చేశారు’’ అని. అలా... టాటామోటార్స్ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. నిజానికి ప్రపంచానికి ఇష్టమైన లగ్జరీ బ్రాండ్ జేఎల్‌ఆర్‌ను  కొనటానికి టాటా ముందుకెళ్లినపుడు కూడా విపరీతమైన అవమానకర వ్యాఖ్యలు వినపడ్డాయి.‘‘ఏదో లక్ష రూపాయల నానో కారు తయారు చేసుకునే కంపెనీ..!  అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లను నిర్వహించటం ఎలా కుదురుతుంది? ఫోర్డ్ వల్లే కానిది టాటా వల్ల ఏమవుతుంది?’’ అంటూ బోలెడన్ని విమర్శలు. పెదవి విరుపులు. కానీ రతన్ టాటా పట్టు వదల్లేదు. 2008లో జేఎల్‌ఆర్ బ్రాండ్లను సొంతం చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. వాటిని టర్న్ అరౌండ్ చేశారు. అమ్మకాలు పెంచారు. విమర్శించిన వాళ్లే తరవాత నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం టాటా మోటార్స్‌కి బిలియన్ల కొద్దీ పౌండ్ల లాభాలను ఆర్జించి పెడుతోంది జేఎల్‌ఆర్. లక్ష కారే కాదు... లక్ష డాలర్ల కారునూ తామే తయారు చేస్తామని నిరూపించారు. కాకపోతే బ్రెగ్జిట్ పెద్దదెబ్బే కొట్టింది. వ్యూహం ఎలా మార్చుకుంటారో చూడాల్సిందే!!.

 

మదర్సన్ సుమి-పెగ్యుఫామ్
కస్టమర్ల సూచన.. కంపెనీకి కలిసొచ్చింది
మదర్సన్ సుమి సిస్టమ్స్. పాసింజర్ కార్ల అద్దాలు, వైరింగ్‌కు సంబంధించి హార్నెస్‌లను (హోల్డర్), ప్లాస్టిక్ ఉపకరణాలను తయారు చేసే ఈ సంస్థ దేశంలో ఈ తరహా ఉత్పత్తుల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించింది. విదేశీ దిగ్గజాలు ఫోక్స్ వ్యాగన్, దైమ్లర్ వంటివి ఈ కంపెనీకి కస్టమర్లే. అలాంటి మదర్సన్ సుమీ... 2008లో యూకేకు చెందిన విజియోకార్ప్‌ను కొనుగోలు చేసింది. దీన్ని కొనుగోలు చేస్తే పనికొస్తుందని మదర్సన్‌కు సలహా ఇచ్చింది వేరెవరో కాదు. దాని కస్టమర్ దైమ్లర్. తననుంచీ కాంట్రాక్టులొస్తాయని దైమ్లర్ చెప్పింది.

 
ఇక 2011లో జర్మనీకి చెందిన పెగ్యుఫామ్ గ్రూప్‌లో 80 శాతం వాటాలను మదర్సన్ కొనుగోలు చేసింది. ఇందుకోసం  రూ.890 కోట్లు వెచ్చించింది. అప్పటికి అంతంతమాత్రం పనితీరుతో ఉన్న పెగ్యుఫామ్‌ను... 2014లో అమెరికన్ కంపెనీ స్టోన్ రిడ్జ్‌కు చెందిన వైరింగ్ విభాగాన్ని కొనుగోలు చేసింది. ఈ మూడూ కొన్నపుడు సమస్యల్లోనే ఉన్నాయి. ఆ తరవాత పనితీరు మెరుగుపడి మదర్సన్ ఆదాయలు పెంచి... అంతర్జాతీయ కంపెనీగా మార్చాయి. అతిగా యూరప్‌పైన, యూకేపైన ఆధారపడటం వల్ల ఇది మున్ముందు పెను సవాళ్లు ఎదుర్కోక తప్పేట్టు లేదు.

 

2006లో టాటా స్టీల్ కోరస్ గ్రూప్ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం 12,780 మి.డాలర్లు. 2010లో భారతీ ఎయిర్‌టెల్ జయిన్ ఆఫ్రికా కార్యకలాపాల టేకోవర్‌కు పెట్టిన మొత్తం 10,700 మి.డాలర్లు. 2007లో నోవెలిస్‌కు హిందాల్కో పెట్టిన మొత్తం 5,706 మి.డాలర్లు. 2008లో జేఎల్‌ఆర్‌కు టాటా వెచ్చించిన మొత్తం 2,300 మి.డాలర్లు.  ఎస్సార్ స్టీల్ అల్గోమా కోసం ఎస్సార్ గ్లోబల్ 1,421 మి.డాలర్లు పెట్టింది. శ్రీరేణుకా షుగర్స్‌ను దెబ్బతీసింది మాంద్యం కాదు... కరువు. బ్రెజిల్ చక్కెర కంపెనీని టేకోవర్ చేసినా... అక్కడొచ్చిన రెండు కరువులు కంపెనీని దెబ్బతీశాయి.

 

విజయాలకు గానీ, పరాజయాలకు గానీ కీలకమైన కారణాలు ఒకటి- టైమింగ్.  రెండోది - కొనుగోలు వ్యయం. టైమింగ్ విషయానికొస్తే... 2008 వరకూ అంతర్జాతీయంగా కంపెనీలకు మహర్దశ నడిచింది. 2009 తరవాత  విలువలు క్షీణించాయి. 2011 తరవాత ఘోరంగా తగ్గాయి. ఆర్సెలర్‌ను మిట్టల్ 2006లో... కోరస్‌ను టాటా  2007లో... సిల్వేనియాను హావెల్స్ 2007లో కొన్నాయి. అప్పట్లో వాటి ధరలు గరిష్ఠంగా ఉన్నాయి. ఇక కొనుగోళ్లకు భారీ అప్పులు చేసిన కంపెనీలు కూడా తట్టుకోలేకపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement