
థెరిసా మేకు ఉగ్రదాడుల దెబ్బ!
లండన్: బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన రెండు ఉగ్రదాడులు అధికార కన్సర్వేటీవ్ పార్టీపై భారీగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బ్రెగ్జిట్ చర్చల సమర్థత అంశంతో మూడేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లిన ప్రధాని థెరిసా మే.. మెజార్టీ మార్క్ సాధించడంలో విఫలమయ్యారు. ఫలితాల్లో కన్సర్వేటీవ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించడంలో విఫలమైంది. దీంతో బ్రిటన్‌లో హంగ్ ప్రభుత్వం ఏర్పడనుంది.
మొత్తం 650 స్థానాలున్న హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మెజారిటీ మార్క్ 326 స్థానాలు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కన్సర్వేటీవ్ పార్టీ 315 స్థానాల్లో విజయం సాధించగా.. జిరొమి కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ 261 స్థానాలు దక్కించుకుంది. ఇతరులు 74 స్థానాల్లో విజయం సాధించారు. ఫలితాల ఆరంభంలో లేబర్‌పార్టీ ఆధిక్యంలో ఉన్నా క్రమంగా వెనుకబడింది. కన్సర్‌వేటీవ్ పార్టీ 48.5 శాతం ఓట్లు సాధించగా.. లేబర్ పార్టీకి 40.2 శాతం ఓట్లు దక్కాయి. ఫలితాల నేపథ్యంలో మెజారిటీ మార్క్‌ను సాధించలేకపోయిన థెరిసా మే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని జిరొమి కార్బిన్ కోరారు.