Cameron
-
బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే
- రెండో మహిళా ప్రధానిగా పగ్గాలు - కామెరాన్ రాజీనామాకు రాణి ఆమోదం లండన్ : బ్రిటన్ రెండో మహిళా ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం పగ్గాలు చేపట్టారు. కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక థెరిసా భర్త ఫిలిప్‌తో కలసి అధికారిక నివాసమైన 10 డౌన్స్ట్రీట్లోకి అడుగుపెట్టారు. అక్కడ అప్పటికే వేచిఉన్న అంతర్జాతీయ మీడియానుద్దేశించి ప్రసంగించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటికొచ్చిన బ్రిటన్ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలైన 59 ఏళ్ల థెరిసా చెప్పారు. బ్రెగ్జిట్ రెఫరెండం తీర్పుతో ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన డేవిడ్ కామెరాన్ బుధవారం సాయంత్రం తన భార్య సమంతా, ముగ్గురు పిల్లలతో కలసి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ రాణి రెండో ఎలిజబెత్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ఆమె ఆమోదం తెలిపారు. తర్వాత థెరిసాను ప్రధానిగా పగ్గాలు చేపట్టాలని రాణి ఆహ్వానించారు. కామెరాన్ కేబినెట్లో హోంమంత్రిగా చేసిన థెరిసా.. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో పనిచేశారు. గత 50 ఏళ్లలో బ్రిటన్ హోం మంత్రిగా ఎక్కువ కాలం చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. కెరిసా ఇక కేబినెట్‌పై తనదైన ముద్ర వేయనున్నారు. కామెరాన్ మంత్రివర్గంలో ఉద్యోగకల్పన మంత్రిగా పనిచేసిన భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు థెరిసా కీలక శాఖను అప్పగించే అవకాశముంది. గుజరాత్‌కు చెందిన 44 ఏళ్ల ప్రీతి బ్రెగ్జిట్‌కు అనుకూలంగా గళమెత్తారు. మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధాని (1979-1990)గా పనిచేశారు. కామెరాన్ భారతీయ విందు.. ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటున్న సందర్భంగా కామెరూన్ తన సహచర మంత్రులకు, సన్నిహితులకు 10 డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయంలో వీడ్కోలు విందు ఇచ్చారు. హైదరాబాదీ శాఫ్రాన్ చికెన్, కశ్మీరీ రోగన్ జోష్, సమోసాలు, సాగ్ ఆలూ, శాగ్ పన్నీర్, పాలక్ గోస్ట్, రైస్ వంటి రుచికరమైన భారతీయ వంటకాలను ఏర్పాటు చేశారు. ఆరేళ్ల తర్వాత ప్రధానిగా ఆఖరి రోజును పూర్తి చేసుకున్న అనంతరం కామెరాన్ పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోతున్నప్పటికీ తాము ఈయూతో సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
ఆ సమస్యపై మోదీతో కామెరాన్ చర్చలు?
లండన్: టాటా స్టీల్ సంచలన నిర్ణయంపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించనున్నట్టు సమాచారం. వాషింగ్టన్ డీసీలో శుక్రవారం జరగనున్న అణుభద్రతా సదస్సులో ఇరువురు ప్రధానులు పాల్గొంటారు. ఈ క్రమంలో టాటా స్టీల్ అంశాన్ని బ్రిటన్ ప్రధాని ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. గత 12 నెలలుగా పనితీరు దిగజారుతున్న కారణంగా టాటా స్టీల్ బ్రిటన్‌లోని వ్యాపారాలకు గుడ్ బై చెప్పింది. యూకేలోని తమ సంస్థను పూర్తిగా కానీ.. భాగాలుగా కానీ విక్రయించాలని నిర్ణయానికి వచ్చినట్లు బోర్డు సమావేశం తర్వాత కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్రిటన్‌లోని తమ వ్యాపారాన్ని విక్రయించాలన్న టాటా స్టీల్ నిర్ణయం ప్రపంచ వ్యాపారవర్గాలను ఆశ్యర్యంలో ముంచెత్తింది. ఈ నిర్ణయంతో వేలకొద్దీ ఉద్యోగాలు సంకటస్థితిలో పడడంతో ప్రధాని కామెరాన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆగమేఘాలపై కార్మికసంఘాలతో చర్చలు జరిపారు. బ్రిటన్‌లోని కంపెనీ ప్లాంట్లలో పనిచేస్తున్న 17 వేల మందికి ఉద్యోగ భద్రత కల్పించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం మాట ఇచ్చింది. వేల్స్, బ్రిటన్ ప్రభుత్వాలు రెండూ కలిసి బ్రిటిష్ ఉక్కు పరిశ్రమను నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా అంతర్జాతీయంగా సరఫరా ఎక్కువ కావడం, చైనా నుంచి ఐరోపాకు చౌక ఎగుమతులు పెరగడం, తయారీవ్యయాలు అధికం కావడం, దేశీయ మార్కెట్లో గిరాకీ క్షీణత కొనసాగడం, కరెన్సీ ఊగిసలాటలు ఇవన్నీ కంపెనీకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఉద్యోగాల్లో కోత, ఆస్తులు విక్రయం, ఆధునికీకరణ లాంటివేవీ కంపెనీని లాభాల్లోకి తీసుకురాలేకపోయాయి. గత ఏడాది చివరికి కంపెనీ ఐరోపా వ్యాపారం 68 మిలియన్ పౌండ్ల నష్టాన్ని నమోదుచేసింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది రెట్టింపు నష్టం. దీనికి తోడు గత నెలలో టాటా స్టీల్ యూరోప్ సీఈఓ కార్ల్ కోహ్లర్ రాజీనామా తీవ్ర ప్రభావాన్ని చూపింది. అటు యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ ఉండాలా వద్దా అని నిర్ణయించడానికి జూన్‌లో రెఫరెండమ్ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అంతకుముందు తాత్కాలికంగా టాటా స్టీల్ యూరోప్‌ను జాతీయకరణ చేయడం సహా పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని సంస్థ బిజినెస్ సెక్రటరీ సాజిద్ జావిద్ వ్యతిరేకించారు కూడా. -
మహాత్మునికి బ్రిటన్ జోహార్లు
లండన్‌లో జాతిపిత విగ్రహ ఆవిష్కారం జెట్లీతో కలసి ఆవిష్కరించిన బ్రిటన్ ప్రధాని కామెరాన్ లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అహింసా మార్గంలో బ్రిటిషర్ల వలస పాలనకు తెరదించి భారతావనికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన భారత జాతిపిత మహాత్మాగాంధీకి అదే బ్రిటిష్ ప్రభుత్వం జేజేలు పలికింది. నాడు తాము విరోధిగా పరిగణించిన వ్యక్తికి నేడు అరుదైన గౌరవం కల్పించింది. శనివారం లండన్‌లోని ప్రఖ్యాత పార్లమెంటు స్క్వేర్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో 9 అడుగుల ఎత్తున్న గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించింది. గాంధీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారాం పాట మార్మోగుతుండగా భారత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో కలసి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్తోపాలు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ పదవులను అలంకరించని ఏకైక వ్యక్తికి, తొలి భారతీయుడికి బ్రిటన్ పార్లమెంటు స్క్వేర్‌లో విగ్రహ ప్రతిష్టాపన జరగడం విశేషం. బ్రిటన్ పార్లమెంటుకు ఎదురుగా, జాతివివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా పక్కన గాంధీ విగ్రహం కొలువుదీరింది. అయితే గాంధీజీని అర్ధనగ్న ఫకీర్‌గా అభివర్ణించిన బ్రిటన్ ఒకప్పటి ప్రధాని సర్ విన్స్టన్ చర్చిల్ విగ్రహం కూడా జాతిపిత విగ్రహం పక్కన ఉండటం గమనార్హం.1931లో చివరిసారిగా లండన్‌కు వచ్చినప్పుడు చలి నుంచి రక్షణ కోసం గాంధీజీ శాలువా కప్పుకున్న రీతిని ప్రతిబింబిస్తూ ఈ విగ్రహం కనిపిస్తుంది. మహాన్నత వ్యక్తికి నివాళి: కామెరాన్ గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మాట్లాడుతూ ప్రపంచ రాజకీయాల్లోని మహోన్నత వ్యక్తుల్లో ఒకరైన గాంధీజీకి ఈ విగ్రహం గొప్ప నివాళి అన్నారు. పార్లమెంటు స్క్వేర్‌లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయనకు తమ దేశంలో శాశ్వత నివాసాన్ని కల్పిస్తున్నామన్నారు. బ్రిటన్ సభ్యతకు నిదర్శనం: జైట్లీ గతంలో విరోధిగా పరిగణించిన వ్యక్తిని గౌరవించేందుకు విగ్రహం ఏర్పాటు చేయడం బ్రిటన్ సభ్యతకు నిదర్శనమని ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన జైట్లీ పేర్కొన్నారు. దేశంలోని అత్యంత ప్రముఖ బహిరంగ ప్రదేశంలో గాంధీజీని గౌరవించాలనుకోవడం బ్రిటన్ ఉదారవాదానికి, బ్రిటిష్ ప్రజాస్వామ్యానికి నివాళి అన్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ శిల్పి ఫిలిప్ జాక్సన్ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.