లండన్: బ్రెగ్జిట్ రాజకీయం మళ్లీ రసకందాయంలో పడింది. వచ్చే నెలలో ఆకస్మిక ఎన్నికలు నిర్వహించాలన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతిపాదనకు పార్లమెంటు మంగళవారం మోకాలడ్డింది. ఈ అంశంపై ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించిన ప్రధాని వచ్చే నెల బ్రస్సెల్స్‌లో జరగబోయే ఈయూ సమావేశంలో సరికొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని స్పష్టం చేశారు. బ్రెగ్జిట్ గందరగోళానికి కారణమైన ప్రతిపక్షాలు తమ బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోతున్నాయని, ఓటర్లు వీరికి తగిన సమాధానం చెప్పే రోజు త్వరలోనే రానుందని విమర్శించారు. బ్రెగ్జిట్ ఒప్పందంలో మార్పుల్లేకపోతే బ్రిటన్‌కు జరిగే నష్టానికి సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేయాలన్న ప్రధాని డిమాండ్‌ను పార్లమెంటు తోసిరాజనడం గమనార్హం.
బ్రిటిష్ చట్టాల ప్రకారం ఆకస్మిక ఎన్నికలకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైన నేపథ్యంలో తాము వాటిని అడ్డుకుంటున్నట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అక్టోబరు 31 లోపు ఒప్పందం కుదుర్చుకోవడం లేదంటే జాప్యం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తుండగా జాప్యం చేసేందుకు తాను సిద్ధంగా లేనని జాన్సన్ చెబుతూండటం సమస్యను జటిలతరం చేసింది. అయితే అక్టోబరు 31లోపు ఒప్పందం కుదరకపోతే జాప్యం చేసేందుకు పార్లమెంటులో ఓ బిల్లు చర్చకు వస్తున్న సంగతి ప్రస్తావించాల్సిన అంశం. 17న బ్రస్సెల్స్‌లో జరిగే ఈయూ సమావేశం బ్రెగ్జిట్ వ్యవహారానికి కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment