రిషి సునాక్‌కు షాక్‌ తప్పదా.?.. తాజా సర్వే ఏం చెప్పింది? | Rishi Sunak Lose Their Seats At A General Elections Says Survey | Sakshi
Sakshi News home page

రిషి సునాక్‌కు షాక్‌ తప్పదా.?.. తాజా సర్వే ఏం చెప్పింది?

Published Fri, Jun 21 2024 3:26 PM | Last Updated on Fri, Jun 21 2024 4:11 PM

Rishi Sunak Lose Their Seats At A General Elections Says Survey

లండన్‌ : ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. రిషి సునాక్‌కు ఓటమి తప్పేలా లేదు. బ్రిటన్‌ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఘోరంగా ఓడిపోనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు రిషి సునాక్‌కు ఓడిపోవడం ఖాయమని చెప్పగా.. తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

రిషి సునాక్‌కు షాక్‌ తప్పదా.? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. బ్రిటన్‌కు తొలి భారత సంతతి ప్రధాని అయిన రిషి సునాక్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఒపీనియన్‌ పోల్స్‌ ఇదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ ఈ సారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటికే మూడు సర్వేలు వెల్లడించగా.. తాజాగా మరో సర్వే కూడా జూలై 4న జరుగనున్న ఎన్నికల్లో సునాక్ ఘోరంగా ఓడిపోతారని అంచనా వేసింది.

సండే టెలిగ్రాఫ్ పత్రిక కోసం మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత సర్వేను నిర్వహించింది. జూన్ 12 నుంచి 14 మధ్య సర్వే చేసినట్లు వెల్లడించింది. ఈ సర్వేలో ప్రతిపక్ష లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్లు తగ్గి 21 శాతానికి చేరుకుంది. రాబోయే బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్‌కిన్స్ తెలిపారు. ఇక.. ప్రజలు పోస్టల్‌ బ్యాలెట్లు అందుకోవాడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే సర్వే ఫలితాలు వెలువడటం విశేషం.

కన్జర్వేటివ్‌ పార్టీకి ఘోర పరాజయం తప్పదని సర్వే సంస్థలు చెబుతున్నాయి. 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. 200 ఏండ్ల బ్రిటన్‌ ఎన్నికల చరిత్రలో ఇదే అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాగా, మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement