కొనసాగుతున్న ఉత్కంఠ
లండన్: సాధారణ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. 318 ఎంపీ స్థానాలు దక్కించుకున్న కన్జర్వేటివ్ పార్టీతోపాటు 261 స్థానాల్లో గెలుపొందిన లేబర్ పార్టీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి. కన్జర్వేటివ్ నాయకురాలు, ప్రస్తుత ప్రధాని థెరిస్సామే ఒక అడుగు ముందుకేసి డీయూపీతో చర్చలు జరిపారు.
మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్‌లో మ్యాజిక్ ఫిగర్(326)కు చేరుకోవాలంటే కన్జర్వేటివ్ పార్టీకి ఇంకా 8 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ మేరకు 10 మంది ఎంపీలున్న డెమోక్రటిక్ యూనియనిస్త్ పార్టీ(డీయూపీ)తో కన్జర్వేటివ్‌లు జరిపిన చర్చలు ఫలవంతం అయినట్లు తెలిసింది. థెరిస్సా మే.. శుక్రవారమే రాణి ఎలిజబెత్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాల్సిదిగా కోరనున్నారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అపాయింట్‌మెంట్ కూడా ఖరారయినట్లు తెలిసింది.
మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: జెరెమీ కోర్బిన్
261స్థానాల్లో విజయం సాధించిన తాము యూకేలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని లేబర్ పార్టీ అధినేత జెరెమీ కొర్బిన్ ప్రకటించారు. దేశ సుస్థిరత కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. థెరెసా మే ప్రధాన మంత్రి పదవికి తక్షణమే రాజీనామాచేసి, నిజమైన ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు.
ఉత్కంఠగా సాగిన ఫలితాలు
యూకే సార్వత్రిక ఎన్నికలు గురువారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగిశాయి. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా 318 స్థానాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ గెలుపొందింది. గత(2015) ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి అనూహ్యంగా వెనుకబడిపోయింది. కౌంటింగ్ ప్రారంభంలోనే ప్రతిపక్ష లేబర్ పార్టీ దూసుకుపోవడంతో బంపర్ మెజారిటీ ఖాయమని అంతా భావించారు. కానీ లేబర్లు 261 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. స్కాటిష్ నేషనల్ పార్టీ 35 సీట్లు సాధించి మూడోఅతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాలలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(12 స్థానాలు), డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(10 స్థానాలు), ది గ్రీన్ పార్టీ(1 స్థానం)లు నిలిచాయి.
‘బ్రెగ్జిట్’ పార్టీకి చుక్కెదురు
యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని ఉద్యమాలు చేసి, విజయం సాధించిన యూకే ఇండిపెండెంట్ పార్టీ(యూకేఐపీ) తాజా ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. ఉన్న ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేక సున్నాకు పరిమితమైంది.