బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే
- రెండో మహిళా ప్రధానిగా పగ్గాలు
- కామెరాన్ రాజీనామాకు రాణి ఆమోదం
లండన్ : బ్రిటన్ రెండో మహిళా ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం పగ్గాలు చేపట్టారు. కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక థెరిసా భర్త ఫిలిప్‌తో కలసి అధికారిక నివాసమైన 10 డౌన్‌స్ట్రీట్‌లోకి అడుగుపెట్టారు. అక్కడ అప్పటికే వేచిఉన్న అంతర్జాతీయ మీడియానుద్దేశించి ప్రసంగించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటికొచ్చిన బ్రిటన్‌ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలైన 59 ఏళ్ల థెరిసా చెప్పారు. బ్రెగ్జిట్ రెఫరెండం తీర్పుతో ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన డేవిడ్ కామెరాన్ బుధవారం సాయంత్రం తన భార్య సమంతా, ముగ్గురు పిల్లలతో కలసి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు.
అక్కడ రాణి రెండో ఎలిజబెత్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ఆమె ఆమోదం తెలిపారు. తర్వాత థెరిసాను ప్రధానిగా పగ్గాలు చేపట్టాలని రాణి ఆహ్వానించారు. కామెరాన్ కేబినెట్‌లో హోంమంత్రిగా చేసిన థెరిసా.. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో పనిచేశారు. గత 50 ఏళ్లలో బ్రిటన్ హోం మంత్రిగా ఎక్కువ కాలం చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. కెరిసా ఇక కేబినెట్‌పై తనదైన ముద్ర వేయనున్నారు. కామెరాన్ మంత్రివర్గంలో ఉద్యోగకల్పన మంత్రిగా పనిచేసిన భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు థెరిసా కీలక శాఖను అప్పగించే అవకాశముంది. గుజరాత్‌కు చెందిన 44 ఏళ్ల ప్రీతి బ్రెగ్జిట్‌కు అనుకూలంగా గళమెత్తారు. మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధాని (1979-1990)గా పనిచేశారు.
కామెరాన్ భారతీయ విందు.. ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటున్న సందర్భంగా కామెరూన్ తన సహచర మంత్రులకు, సన్నిహితులకు 10 డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయంలో వీడ్కోలు విందు ఇచ్చారు. హైదరాబాదీ శాఫ్రాన్ చికెన్, కశ్మీరీ రోగన్ జోష్, సమోసాలు, సాగ్ ఆలూ, శాగ్ పన్నీర్, పాలక్ గోస్ట్, రైస్ వంటి రుచికరమైన భారతీయ వంటకాలను ఏర్పాటు చేశారు. ఆరేళ్ల తర్వాత ప్రధానిగా ఆఖరి రోజును పూర్తి చేసుకున్న అనంతరం కామెరాన్ పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోతున్నప్పటికీ తాము ఈయూతో సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తామన్నారు.