
లండన్: ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ముహూర్తం ఖరారైంది. 2019, మార్చి 29, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈయూ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తామని ప్రధాని థెరిసా మే శుక్రవారం ప్రకటించారు. బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని చేరుస్తూ సవరణలు చేసిన తరువాత ఈయూ నిష్క్రమణ చట్టాన్ని వచ్చే వారంలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమని, ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధత, నిజాయతీపై సందేహం అక్కర్లేదని ‘ది డైలీ టెలిగ్రాఫ్’కు రాసిన వ్యాసంలో ఆమె తెలిపారు. చారిత్రక ఈయూ నిష్క్రమణ చట్టం ముందరి పేజీలోనే బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని స్పష్టంగా ప్రచురిస్తామని వెల్లడించారు.