Coronation celebrations
-
ఛత్రపతి శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
ముంబై: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన నిరంతరం తపించారని చెప్పారు. శివాజీ విధానాలు, పాలనా వ్యవస్థ ఈనాటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. మరాఠా రాజుగా ఛత్రపతి పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోటపై రాష్ట్రస్థాయి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం పంపించారు. శివాజీ దార్శనికత, అరుదైన వ్యక్తిత్వం చరిత్రలోని ఇతర రాజుల కంటే భిన్నమని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ నినాదమైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ శివాజీ మహారాజ్ ఆలోచనలు, ఆశయాలకు ప్రతిబింబమని వివరించారు. ఆయన వీరత్వం, భయానికి తావులేని కార్యాచరణ, వ్యూహాత్మక నైపుణ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో 22న మోదీ ప్రసంగం వాషింగ్టన్: భారత ప్రధాని మోదీ జూన్ 21నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో అధికారికంగా పర్యటించనున్నారు. 22న అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించనున్నారు. భవిష్యత్ భారతం, రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన ప్రసంగిస్తారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. 22న వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు. ఉభయసభలైన ప్రతినిధుల సభ, సెనేట్నుద్దేశించి మోదీ మొదటిసారిగా 2016లో ప్రసంగించారు. -
అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం
లండన్: రవి అస్తమించినా అలనాటి రాజ వైభవానికి, అట్టహాసాలకు, ఆడంబరానికి మాత్రం ఏ లోటు లేని రీతిలో బ్రిటన్ రాజ సింహాసనంపై చార్లెస్ 3 కొలువుదీరారు. వెయ్యేళ్లకు పైగా కొనసాగుతున్న సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం బ్రిటన్ 40వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. పలువురు దేశాధినేతలు, ముఖ్య నేతలు తదితరుల సమక్షంలో లాంఛనంగా కిరీటధారణ చేశారు. దాంతో బ్రిటన్‌కు లాంఛనప్రాయ అధినేతగా చార్లెస్ అధికారికంగా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టినట్టయింది. లండన్ వీధుల గుండా భార్యాసమేతంగా బంగారు రథంలో ఊరేగుతూ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పట్టాభిషేకానంతరం దారి పొడవునా ప్రజలు, అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ బకింగ్‌హాం రాజప్రాసాదానికి చేరుకున్నారు. అనంతరం చారిత్రక బాల్కనీ నుంచి రాజ దంపతులు మరోసారి అందరికీ అభివాదం చేయడంతో కార్యక్రమం ముగిసింది. అత్యంత లేటు వయసులో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించిన రికార్డును కూడా 74 ఏళ్ల చార్లెస్ సొంతం చేసుకున్నారు! ఆయనతో పాటు భార్య కెమిల్లా (75)కు కూడా రాణిగా పట్టాభిషేకం జరిగింది. 2022 సెప్టెంబర్‌లో తన తల్లి, బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణానంతరం బ్రిటన్ రాజుగా చార్లెస్ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. 70 ఏళ్ల తర్వాత... అప్పుడెప్పుడో 70 ఏళ్ల కిందట, అంటే 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్–2కు పట్టాభిషేకం జరిగింది. తర్వాత మళ్లీ ఇంతకాలానికి జరిగిన పట్టాభిషేక క్రతువు అందరినీ ఎంతగానో ఆకర్షించింది. అప్పట్లాగే శనివారం కూడా కార్యక్రమం ఆసాంతం వాన పడటం విశేషం. దేశ విదేశాల్లో లక్షలాది మంది కార్యక్రమాన్ని అత్యంత ఆసక్తిగా వీక్షించారు. మరోవైపు ఈ ప్రజాస్వామిక యుగంలోనూ ఇంకా ఈ కాలం చెల్లిన రాచరికపు పోకడలు ఏమిటంటూ జోరుగా విమర్శలు కూడా వచ్చాయి. వందలాది నిరసనకారులు రాజ దంపతుల ఊరేగింపు మార్గంలో బారులు తీరి నినాదాలకు దిగారు. ముందుజాగ్రత్తగా వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. సునాక్ బైబిల్ పఠనం ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ సమక్షంలో మొదలైన కార్యక్రమం రాజుగా చార్లెస్‌ను గుర్తించడం, ప్రమాణం, ప్రకటన, కిరీటధారణ, పట్టాభిషేకం... ఇలా ఐదు దశల్లో 2 గంటలపాటు సాగింది. ముందుగా చార్లెస్‌ను సభికులందరికీ ఆర్చిబిషప్ పరిచయం చేశారు. చార్లెస్ అందరికీ కన్పించేలా నాలుగు దిక్కులకూ తిరిగారు. తర్వాత చట్టాన్ని కాపాడుతూ న్యాయంగా, దయతో పాలిస్తానని, ఇంగ్లండ్ చర్చికి విధేయుడైన క్రైస్తవునిగా ఉంటానని చార్లెస్ రెండు ప్రమాణాలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం కెమిల్లాకు చార్లెస్ ఉంగరం తొడిగారు. తద్వారా రాజ దంపతులు లాంఛనంగా మళ్లీ పెళ్లాడారు. అనంతరం బ్రిటన్ తొలి హిందూ ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వ సారథి హోదాలో బైబిల్ పంక్తులు చదివి వినిపించారు! హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, యూదుమత ప్రతినిధులను కూడా తొలిసారిగా కార్యక్రమానికి ఆహ్వానించారు. హిందూ ప్రతినిధి రాజ చిహ్నాన్ని చార్లెస్‌కు అందజేశారు. అనంతరం బంగారు అంగవస్త్రం ధరించి దాదాపు 800 ఏళ్ల నాటి సింహాసనాన్ని అధిష్టించారు. దాని కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెప్పించిన పవిత్ర శిలనుంచారు. చార్లెస్‌పై తెరచాటుగా చాతి, చేతులు, ముఖంపై జెరూసలేం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పవిత్ర తైలం చిలకరించారు. చార్లెస్‌కు తెరచాటు కోసం ఉపయోగించిన వస్త్రంపై 56 కామన్వెల్త్ దేశాలకు ప్రతీకగా 56 ఆకులతో కూడిన చెట్టును చిత్రించారు. తర్వాత శిలువతో కూడిన గోళాకారపు బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్ అందుకున్నారు. వేలికి రాజముద్ర తొడిగాక చివరగా అతి ప్రధాన ఘట్టంలో 360 ఏళ్ల నాటి సెయింట్ ఎడ్వర్డ్ స్వర్ణ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. దీన్ని ఆయన మరింకెప్పుడూ ధరించబోరు. ఆ వెంటనే గాడ్ సేవ్ ద కింగ్ గీతాలాపనతో, గంటల మోతతో వెస్ట్ మినిస్టర్ అబే మారుమోగింది. అనంతరం చార్లెస్ రాజఖడ్గం చేబూని 1937లో క్వీన్ ఎలిజబెత్ దంపతులు పట్టాభిషేకానికి వాడిన సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆర్చిబిషప్‌తో పాటు చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం మోకాళ్లపై కూర్చుని ఆయన కుడిచేతిని ముద్దాడారు. తర్వాత నిరాడంబరంగా కెమిల్లాకు రాణి కిరీటధారణ జరిగింది. ఆహూతుల కళ్లెదుట రాణిపై పవిత్ర తైలం చిలకరించారు. తర్వాత 1911లో క్వీన్ మేరీ ధరించిన 2,200 వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ఆమె ధరించారు. కోహినూర్ సహా మూడు పెద్ద వజ్రాలతో ఈ కిరీటం మెరిసిపోయేది. వివాదాలకు తావు లేకుండా ఇటీవల కోహినూర్‌ను కిరీటం నుంచి తొలగించారు. అనంతరం ఎడ్వర్డ్ కిరీటాన్ని తీసేసి అధికారిక రాజ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. రాణితో కలిసి దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ బంగారు రథంలో బకింగ్‌హాం ప్యాలెస్‌కు తిరిగి వెళ్లారు. ప్యాలెస్ బాల్కనీ నుంచి పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి