మహాత్మునికి బ్రిటన్ జోహార్లు
- లండన్‌లో జాతిపిత విగ్రహ ఆవిష్కారం
- జెట్లీతో కలసి ఆవిష్కరించిన బ్రిటన్ ప్రధాని కామెరాన్
లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అహింసా మార్గంలో బ్రిటిషర్ల వలస పాలనకు తెరదించి భారతావనికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన భారత జాతిపిత మహాత్మాగాంధీకి అదే బ్రిటిష్ ప్రభుత్వం జేజేలు పలికింది. నాడు తాము విరోధిగా పరిగణించిన వ్యక్తికి నేడు అరుదైన గౌరవం కల్పించింది. శనివారం లండన్‌లోని ప్రఖ్యాత పార్లమెంటు స్క్వేర్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో 9 అడుగుల ఎత్తున్న గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించింది. గాంధీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారాం పాట మార్మోగుతుండగా భారత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో కలసి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తోపాలు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ పదవులను అలంకరించని ఏకైక వ్యక్తికి, తొలి భారతీయుడికి బ్రిటన్ పార్లమెంటు స్క్వేర్‌లో విగ్రహ ప్రతిష్టాపన జరగడం విశేషం. బ్రిటన్ పార్లమెంటుకు ఎదురుగా, జాతివివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా పక్కన గాంధీ విగ్రహం కొలువుదీరింది.
అయితే గాంధీజీని అర్ధనగ్న ఫకీర్‌గా అభివర్ణించిన బ్రిటన్ ఒకప్పటి ప్రధాని సర్ విన్‌స్టన్ చర్చిల్ విగ్రహం కూడా జాతిపిత విగ్రహం పక్కన ఉండటం గమనార్హం.1931లో చివరిసారిగా లండన్‌కు వచ్చినప్పుడు చలి నుంచి రక్షణ కోసం గాంధీజీ శాలువా కప్పుకున్న రీతిని ప్రతిబింబిస్తూ ఈ విగ్రహం కనిపిస్తుంది.
మహాన్నత వ్యక్తికి నివాళి: కామెరాన్
గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మాట్లాడుతూ ప్రపంచ రాజకీయాల్లోని మహోన్నత వ్యక్తుల్లో ఒకరైన గాంధీజీకి ఈ విగ్రహం గొప్ప నివాళి అన్నారు. పార్లమెంటు స్క్వేర్‌లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయనకు తమ దేశంలో శాశ్వత నివాసాన్ని కల్పిస్తున్నామన్నారు.
బ్రిటన్ సభ్యతకు నిదర్శనం: జైట్లీ
గతంలో విరోధిగా పరిగణించిన వ్యక్తిని గౌరవించేందుకు విగ్రహం ఏర్పాటు చేయడం బ్రిటన్ సభ్యతకు నిదర్శనమని ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన జైట్లీ పేర్కొన్నారు. దేశంలోని అత్యంత ప్రముఖ బహిరంగ ప్రదేశంలో గాంధీజీని గౌరవించాలనుకోవడం బ్రిటన్ ఉదారవాదానికి, బ్రిటిష్ ప్రజాస్వామ్యానికి నివాళి అన్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ శిల్పి ఫిలిప్ జాక్సన్ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.