బ్రిటన్‌లో ‘మధ్యంతర’ పోరు
సాహసమో, దుస్సాహసమో... ప్రధాన ప్రతిపక్షం అంతర్గత పోరులో సతమత మవుతున్నప్పుడే మధ్యంతర ఎన్నికల అస్త్రం ప్రయోగించాలని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే నిర్ణయించారు. 50 రోజుల వ్యవధిలో... అంటే జూన్ 8న ఈ ఎన్నిక లుంటాయని ప్రకటించారు. అయిదేళ్లకోసారి ఎన్నికలు జరిగే బ్రిటన్ పార్లమెం టుకు 2015లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో అప్పటి ప్రధాని డేవిడ్ కామె రాన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ విజయం సాధించి చాన్నాళ్ల తర్వాత సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. యూరప్ యూనియన్(ఈయూ)లో కొనసా గాలా, వద్దా అన్న అంశంపై నిరుడు జూన్‌లో నిర్వహించిన రిఫరెండంలో 51.9 శాతంమంది బయటకు పోవడానికి అనుకూలంగా ఓటేయడంతో డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ థెరిస్సా మే ఒడిదుడుకులు పడుతూనే ఉన్నారు. ఈయూ పేరు పెట్టుకుని నాలుగు దశాబ్దాలే కావొచ్చుగానీ... ఏడు దశాబ్దాలక్రితం యూరోపియన్ ఎకనా మిక్ కమ్యూనిటీ(ఈఈసీ)గా ఉన్నప్పటినుంచీ దానితో బ్రిటన్‌కున్న అనుబంధం బలమైనది. చెప్పాలంటే ఆ సంస్థ ఆవిర్భావంలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర. అంతటి అనుబంధాన్ని తెంచుకుని ఒంటరి ప్రయాణానికి సంసిద్ధం కావడమమంటే మాటలు కాదు.
పైగా మొత్తంగా చూస్తే బ్రెగ్జిట్‌వైపు అధికులు మొగ్గి ఉండొచ్చుగానీ కేవలం ఇంగ్లండ్, వేల్స్ రాష్ట్రాలు రెండు మాత్రమే ఆ వాదనను బలపరిచాయి. అటు స్కాట్లాండ్, ఇటు నార్తర్న్ ఐర్లాండ్ గట్టిగా వ్యతిరేకించాయి. అంతేకాదు... స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోతామని ప్రకటించింది. అందుకు సాధ్యమైనంత త్వరగా రిఫరెండం నిర్వహించమని స్కాట్లాండ్ డిమాండ్ చేస్తోంది. మరోపక్క త్వరగా బయటకు వెళ్లమని ఈయూ నుంచి బ్రిటన్‌కు సందేశాలు అందుతున్నాయి. అధికారంలోకి రావడం కోసం బ్రెగ్జిట్ అంటే ఇష్టం లేకపోయినా 2015 ఎన్నికల్లో దాన్ని కన్సర్వేటివ్‌లు నెత్తినపెట్టుకున్నారు. తమ పార్టీ ఓడిపోతుందని సర్వేలన్నీ చెప్పడంతో వారు ఆందోళనచెందారు. నెగ్గితే ఎటూ అత్తెసరు మెజారిటీయే వస్తుం దని, రిఫరెండం పెట్టడానికి కూటమిలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంగీకరిం చడం లేదని సాకు చెప్పి తప్పించుకోవచ్చునని భావించారు. కానీ అందరి అంచ నాలనూ తలకిందులు చేస్తూ కన్సర్వేటివ్‌లు సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పర్చగల స్థాయికి చేరారు. విధి లేక డేవిడ్ కామెరాన్ రిఫరెండం పెట్టక తప్పలేదు. అందులో అధిక శాతంమంది మొగ్గు చూపడంతో ఆయన తప్పుకున్నారు.