చార్లెస్ దంపతులు ప్రజలకు దర్శనమివ్వడంతో పట్టాభిషేక కార్యక్రమానికి తెరపడింది. చివరగా రాయల్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు విన్యాసాలతో అలరించాయి. వర్షం కారణంగా చాలా కార్యక్రమాలను కుదించి త్వరగా ముగించారు. బంగారు ఆకుల డిజైన్లలో బైబిల్ చార్లెస్ ప్రమాణస్వీకారం కోసం వాడిన బైబిల్‌ను ఆక్స్ఫర్డ్ ప్రెస్‌లో ప్రత్యేకంగా తయారు చే యించారు. బంగారు ఆకులు తదితర డిజైన్లతో తీర్చిదిద్దారు. అందులో దాదాపు 350 అచ్చు తప్పులను సరిచేసి మరీ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు. అచ్చం 1611 నాటి కింగ్ జేమ్స్ బైబిల్లా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజు వెడలె... లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ అబేలో శనివారం చార్లెస్ 3 పట్టాభిషేక కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. 1066లో విలియం ద కాంకరర్కి ఇక్కడే పట్టాభిషేకం జరిగింది. నాటి నుంచీ ఈ కార్యక్రమం ఇక్కడే జరుగుతోంది. చార్లెస్, కెమిల్లా దంపతులు ఉదయం 11 గంటలకు బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి ప్రత్యేక బంగారు రథంలో ఊరేగింపుగా వెస్ట్ మినిస్టర్స్ అబేకు తరలి వెళ్లారు. ఈ రథాన్ని 1831 నుంచి ప్రతి పట్టాభిషేక వేడుకకూ ప్రత్యేకంగా వాడుతున్నారు. సైనిక సిబ్బంది గుర్రాలపై, కాలి నడకన రథాన్ని అనుసరించారు. వేలాదిగా ప్రజలు సెంట్రల్ లండన్ వీధుల నిండా బారులు తీరి రాజ దంపతులకు చేతులూపుతూ కన్పించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 2,200 మంది పై చిలుకు ఆహూతులు అబే వద్ద రాజ దంపతులకు స్వాగతం పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ దంపతులు పాల్గొన్నారు. వారు కామన్వెల్త్ దేశాధినేతల వరుసలో కూర్చున్నారు. దూరదూరంగా హారీ రాచరికాన్ని వదులుకుని రాజ కుటుంబానికి దూరమైన చార్లెస్ రెండో కుమారుడు హారీ పట్టాభిషేక కార్యక్రమంలో అంటీ ముట్టనట్టుగా పాల్గొన్నారు. 10 వరుసల ఆవల మౌనంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయన భార్య మెగన్ మార్కెల్, ఇద్దరు పిల్లలు కార్యక్రమానికి రాకుండా అమెరికాలోనే ఉండిపోయారు. శనివారమే నాలుగో పుట్టినరోజు జరు పుకున్న కుమారుడు ఆర్చీ కోసం కార్యక్రమం ముగియగానే హారీ అమెరికా పయనమయ్యా రు. రాజ దంపతులు, అన్న విలియం తనను ఎన్నడూ సరిగా చూడలేదంటూ ఇటీవలి ఆత్మకథలో ఆయన తూర్పారబట్టడం తెలిసిందే. చార్లెస్ తమ్ముడు కూడా... రాచరిక హోదాను కోల్పోయిన చార్లెస్ తమ్ముడు ఆండ్రూ కూడా దూరంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించడానికే పరిమితమయ్యారు. లైంగిక వేధింపుల కేసు తదితరాల్లో చిక్కడంతో ఆండ్రూ రాచరికపు హోదాలను తల్లి ఎలిజబెత్ తొలగించారు. 𝐓𝐡𝐞 𝐂𝐫𝐨𝐰𝐧𝐢𝐧𝐠 𝐨𝐟 𝐓𝐡𝐞 𝐊𝐢𝐧𝐠 The Archbishop of Canterbury places St Edward’s Crown on The King’s anointed head. The clergy, congregation and choir all cry ‘God Save The King’.#Coronation pic.twitter.com/kGrV3W0bky — The Royal Family (@RoyalFamily) May 6, 2023 look at camilla she can’t believe what her and charles have gotten away with and that smirk says it all #Coronation pic.twitter.com/gtQ9rIGiEj — ᴀᴅᴇʏᴇᴍɪ 🚩 (@LE4NDROAI) May 6, 2023 చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ -
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
చార్లెస్–3 పట్టాభిషేకంలో... విశేషాలెన్నో!
