ఈయూ.. బై బై.. | Good bye EU | Sakshi
Sakshi News home page

ఈయూ.. బై బై..

Published Sat, Jun 25 2016 2:37 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

ఈయూ.. బై బై..

ఈయూ.. బై బై..

యూరోపియన్ యూనియన్‌లో ఉండలేమని తేల్చిన బ్రిటన్ వాసులు
 
- బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం మంది ఓటు
- రాజీనామా చేస్తానంటూ బ్రిటన్ ప్రధాని ప్రకటన
- అంతర్జాతీయంగా మార్కెట్ల అతలాకుతలం
- స్టాక్స్, కరెన్సీలు, ముడిచమురు దారుణ పతనం
- సురక్షిత పెట్టుబడిగా బంగారం మెరుపులు
- మున్ముందు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు
 
 ప్రభావం ఇలా..
 పౌండు చరిత్రాత్మక పతనం..
 డాలర్ డ్రీమ్స్.. రూపాయి క్రాష్
 బ్రిటన్‌తో లింకుంటే కుదేలే!!
 ఐటీలో అనిశ్చితి తప్పదు: నాస్కామ్
 ఆందోళన అక్కర్లేదు: జైట్లీ
 భయపడొద్దు: రాజన్

 
 బ్రిటన్‌తో విడిపోతాం
 - ఈయూతో కలిసుంటాం
- బ్రెగ్జిట్‌ ఫలితాల నేపథ్యంలో స్కాట్లాండ్ అడుగులు
- ఉత్తర ఐర్లాండ్‌లోనూ ఇవే డిమాండ్లు
 
 బ్రిటన్ పోతే పోనీ!

 డొనాల్డ్ టస్క్, ఈయూ అధ్యక్షుడు
 బ్రెగ్జిట్ ప్రభావం తమపై ఉండదని.. మిగిలిన 27 దేశాలతో కలిసి కూటమి బలంగానే ఉంటుందని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. రెఫరెండంపై బ్రిటన్లు పిచ్చి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఈయూలోని 27 దేశాల ప్రతినిధిగా చెబుతున్నా. మా ఐక్యత కొనసాగుతుంది’ అని టస్క్ తెలిపారు. ప్రజాతీర్పు వెల్లడైనందున ఈయూ నుంచి బ్రిటన్ వీలైనంత త్వరగా వెళ్లిపోయేలా ప్రయత్నాలు ప్రారంభించాలన్నారు. అనవసర ఆలస్యం వల్ల అనిశ్చితి పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే.. బ్రిటన్ నిర్ణయంతో తమ కూటమిలో చీలిక వస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని ఈయూ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్ తెలిపారు.
 
 నిర్ణయాన్ని గౌరవిస్తాం
 అమెరికా అధ్యక్షుడు ఒబామా
 యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల నిర్ణయాన్ని తమ దేశం గౌరవిస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. యునెటైడ్ కింగ్‌డమ్‌తోపాటు యూరోపియన్ యూనియన్ ఎప్పటిలాగే అమెరికా భాగస్వాములుగా కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌లో జరిగిన రెఫరెండం ఫలితాలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. బ్రెగ్జిట్ అనంతర  సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు ప్రశాంతమైన, స్థిరమైన, అనుభవం గల నాయకత్వం అవసరమని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. బ్రిటన్ ప్రజల ఎంపికను గౌరవిస్తున్నానంటూ ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
 
 ఇక సెలవ్!: డేవిడ్ కామెరాన్ (బ్రిటన్ ప్రధాని)
 ఈ చారిత్రక నిర్ణయంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవినుంచి తప్పుకోనున్నారు. బ్రెగ్జిట్ వ్యతిరేక వాదనను ముందుండి నడిపించిన కామెరాన్.. ఇకపైనా దేశాభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉంటుందని.. కొత్త నాయకత్వం దేశాన్ని ముందుకు నడపాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. టెన్ డౌనింగ్‌స్ట్రీట్ (యూకే ప్రధాని అధికారిక నివాసం) ముందు శుక్రవారం భార్య సమంతతో కలిసి ఉద్వేగంగా మాట్లాడిన కామెరాన్ ‘రెఫరెండం ప్రజాస్వామ్య విజయం. చారిత్రక నిర్ణయం. ఇందులో ప్రజల నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఫలితాలపై ఎటువంటి సందేహం లేదు. ఈ నిర్ణయం వల్ల మార్కెట్లకు వచ్చే ప్రమాదం లేదని, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందని.. ప్రపంచ దేశాలకు భరోసా ఇస్తున్నాను’ అని తెలిపారు. అక్టోబర్‌లో జరగనున్న కన్సర్వేటివ్ కాన్ఫరెన్స్‌లో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారన్నారు. విజయం సాధించిన బ్రెగ్జిట్ అనుకూల వర్గానికి కామెరాన్ శుభాకాంక్షలు తెలిపారు.

