jeremy corbyn
-
ముగిసిన బ్రిటన్ ఎన్నికలు
లండన్: బ్రిటన్ ప్రతినిధుల సభకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్ల్లోని మొత్తం 650 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,322 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా, అప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రతిపక్ష నేత జెరెమి కార్బిన్ ఉదయమే ఓటేశారు. బ్రిటన్‌లో డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగడం దాదాపు ఒక శతాబ్దం అనంతరం ఇదే తొలిసారి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ పార్లమెంట్ ఏర్పడనుందని ప్రీ పోల్ సర్వేలు వెల్లడించాయి. పోలింగ్ ముగియగానే కౌంటింగ్ ప్రారంభమైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయానికి ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. 2017లో జరిగిన ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన 12 మంది విజయం సాధించారు. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. -
బ్రిటన్ లేబర్ పార్టీలో చీలిక
లండన్: బ్రెగ్జిట్, యూదు వ్యతిరేక వాదం అంశాలపై బ్రిటన్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ అనురిస్తున్న విధానాలకు నిరసనగా ఏడుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. లేబర్ పార్టీకి రాజీనామా చేశామనీ, పార్లమెంటులో ఓ ప్రత్యేక స్వతంత్ర బృందంగా తాము వ్యవహరిస్తామని ఏడుగురు ఎంపీలు చెప్పారు. ఎంపీలు చుకా ఉమున్నా, లూసియానా బర్జర్, క్రిస్ లెస్లీ, ఎంజెలా స్మిత్, మైక్ గేప్స్, గావిన్ షుకర్, అన్నే కోఫీ మీడియాతో ఈ విషయం చెప్పారు. యూదులపై మత విద్వేషం, వారిని గేలి చేయడం, భయపెట్టడం వంటివి భరించలేక, బ్రెగ్జిట్‌పై పార్టీ వైఖరి నచ్చక తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని బర్జర్ తెలిపారు. తమకు సొంత పార్టీ పెట్టే ఆలోచనేదీ లేదన్నారు. కాగా, 1981లో నలుగురు లేబర్ పార్టీలో ప్రధాన నేతలు పార్టీ నుంచి బయటకొచ్చి సోషల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టారు. ఆ తర్వాత లేబర్ పార్టీలో వచ్చిన అతి పెద్ద చీలిక ఇదే కావడం గమనార్హం. ఫేస్బుక్.. ఓ డిజిటల్ గ్యాంగ్‌స్టర్ నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం నియంత్రణలో ఫేస్బుక్ వ్యవహారశైలిపై బ్రిటన్ పార్లమెంటు కమిటీ మండిపడింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ను ‘డిజిటల్ గ్యాంగ్‌స్టర్’గా కమిటీ అభివర్ణించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) ఉదంతం నేపథ్యంలో ఏర్పాటైన హౌస్ ఆఫ్ కామన్స్ డిజిటల్ కల్చర్, మీడియా, స్పోర్ట్(డీసీఎంఎస్) సెలక్షన్ కమిటీ 18 నెలల విచారణ అనంతరం నివేదికను సమర్పించింది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ బ్రిటన్ పార్లమెంటు ముందు హాజరుకాకుండా ధిక్కారానికి పాల్పడ్డారని కమిటీ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్బుక్ లాంటి డిజిటల్ గ్యాంగ్ స్టర్లను చట్టానికి అతీతంగా వ్యవహరించేందుకు అనుమతించరాదని అభిప్రాయపడింది. సీఏ మాతృసంస్థ ఎస్సీఎల్, దాని అనుబంధ సంస్థలు భారత్, పాక్, కెన్యా, నైజీరియా ఎన్నికల కోసం నైతికతను ఉల్లంఘించి పనిచేశాయని తెలిపింది. -
కొనసాగుతున్న ఉత్కంఠ
లండన్: సాధారణ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. 318 ఎంపీ స్థానాలు దక్కించుకున్న కన్జర్వేటివ్ పార్టీతోపాటు 261 స్థానాల్లో గెలుపొందిన లేబర్ పార్టీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి. కన్జర్వేటివ్ నాయకురాలు, ప్రస్తుత ప్రధాని థెరిస్సామే ఒక అడుగు ముందుకేసి డీయూపీతో చర్చలు జరిపారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్లో మ్యాజిక్ ఫిగర్(326)కు చేరుకోవాలంటే కన్జర్వేటివ్ పార్టీకి ఇంకా 8 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ మేరకు 10 మంది ఎంపీలున్న డెమోక్రటిక్ యూనియనిస్త్ పార్టీ(డీయూపీ)తో కన్జర్వేటివ్‌లు జరిపిన చర్చలు ఫలవంతం అయినట్లు తెలిసింది. థెరిస్సా మే.. శుక్రవారమే రాణి ఎలిజబెత్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాల్సిదిగా కోరనున్నారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అపాయింట్మెంట్ కూడా ఖరారయినట్లు తెలిసింది. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: జెరెమీ కోర్బిన్ 261స్థానాల్లో విజయం సాధించిన తాము యూకేలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని లేబర్ పార్టీ అధినేత జెరెమీ కొర్బిన్ ప్రకటించారు. దేశ సుస్థిరత కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. థెరెసా మే ప్రధాన మంత్రి పదవికి తక్షణమే రాజీనామాచేసి, నిజమైన ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఉత్కంఠగా సాగిన ఫలితాలు యూకే సార్వత్రిక ఎన్నికలు గురువారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగిశాయి. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా 318 స్థానాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ గెలుపొందింది. గత(2015) ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి అనూహ్యంగా వెనుకబడిపోయింది. కౌంటింగ్ ప్రారంభంలోనే ప్రతిపక్ష లేబర్ పార్టీ దూసుకుపోవడంతో బంపర్ మెజారిటీ ఖాయమని అంతా భావించారు. కానీ లేబర్లు 261 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. స్కాటిష్ నేషనల్ పార్టీ 35 సీట్లు సాధించి మూడోఅతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాలలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(12 స్థానాలు), డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(10 స్థానాలు), ది గ్రీన్ పార్టీ(1 స్థానం)లు నిలిచాయి. ‘బ్రెగ్జిట్’ పార్టీకి చుక్కెదురు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని ఉద్యమాలు చేసి, విజయం సాధించిన యూకే ఇండిపెండెంట్ పార్టీ(యూకేఐపీ) తాజా ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. ఉన్న ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేక సున్నాకు పరిమితమైంది.