UK Cabinet
-
‘ప్రధానిగా ఆయనే సరైన వ్యక్తి’.. బోరిస్‌కు పెరుగుతున్న మద్దతు!
లండన్: కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని రేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషీ సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు 100 మందికిపైగా ఎంపీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీకి సిద్ధమయ్యారు. విహారయాత్రను అర్ధాంతరంగా ముగించుకుని బ్రిటన్ చేరుకున్నారు. ఈ క్రమంలో భారత సంతతి వ్యక్తి, బోరిస్ కేబినెట్లో హోంశాఖ మంత్రిగా పని చేసిన ప్రీతి పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిజ్ ట్రస్ స్థానంలో ప్రధాని పదవి చేపట్టేందుకు బోరిస్ జాన్సన్ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఓవైపు.. రిషీ సునాక్‌కు ఎంపీల మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బోరిస్ జాన్సన్‌కు మద్దతు తెలుపుతూ ట్విటర్ వేదికగా వెల్లడించారు ప్రీతి పటేల్.‘ ప్రస్తుత సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగల సత్తా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఉందనటంలో ఆయనకు సరైన ట్రాక్ రికార్డ్ ఉంది. మన మేనిఫెస్టోను అమలు చేయగలరు. ఈ నాయకత్వ పోటీలో నేను ఆయనకు మద్దతు ఇస్తున్నాను.’అనిపేర్కొన్నారు ప్రీతి పటేల్. ప్రధాని రేసులో నిలవాలని భావిస్తున్న బోరిస్ జాన్సన్ హుటాహుటిన బ్రిటన్ తిరిగి వచ్చిన క్రమంలో ప్రీతి పటేల్ ట్వీట్ చేయటం గమనార్హం. బోరిస్ జాన్సన్ ఆరు వారాల క్రితమే ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. తన కేబినెట్లోని అసమ్మతి నేతలు రాజీనామాలు చేయటం వల్ల ఆయన పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అయితే, ఇప్పటికీ ఆయనకు పార్టీలో ఆదరణ తగ్గలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ముగ్గురు కేబినెట్ మంత్రులు బోరిస్‌కు మద్దతు ప్రకటించారు. వాణిజ్య శాఖ మంత్రి జాకబ్ రీస్ మోగ్, రక్షణ మంత్రి బెన్ వల్లాస్, సిమోన్ క్లెర్క్‌లు బోరిస్‌కు అండగా నిలిచారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్‌కు 46 మంది ఎంపీల మద్దతు ఉండగా.. రిషీ సునాక్‌కు 100 మంది ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి ఎవరు పోటీలో ఉండనున్నారని తెలనుంది. అయితే, ఒక్కరే పోటీలో ఉన్నట్లు తెలితే వచ్చే వారమే కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కానీ, ఒకవేళ ఇద్దరు బరిలో ఉంటే 1,70,000 మంది పార్టీ సభ్యులు వచ్చే శుక్రవారం ఆన్లైన్ ఓటింగ్‌లో పాల్గొని తమ నాయకుడిని ఎన్నుకుంటారు. I'm backing @BorisJohnson to return as our Prime Minister, to bring together a united team to deliver our manifesto and lead Britain to a stronger and more prosperous future. pic.twitter.com/6wyGmASLda — Priti Patel MP (@pritipatel) October 22, 2022 ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్ -
రెఫరెండం సరే.. తర్వాత ఏంటి?
బ్రిటన్‌లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ - వీలైనంత త్వరగా తెగదెంపుల ప్రక్రియకు శ్రీకారం - కన్జర్వేటివ్ పార్టీలోనూ నాయకత్వ పోరు లండన్: చరిత్రాత్మక రెఫరెండమ్‌తో ప్రజా తీర్పు వెల్లడైంది కానీ... తర్వాత ఏం జరుగుతుందనే విషయమై బ్రిటన్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. యురోపియన్ యూనియన్‌లోని దేశాలతో వాణిజ్య భాగస్వామ్యంపై చర్చల ప్రక్రియే యూకే ముందున్న అతిపెద్ద సవాలు. దీంతోపాటు.. అధికార కన్జర్వేటివ్ పార్టీలోనూ నాయకత్వ రేసు మొదలు కానుంది. సాధారణంగా అయితే రెఫరెండం ఫలితానికి బ్రిటన్ ప్రభుత్వం చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ.. 2015 సాధారణ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే కన్జర్వేటివ్ పార్టీ రెఫరెండాన్ని నిర్వహించి.. ప్రజాతీర్పును గౌరవించాల్సి వచ్చింది. రాజీనామా విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రధాని డేవిడ్ కామెరాన్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. కాగా, సోమవారం కామెరాన్ అధ్యక్షతన బ్రిటన్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీ తర్వాత మంగళ, బుధవారాల్లో ఆయన బ్రసెల్స్ చేరుకుని యూరోపియన్ కౌన్సిల్‌కు బ్రిటన్ రిఫరెండమ్ గురించి సమాచారం అందజేస్తారు. కొత్త ప్రధానికి కత్తిమీద సామే! బ్రెగ్జిట్‌పై ప్రజాతీర్పు వరకు అంతా సవ్యంగానే సాగినా.. ఇకపై పరిస్థితులు క్లిష్టంగా మారనున్నాయి. దీనికి కారణాలనేకం. ముఖ్యంగా రెఫరెండమ్ అమల్లోకివచ్చిన తర్వాత వాణిజ్యపరమైన అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున పునఃసంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాలి. అలాగే ఈయూ-బ్రిటన్ మధ్య భవిష్యత్తులో సంబంధాలు ఏవిధంగా ఉంటాయనేదీ కీలకమే. ఈ సంప్రదింపుల ప్రక్రియ ఏళ్లకేళ్లు కొనసాగొచ్చనేది నిపుణుల అంచనా. ఈయూ నుంచి నిష్ర్కమణతో బ్రిటన్ స్వేచ్ఛా మార్కెట్‌గా మారుతుంది. దీంతో కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ప్రపంచ దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదంతా కామెరాన్ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు తీసుకునే వ్యక్తికి కత్తిమీద సామే. ఇదే తొలిసారి: వాస్తవానికి ఈయూ నుంచి ఒక సభ్య దేశం వైదొలగాలంటే 2009 లిస్బాన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50 ప్రకారమే సాధ్యమవుతుంది. ఈ ఆర్టికల్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీని ప్రకారం ఈయూతో తెగదెంపులు చేసుకునేందుకు రెండేళ్లలో సంప్రదింపుల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం బ్రిటన్ విడిపోయే ప్రక్రియను పూర్తి చేసేందుకు 2020 వరకు సమయం పడుతుందని అంచనా. 1982లో ఈయూ నుంచి గ్రీన్లాండ్ విడిపోయింది. కానీ అప్పటికీ ఈ ఒప్పందం అమల్లో లేదు. కాగా బ్రెగ్జిట్ గురించి చర్చించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, ఇటలీ, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులు శనివారం సమావేశం కానున్నారు. బ్రిటన్ బాటలో పయనించేందుకు పలు దేశాలు ఆలోచిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. 27 సభ్యదేశాలు తమ పార్లమెంటులలో తీర్మానం చేసి బ్రిటన్ నిష్ర్కమణకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.