తాజా నిర్ణయంతో బ్రిటన్‌లో ఉన్న ఇతర యూరోపియన్ దేశాల ప్రజలకు, యూరోపియన్ దేశాల్లో ఉన్న బ్రిటన్లకు ప్రస్తుతానికి ఎలాంటి సమస్యా లేదని ఇప్పటివరకున్నట్లుగానే వస్తువులు, సేవల విషయంలో పెద్ద మార్పులేమీ ఉండవని కామెరాన్ తెలిపారు. ఇకపై యురోపియన్ యూనియన్‌తో చర్చించాల్సిన అంశాలపై వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరేళ్లపాటు యూకే ప్రధానిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందన్న కామెరాన్.. తమ ప్రభుత్వం విద్య, సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల, దృఢమైన సమాజ నిర్మాణంలో కృషి చేసి విజయం సాధించిందన్నారు. సోమవారం సమావేశం కానున్న బ్రిటన్ కేబినెట్.. కామెరాన్ పదవినుంచి తప్పుకునేందుకు తదుపరి చేయాల్సిన పనులను నిర్ణయించనుంది.
 
48.1  వ్యతిరేకం
బ్రెగ్జిట్
అనుకూలం 51.9

 
 సర్దుకునేందుకు కొంత సమయం: బోరిస్ జాన్సన్ (బ్రెగ్జిట్ ఉద్యమ నేత)

 రెఫరెండం తీర్పుతో ఉన్నపళంగా ఈయూతో తెగదెంపులు జరగవని.. అంతా సర్దుకునేందుకు కొంత సమయం పడుతుందని.. బ్రెగ్జిట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ తెలిపారు. ‘ఇది ప్రజా నిర్ణయం. ప్రజాస్వామ్య విజయం. ప్రజలు తమ నిర్ణయాన్ని ధైర్యంగా తెలియజేశారనేదానికి ఇదే నిదర్శనం. అయితే రెఫరెండంతో ఉన్నపళంగా మార్పులు సాధ్యం కాదు. అన్ని సర్దుకునేందుకు కొంత సమయం పడుతుంది’  అని అన్నారు. ప్రధాని కామెరాన్‌పై బోరిస్ ప్రశంసలు కురిపించారు. ‘కామెరాన్ మా తరం చూసిన అసాధారణ నాయకుడు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ధైర్యమున్న వ్యక్తి’ అని కొనియాడారు. యురోపియన్ యూనియన్ గొప్ప ఆలోచన.. కానీ ఇది బ్రిటన్‌కు సరిపోదని అభిప్రాయపడ్డారు. ఎప్పటికీ బ్రిటన్ యూరప్‌లో భాగమేనన్నారు.
 
 ఈయూ నుంచి విడిపోతామంటూ చరిత్రాత్మక నిర్ణయం
 లండన్: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవటం) వివాదంపై బ్రిటన్లు శుక్రవారం చారిత్రక నిర్ణయాన్ని వెలువరిచారు. ఈ వివాదంపై నాలుగు నెలల ఉత్కంఠకు తెరదీస్తూ.. ఈయూతో నాలుగున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకునేందుకే మెజారిటీ బ్రిటన్లు మొగ్గుచూపారు. దీంతో, ఈయూలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్.. ఈయూనుంచి తప్పుకోనున్న రెండో దేశంగా (గ్రీన్‌లాండ్ తర్వాత) నిలిచింది. గురువారం జరిగిన రెఫరెండంలో 51.9 శాతం మంది బ్రెగ్జిట్‌కే మద్దతు తెలిపారు. యూకే ఎన్నికల కమిషన్ చీఫ్ జెన్నీ వాట్సన్ ప్రతిష్ఠాత్మకమైన మాంచెస్టర్ టౌన్‌హాల్ నుంచి ఈ ఫలితాలను వెల్లడించారు. దాదాపు 3.3 కోట్ల మంది బ్రిటన్లు (ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్, జీబ్రాల్టర్) రెఫరెండంలో పాల్గొనగా 1.74 కోట్ల మంది (51.9 శాతం) విడిపోవాలని.. 1.61 మంది (48.1 శాతం) ఈయూతో కలిసుండాలని తమ నిర్ణయాన్ని తెలియజేశారు.

బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటర్ల మధ్య తేడా 12.69 లక్షలు మాత్రమే. లండన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో ఎక్కువ మంది యురోపియన్ యూనియన్‌లోనే ఉండాలని తమ అభిప్రాయాన్ని తెలపగా.. ఉత్తర, మధ్య ఇంగ్లాండ్, వేల్స్, మెజారిటీ ఇంగ్లీష్ కౌంటీలు మాత్రం బ్రెగ్జిట్‌కే మొగ్గుచూపాయి. రెఫరెండం ఫలితంతో.. త్వరలోనే ప్రధాని పదవినుంచి తప్పుకోనున్నట్లు బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరాన్ వెల్లడించారు. దేశాన్ని తదుపరి మజిలీకి తీసుకెళ్లటంలో తను సరైన వ్యక్తిని కాన్నారు. మూడు నెలల తర్వాత యూకేకు కొత్త ప్రధాని వస్తారని..ఆయన నాయకత్వంలోనే దేశం ముందుకెళ్తుందని కామెరాన్ స్పష్టం చేశారు. కామెరాన్ వారసుడిగా బ్రెగ్జిట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ పేరు వినబడుతోంది. పలువురు కన్జర్వేటివ్ పార్టీ నేతలూ పీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బ్రెగ్జిట్‌తో స్కాట్లాండ్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈయూలో యూకే కలిసుండాలని బలమైన ప్రజాభిప్రాయాన్ని తెలిపిన స్కాట్లాండ్.. తాజా ఫలితంతో.. యూకే నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఈయూలో కలవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జియాన్ ఈ విషయాన్ని చూచాయగా వ్యక్తం చేశారు. రెఫరెండం తర్వాత దేశం రెండుగా విడిపోయిందని.. అమెరికా, భారత్, చైనావంటి దేశాలతో ఈయూతో కలిసి వ్యాపారం చేసే అవకాశాన్ని కోల్పోయిందని కామెరాన్‌కు అత్యంత సన్నిహితుడైన భారత సంతతి ఎంపీ అలోక్ శర్మ తెలిపారు. బ్రెగ్జిట్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో పాటు వలసలపై కొత్త చర్చకు తెర లేచింది. ఇకపై యురోపియన్ దేశాలు, భారత్‌తోపాటు ప్రపంచ దేశాలతో బ్రిటన్ కొత్త వాణిజ్య బంధాలను నిర్వచించుకోవాల్సి ఉంటుంది. జర్మన్ చాన్స్‌లర్ అంజెలా మెర్కెల్ రెఫరెండాన్ని ఈయూకు పెద్ద దెబ్బ అని తెలపగా.. ఇది చాలా తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. ఈయూ పతనం మొదలైందని వస్తున్న వార్తలను యురోపియన్ కమిషన్ చీఫ్ జీన్ క్లాడ్ జంకర్ ఖండిచారు. కాగా, బ్రిటన్ నిర్ణయంతో నెదర్లాండ్స్, ఇటలీ కూడా రెఫరెండం ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
 
 కాందిశీకులే అసలు సమస్య!
 బయటకు ఎన్ని కారణాలు చెబుతున్నా... ప్రస్తుతం ఈయూ దేశాల్ని కుదిపేస్తున్నది కాందిశీకుల సమస్యే. ఈయూ ఒప్పందాల ప్రకారం ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రజలు వలస వెళ్లొచ్చు. దీంతో ఆర్థిక అస్తవ్యస్థ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దేశాల నుంచి, సిరియా, ఇరాక్ వంటి కల్లోల దేశాల నుంచి బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాలకు లక్షల మంది తరలివస్తున్నారు. పలుచోట్ల వలసదారుల సంఖ్య పెరుగుతోంది. ఇది సామాజిక మార్పులకూ దారితీస్తోంది. పెపైచ్చు వారికి భృతి చెల్లిస్తూ... ఉద్యోగాలిప్పిస్తున్నా చాలామంది చేయటం లేదు. సులభంగా భృతి అందుకుని జీవించడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇది పన్ను చెల్లింపుదారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. కాందిశీకులపై రేగుతున్న అసంతృప్తి ఏ స్థాయికి వెళ్లిందంటే... ‘ఈయూ’లో బ్రిటన్ కొనసాగాలని ప్రచారం చేస్తున్న బ్రిటన్ మహిళా ఎంపీని వారం రోజుల కిందట ఓ అగంతకుడు కాల్చిచంపాడు. రెఫరెండంలో ప్రతిఫలించింది కూడా ఈ ఆవేదన... ఆగ్రహమే!!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement