బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్
భార్య అక్షతతో స్వామి నారాయణ్ మందిర్‌లో పూజలు
లండన్: హిందూ ధర్మమే తనకు ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ’’భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆదివారం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు.
వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సునాక్ దంపతులకు ఆలయంలోకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతా మూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు.
ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం లండన్‌లోని కింగ్స్‌బరీ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామి నారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు హిందువుల ఓట్లపై కన్నేశాయి.
Comments
Please login to add a commentAdd a comment