ఆయన స్థానంలో వచ్చిన థెరిస్సా సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ ప్రారంభించాలో, ఎలా కొనసాగించాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఈయూ నుంచి బయటికొస్తే సమస్యలన్నీ మంత్రించినట్టు మాయమవు తాయని చాలామంది అనుకున్నా పరిస్థితులు అలా లేవు. దాంతో ప్రజల్లో అసం తృప్తి పెరుగుతోంది. కఠిన నిబంధనలతో వలసదారులను కట్టడి చేసే చట్టాన్ని తీసుకొస్తే అంతా చక్కబడుతుందని థెరిస్సా భావించారు. అక్రమ వలసదారులను, గడువుకు మించి ఉంటున్నారని గుర్తించిన వేలాదిమందిని అరెస్టు చేశారు. బ్రిట న్‌కు రాదల్చుకున్నవారిపై అనేక ఆంక్షలు పెట్టారు. ఇవి పెద్దగా ఫలితాన్నివ్వలేదు. అటు అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఏమంత అనుకూలంగా లేవు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌కు అండగా ఉంటామని గట్టి హామీ ఇవ్వలేక పోయారు. పైగా ఆయనను ఎంతవరకూ విశ్వసించవచ్చునో తెలియదు.
రేపన్న రోజున స్వతంత్ర బ్రిటన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో తమకు ఎదురుకాగల పోటీని అంచనా వేసుకున్న ఈయూ దేశాలు.. మరీ ముఖ్యంగా జర్మనీ బ్రెగ్జిట్ లావాదేవీల్లో బ్రిటన్‌తో కఠినంగా ఉండాలని నిర్ణయించాయి. వీటన్నిటి పర్య వసానంగా నానాటికీ సమస్యలు తీవ్ర రూపం దాలుస్తాయని కన్సర్వేటివ్‌లకు అర్థ మైంది. వాస్తవం ఇది కాగా ఈయూ నుంచి ఉపసంహరించుకోవడానికి సంబం ధించిన ప్రక్రియకు విపక్షాలు అడ్డుకోకుండా నిరోధించడానికే మధ్యంతర ఎన్నికలు ప్రకటించానని థెరిస్సా దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. వాస్తవా నికి 2015 పార్లమెంటు ఎన్నికల్లోగానీ, రిఫరెండంలోగానీ బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించిన విపక్ష లేబర్ పార్టీ తన వైఖరిని మార్చుకుంది. ఈయూ నుంచి బయటకు రావడానికి సంబంధించిన బిల్లుకు ఈమధ్యే అనుకూలంగా ఓటేసింది. పైగా బ్రెగ్జిట్ కార్యాచరణ రూపకల్పనకు మరింత చురుగ్గా కదలాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.
అయితే ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలిచినా బ్రెగ్జిట్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. ఒకసారి రిఫరెండంలో ప్రజాభి ప్రాయం వెల్లడైంది గనుక దాన్ని అమలు చేయడం మినహా వేరే మార్గం లేదు. బ్రెగ్జిట్ వద్దనుకున్న పార్టీ తాము అధికారంలోకొస్తే మరో రిఫరెండం నిర్వహి స్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. బ్రెగ్జిట్‌ను గతంలో వ్యతిరేకించిన లేబర్ పార్టీ ఇప్పుడు తన మనసు మార్చుకుంది. అయితే కన్సర్వేటివ్‌ల తరహాలో మొండిగా కాక ఈయూతో సామరస్యంతో మెలగి దేశ ప్రయోజనాలను కాపాడతామని ఆ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ హామీ ఇస్తున్నారు. ఇది కన్సర్వేటివ్ మద్దతుదార్ల లోని ఈయూ అను కూలవాదులను కూడా ఆకట్టుకుంటుందని ఆయన ఆశిస్తు న్నారు. వాస్తవానికి ఇటీవల విడుదలైన సర్వేలు కన్సర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీకన్నా 21 పాయింట్ల ఆధిక్యతలో ఉన్నదని తేల్చాయి. ఈ సర్వేలు, లేబర్ పార్టీ అంతర్గత పోరు చూసి థెరిస్సా మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న కీలక నిర్ణయం తీసుకు న్నారు. అయితే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై తలెత్తే ప్రశ్నలకు జవాబివ్వగల నన్న విశ్వాసం ఆమెకు ఉందా? ఎన్నికలకు ముందు సంప్రదాయంగా జరిగే టెలివి జన్ చర్చలకు దూరంగా ఉండాలని థెరిస్సా నిర్ణయించుకోవడాన్ని గమనిస్తే ఆ విష యంలో ఎవరికైనా అనుమానాలు తలెత్తకమానవు. మొత్తానికి బ్రిటన్ పౌరులు ఎవరి విధానాలకు అనుకూలమో మరో 50 రోజుల్లో తేలిపోతుంది. ఎవరు అధికా రంలోకొచ్చినా సమస్యల బెడద తీవ్రంగానే ఉంటుంది.