బ్రెగ్జిట్ ఉద్యమనేత ఫారేజ్ రాజీనామా
లండన్ : యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ ఉద్యమించిన నిగెల్ ఫారేజ్.. తన లక్ష్యం నెరవేరిందని పేర్కొంటూ సోమవారం యూకే ఇండిపెండెంట్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ‘బ్రెగ్జిట్’ తన రాజకీయ లక్ష్యమని, దానిని నెరవేర్చానని, తనకు ఎటువంటి అధికార కాంక్షలూ లేవని, తన జీవితం మళ్లీ తనకు కావాలని కోరుకుంటున్నానని ఫారేజ్(52) చెప్పారు.
1999లో యూకేఐపీ నుంచి ఈయూ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఫారేజ్.. ‘నా వంతు పని నేను చేశానని నేననుకుంటున్నా’ అని అన్నారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటర్లను ఒప్పించడానికి ఫారేజ్ క్షేత్రస్థాయిలో ప్రత్యేక ప్రచారం చేపట్టి చాలా సభలు నిర్వహించి ప్రసంగించారు.