బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు!
► ప్రధాని థెరిసా మే అనూహ్య నిర్ణయం
► జూన్ 8న ఎన్నికలు నిర్వహించే యోచన
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే అనూహ్యమైన రీతిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూన్ 8న ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఆమె పిలుపునిచ్చారు. థెరెసా మే నిర్ణయం మిత్రపక్షాలతోపాటు ప్రత్యర్థుల్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని గతంలో పలుమార్లు పేర్కొన్న మే ఒక్కసారిగా ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వడం విశేషం. మంగళవారం ప్రధానమంత్రి మే తన డౌనింగ్ స్ట్రీట్ నివాసం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక దేశంలో కొన్నేళ్లపాటు రాజకీయ సుస్థిరత నెలకొనాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.
బ్రెగ్జిట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఆటలు ఆడుతున్నాయని ఆమె ఈ సందర్భంగా విమర్శించారు. బ్రెగ్జిట్‌ను విజయవంతం చేయడానికి అవసరమైన సామర్ధ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని, ఇందుకుగాను అందరి మద్దతును కోరుతున్నానని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని ఆమె సోమవారమే బ్రిటన్ రాణికి తెలిపారు.
డౌనింగ్‌స్ట్రీట్‌లో కేబినెట్ సమావేశం అనంతరం మే నుంచి తాజా నిర్ణయం వెలువడింది. బ్రిటన్‌లో తదుపరి ఎన్నికలు షెడ్యూలు ప్రకారం 2020లో జరగాల్సి ఉంది. అయితే మూడింట రెండువంతుల మెజారిటీతో బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం తెలిపితే ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. మొత్తం 650 ఎంపీల్లో 434 మంది దీనికి అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఎన్నికలపై ‘హౌస్ ఆఫ్ కామన్స్’ బుధవారం నిర్ణయించే అవకాశముంది. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత జెరెమీ కోర్బిన్ స్వాగతించారు.