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్–3కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆయనకు 74 ఏళ్లు. ఇప్పటిదాకా బ్రిటన్ ఏలికలుగా పట్టాభిషేకం చేసుకున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు చార్లెసే! ఆయన వయసు మొదలుకుని కార్యక్రమపు ఖర్చు, అన్ని మతాల పెద్దలను భాగస్వాములను చేయడం దాకా ఎన్నో విశేషాలకు పట్టాభిషేక కార్యక్రమం వేదిక కానుంది... ► చారిత్రక వెస్ట్ మినిస్టర్స్ అబేలో పట్టాభిషేకం జరుగుతుంది. గత వెయ్యేళ్లుగా ఈ వేడుక ఇక్కడే జరుగుతూ వస్తోంది. ► ఉదయం 11కు కార్యక్రమం మొదలవుతుంది. ► చార్లెస్–3 సతీసమేతంగా బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి చారిత్రక డైమండ్ జూబ్లీ రథంలో అట్టహాసంగా బయల్దేరతారు. రాణి ఎలిజబెత్–2 పాలనకు 60 ఏళ్లయిన సందర్భంగా 2012లో ఈ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఐదు దశల్లో... ► కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది. తొలుత ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ ముందుగా రాజును ప్రజలకు పరిచయం చేస్తారు. అనంతరం ‘గాడ్ సేవ్ కింగ్ చార్లెస్’ అంటూ ఆహూతుల ద్వారా గీతాలాపన జరుగుతుంది. ► మత గ్రంథంపై చార్లెస్ ప్రమాణం చేస్తారు. అనంతరం ఆయనను రాజుగా ప్రకటిస్తారు. ► తర్వాత కింగ్ ఎడ్వర్డ్ కుర్చీపై చార్లెస్ ఆసీనులవుతారు. పట్టాభిషేకానికి ఉపయోగించే ఈ కుర్చీ ఏకంగా 700 ఏళ్ల నాటిది. కింగ్ ఎడ్వర్డ్ నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు దీనిపై కూర్చునే పట్టం కట్టుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ కుర్చీని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు. ► తర్వాత అనూచానంగా వస్తున్న రాజ లాంఛనాలను ఒక్కొక్కటిగా చార్లెస్ అందుకుంటారు. ► వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు ఆయనకు అందజేయనుండటం విశేషం. హిందూ మతం తరఫున లార్డ్ నరేంద్ర బాహుబలి పటేల్ (84) చార్లెస్‌కు రాజముద్రిక అందజేస్తారు. ► తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్రపు ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్‌కు కిరీట ధారణ జరుగుతుంది. కిరీటం పరిమాణాన్ని చార్లెస్‌కు సరిపోయేలా ఇప్పటికే సరిచేశారు. ► ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటి పేర్లుంటాయని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. ► తర్వాత యువరాజు విలియం రాజు ముందు మోకరిల్లుతారు. విధేయత ప్రకటిస్తూ ఆయన ముంజేతిని ముద్దాడతారు. ► తర్వాత సాదాసీదా కార్యక్రమంలో చార్లెస్ భార్య కెమిల్లాను రాణిగా ప్రకటించే తంతు ముగుస్తుంది. ► భారత మూలాలున్న హిందువు అయిన ప్రధాని రిషి సునాక్ ఈ సందర్భంగా పవిత్ర బైబిల్ పంక్తులు పఠించనుండటం విశేషం! ► చివరగా హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దల నుంచి చార్లెస్ శుభాకాంక్షలు అందుకుంటారు. రూ.1,000 కోట్ల ఖర్చు ► పట్టాభిషేక మహోత్సవానికి దాదాపు రూ.1,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఖర్చంతటినీ బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. దేశం మాంద్యం కోరల్లో చిక్కి అల్లాడుతున్న వేళ ఎందుకీ ఆడంబరమంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార హక్కులు తదితరాల ద్వారా అంతకంటే ఎక్కువే తిరిగొస్తుందని సమాచారం. ఈ కార్యక్రమం దేశ పర్యాటకానికి ఎంతో ఊపునిస్తుందని సర్కారు ఆశ పడుతోంది! ► బ్రిటన్ పౌరుల్లో ఏకంగా 52 శాతం మంది ఈ రాచరికపు సంప్రదాయం కొనసాగింపును వ్యతిరేకించినట్టు ఇటీవలి సర్వేలో తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనంగా రామయ్య పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం: భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మిథిలా స్టేడియం లోని కల్యాణ మండపంలో సీతమ్మవారితో సింహాసనంపై ఆసీనులైన రామయ్యను చూసి భక్తులు తరించారు. ఈ వేడుకకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆ మె రామాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టాభిషేకం పూర్తయ్యాక భద్రాచలంలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన గర్భిణుల సీమంతం కార్యక్రమంలో తమిళిసై పాల్గొన్నారు. నేడు కొండరెడ్లతో ముఖాముఖి సోమవారం సాయంత్రం దమ్మపేట మండలం నా చారం గ్రామంలో గుట్టపై ఉన్న స్వయంభూ శ్రీ జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామి ఆలయా న్ని దర్శించుకున్న తమిళిసై... మంగళవారం దమ్మ పేట మండలం పూసుకుంట, అశ్వారావుపేట మం డలం గోగులపూడి, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వెనుకబడిన వందకుపైగా కొండరెడ్ల కుటుంబాల తో పూసుకుంటలో ముఖాముఖి నిర్వహించనున్నారు. 10 నెలల క్రితమే గవర్నర్ ఈ 3 గ్రామాలను దత్తత తీసుకొని గిరి వికాస్, గిరి పోషణ్ పథకాలతో వారికి పౌష్టికాహారం అందించడంతోపాటు కోళ్లు పంపిణీ చేస్తున్నారు. సోమవారం ఉదయం స్థానిక బీజేపీ నాయకులు గవర్నర్‌ను కలి సేందుకు సింగరేణి గెస్ట్‌హౌస్‌కు రాగా బిజీ షెడ్యూల్ ఉందం టూ తమిళిసై సున్నితంగా తిరస్కరించారు. -
చేతులెత్తేశారు..
సాక్షి, అనంతపురం : పెనుకొండలో బుధ, గురువారాల్లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలకు జనం నుంచి విశేష స్పందన లభించినా, ఏర్పాట్లు చేయడంలో పాలకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. కింద నుంచి కోట పైకి ఆర్టీసీ బస్సులు రెండు ఏర్పాటు చేస్తామని ఉత్సవాలకు ముందు ప్రకటించిన అధికారులు.. చివరకు చేతులెత్తేశారు. దీంతో జనం ఎనిమిది కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి వచ్చింది. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు ఉత్సాహంగా వచ్చిన విద్యార్థులు సైతం వేషధారణలతోనే కోటపైకి కాలినడకన చేరుకోవాల్సి వచ్చింది. తీరా పైకి చేరుకునే సరికి చాలా మంది పిల్లలు అలసిపోయారు. కృష్ణదేవరాయల వేషధారణలో కోటపైకి కాలినడకన వచ్చిన కొత్తచెరువు జిల్లాపరిషత్ హైస్కూలు విద్యార్థి మీసం ఊడిపోయి ఎక్కడో పడిపోవడంతో వేదికపై రాయల పాత్ర వేయలేకపోయాడు. జనానికి భోజన ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదు. కొంత మందికి పులిహోర ప్యాకెట్లు విసిరారు. మరికొందరికి ఉడికీ ఉడకని అన్నం పెట్టారు. తాగునీటి సౌకర్యం తగినంత లేక ప్రజలు తల్లడిల్లిపోయారు. దీనికితోడు వర్షం కురవడంతో వేదికల వద్ద కాసేపు కూర్చునే విధంగా షామియానాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. వర్షం వచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుత్సాహపరిచిన మంత్రులు రాయల ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు హాజరవుతున్నట్లు తెలియడంతో జనం కూడా ఉత్సాహంగా వచ్చారు. రాయలేలిన పెనుకొండ కోట ఇటీవల కాలంలో రూపాంతరం కోల్పోతుండడంతో దాని పునరుద్ధరణకు, రాయల కీర్తి గురించి భావితరాలకు తెలియజేసేందుకు మంత్రులు ఎలాంటి చర్యలు ప్రకటిస్తారోనని ఉత్కంఠతో ఎదురు చూశారు. అయితే.. తొలిరోజు పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ట రాయల కీర్తిని పక్కనబెట్టి, తమ ప్రభుత్వ కీర్తినే చెప్పుకుని జనానికి బోర్ కొట్టించారు. రెండో రోజైన గురువారం కోటపై ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత హాజరవుతారని ప్రచారం సాగడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. తీరా అక్కడ మంత్రి పరిటాల సునీత తప్ప మిగతా వారు కనిపించలేదు. ఆమె సైతం తనకు అత్యవసర పని ఉండడంతో ఉత్సవాల్లో చివరి వరకు ఉండలేకపోతున్నానని చెప్పి.. నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు. ఈ ఘనత వీరిదా? టీడీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే ఉత్సవాల విజయవంతం తమ ఘనతేనని చెప్పుకోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం జరిగిన రాయల ఉత్సవాలకు గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచే రూ.32 లక్షలు విడుదల చేశారు. రెండోరోజు కోటపై జరిగిన ఉత్సవాల సందర్భంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ కోట అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.25 కోట్ల నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. తొలి రోజు ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోట అభివృద్ధికి ఏమేరకు నిధులు కేటాయిస్తారో చెప్పలేదు కానీ..సెప్టెంబర్‌లో నిర్వహించే లేపాక్షి ఉత్సవాలకు మాత్రం రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అధికారులపై కళాకారుల ఆగ్రహం సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి తయారు చేసిన షెడ్యూల్ గందరగోళంగా ఉంది. దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన కళాకారులు తమ కళాప్రదర్శనలు పూర్తి స్థాయిలో ప్రదర్శించే వీలు లేకుండా పోయింది. దీంతో వారుఅధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో.. ఉత్సవాలను విజయవంతం చేశారని పలువురు ఆధికారులకు మెమొంటోలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
జయహో.. దేవరాయ
- పండగను తలపించిన రాయల పట్టాభిషేక మహోత్సవాలు - రూ.2 కోట్లతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ - పర్యాటక కేంద్రాలుగా పెనుకొండ, గుత్తి కోట - గుప్త నిధుల కేటుగాళ్లపై నిఘా - ముగింపు ఉత్సవాల్లో మంత్రి పరిటాల సునీత సాక్షి, అనంతపురం : శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలు పండగను తలపించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. పెనుకొండలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉత్సవా లు గురువారం ముగిశాయి. పెనుకొండ కోటపై ఎమ్మె ల్యే బీకే పార్థసారథి అధ్యక్షతన గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో, అనంతరం విలేకరుల సమావేశంలో మం త్రి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో రాయల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్విహ స్తామన్నారు. ముందుగా కొండపైకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. కోటలో శిథిలావస్థకు చేరుకున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రూ.2 కోట్లతో పునరుద్ధరిస్తామని, ఇస్కాన్ ఆధ్వర్యంలో కోటపై శ్రీకృష్ణుడి ఆల యం నిర్మిస్తామని ప్రకటించారు. రాయల కీర్తి, చారిత్రక నిర్మాణాల గురించి తెలియజేసేందుకు వీలుగా కోటపై మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. కోట సంపద పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. రాయల కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పేందుకు, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించే వారిపై నిఘా పెంచుతామన్నారు. అనంతరం రాయల ఉత్సవాల్లో ప్రదర్శనలు నిర్వహించిన కళాకారులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అంతకు ముందు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని మంత్రి సునీత ప్రారంభించారు. కోట పునఃనిర్మాణానికి చర్యలు హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ పెనుకొండ కోటను పునఃనిర్మిస్తామన్నారు. కోటపై విద్యుత్ దీపాలు, రోడ్లు, తాగునీటి వసతి కల్పించేందుకు రూ.25 కోట్లు మంజూరు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. రాయలేలిన సీమలో ఫ్యాక్షన్ సంస్కృతిని చెరిపి వేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో రాయల కీర్తి గురించి తప్ప ఫ్యాక్షన్ మాట వినపడడానికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. పోటెత్తిన కోట రాయల ఉత్సవాల సందర్భంగా పెనుకొండ కోట జనంతో పోటెత్తింది. కోటపై ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు చివరకు చేతులెత్తేసినా.. ప్రజలు, విద్యార్థులు మాత్రం తెలుగు జాతి ఔన్నత్వాన్ని చాటిచెప్పేందుకు, రాయలపై ఉన్న అపార గౌరవంతో ఎనిమిది కిలోమీటర్ల మేర కాలినడకన కోటకు చేరుకున్నారు. కోట నలువైపులా కలియ దిరిగారు. చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంపై ఆవేదన చెందారు.