ట్రంప్ విధానాలపై లండన్ 'గరంగరం'
లండన్: ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై ఆంక్షలు కఠినం చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాతో పాటు బ్రిటన్‌లోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లండన్‌లో శనివారం వేల సంఖ్యలో పాల్గొన్న నిరసనకారులు.. నిషేధాన్ని ట్రంప్ వెనక్కితీసుకోవాలని నినాదాలు చేశారు.
స్టాప్ ద వార్ కోలిషన్, స్టాండ్ అప్ టు రెసిజమ్, ముస్లిం అసోసియేషన్ ఆఫ్ బ్రిటన్‌తో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో.. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని థెరిసా మే.. డొనాల్డ్ ట్రంప్ను ఆహ్వనించడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సెంట్రల్ లండన్‌లోని యూఎస్ ఎంబసీ నుంచి డౌనింగ్ స్ట్రీట్ వరకు నిర్వహించిన ఈ మార్చ్‌లో.. ట్రంప్ తీసుకున్న బ్యాన్ నిర్ణయం ముమ్మాటికీ 'రేసిస్టు' విధానమే అని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్, థెరిసా మే లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్లకార్డులను ప్రదర్శించారు.
ముస్లిం దేశాల పౌరులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న వెంటనే బ్రిటన్‌లో నిరసనలు మొదలైన విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటిస్తే.. అది బ్రిటన్ రాణికి అవమానం అని, ఈ పర్యటనను ఆపాలని ప్రభుత్వాన్ని కోరిన పిటిషన్పై 1.8 మిలియన్ల మంది సంతకాలు చేయడం అక్కడ ట్రంప్ విధానాలపై ఉన్న వ్యతిరేకతను సూచిస్తోంది.