లండన్: రవి అస్తమించినా అలనాటి రాజ వైభవానికి, అట్టహాసాలకు, ఆడంబరానికి మాత్రం ఏ లోటు లేని రీతిలో బ్రిటన్ రాజ సింహాసనంపై చార్లెస్ 3 కొలువుదీరారు. వెయ్యేళ్లకు పైగా కొనసాగుతున్న సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం బ్రిటన్ 40వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. పలువురు దేశాధినేతలు, ముఖ్య నేతలు తదితరుల సమక్షంలో లాంఛనంగా కిరీటధారణ చేశారు. దాంతో బ్రిటన్‌కు లాంఛనప్రాయ అధినేతగా చార్లెస్ అధికారికంగా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టినట్టయింది.
లండన్ వీధుల గుండా భార్యాసమేతంగా బంగారు రథంలో ఊరేగుతూ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పట్టాభిషేకానంతరం దారి పొడవునా ప్రజలు, అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ బకింగ్‌హాం రాజప్రాసాదానికి చేరుకున్నారు. అనంతరం చారిత్రక బాల్కనీ నుంచి రాజ దంపతులు మరోసారి అందరికీ అభివాదం చేయడంతో కార్యక్రమం ముగిసింది. అత్యంత లేటు వయసులో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించిన రికార్డును కూడా 74 ఏళ్ల చార్లెస్ సొంతం చేసుకున్నారు! ఆయనతో పాటు భార్య కెమిల్లా (75)కు కూడా రాణిగా పట్టాభిషేకం జరిగింది. 2022 సెప్టెంబర్‌లో తన తల్లి, బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణానంతరం బ్రిటన్ రాజుగా చార్లెస్ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే.
70 ఏళ్ల తర్వాత...
అప్పుడెప్పుడో 70 ఏళ్ల కిందట, అంటే 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్–2కు పట్టాభిషేకం జరిగింది. తర్వాత మళ్లీ ఇంతకాలానికి జరిగిన పట్టాభిషేక క్రతువు అందరినీ ఎంతగానో ఆకర్షించింది. అప్పట్లాగే శనివారం కూడా కార్యక్రమం ఆసాంతం వాన పడటం విశేషం. దేశ విదేశాల్లో లక్షలాది మంది కార్యక్రమాన్ని అత్యంత ఆసక్తిగా వీక్షించారు. మరోవైపు ఈ ప్రజాస్వామిక యుగంలోనూ ఇంకా ఈ కాలం చెల్లిన రాచరికపు పోకడలు ఏమిటంటూ జోరుగా విమర్శలు కూడా వచ్చాయి. వందలాది నిరసనకారులు రాజ దంపతుల ఊరేగింపు మార్గంలో బారులు తీరి నినాదాలకు దిగారు. ముందుజాగ్రత్తగా వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
సునాక్ బైబిల్ పఠనం
ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్‌బరీ సమక్షంలో మొదలైన కార్యక్రమం రాజుగా చార్లెస్‌ను గుర్తించడం, ప్రమాణం, ప్రకటన, కిరీటధారణ, పట్టాభిషేకం... ఇలా ఐదు దశల్లో 2 గంటలపాటు సాగింది.
ముందుగా చార్లెస్‌ను సభికులందరికీ ఆర్చిబిషప్ పరిచయం చేశారు. చార్లెస్ అందరికీ కన్పించేలా నాలుగు దిక్కులకూ తిరిగారు.
తర్వాత చట్టాన్ని కాపాడుతూ న్యాయంగా, దయతో పాలిస్తానని, ఇంగ్లండ్ చర్చికి విధేయుడైన క్రైస్తవునిగా ఉంటానని చార్లెస్ రెండు ప్రమాణాలు చేశారు.
ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం కెమిల్లాకు చార్లెస్ ఉంగరం తొడిగారు. తద్వారా రాజ దంపతులు లాంఛనంగా మళ్లీ పెళ్లాడారు.
అనంతరం బ్రిటన్ తొలి హిందూ ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వ సారథి హోదాలో బైబిల్ పంక్తులు చదివి వినిపించారు!
హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, యూదుమత ప్రతినిధులను కూడా తొలిసారిగా కార్యక్రమానికి ఆహ్వానించారు. హిందూ ప్రతినిధి రాజ చిహ్నాన్ని చార్లెస్‌కు అందజేశారు.
అనంతరం బంగారు అంగవస్త్రం ధరించి దాదాపు 800 ఏళ్ల నాటి సింహాసనాన్ని అధిష్టించారు. దాని కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెప్పించిన పవిత్ర శిలనుంచారు.
చార్లెస్‌పై తెరచాటుగా చాతి, చేతులు, ముఖంపై జెరూసలేం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పవిత్ర తైలం చిలకరించారు.
చార్లెస్‌కు తెరచాటు కోసం ఉపయోగించిన వస్త్రంపై 56 కామన్వెల్త్ దేశాలకు ప్రతీకగా 56 ఆకులతో కూడిన చెట్టును చిత్రించారు.
తర్వాత శిలువతో కూడిన గోళాకారపు బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్ అందుకున్నారు.
వేలికి రాజముద్ర తొడిగాక చివరగా అతి ప్రధాన ఘట్టంలో 360 ఏళ్ల నాటి సెయింట్ ఎడ్వర్డ్ స్వర్ణ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. దీన్ని ఆయన మరింకెప్పుడూ ధరించబోరు.
ఆ వెంటనే గాడ్ సేవ్ ద కింగ్ గీతాలాపనతో, గంటల మోతతో వెస్ట్ మినిస్టర్ అబే మారుమోగింది.
అనంతరం చార్లెస్ రాజఖడ్గం చేబూని 1937లో క్వీన్ ఎలిజబెత్ దంపతులు పట్టాభిషేకానికి వాడిన సింహాసనంపై ఆసీనులయ్యారు.
ఆర్చిబిషప్‌తో పాటు చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం మోకాళ్లపై కూర్చుని ఆయన కుడిచేతిని ముద్దాడారు.
తర్వాత నిరాడంబరంగా కెమిల్లాకు రాణి కిరీటధారణ జరిగింది. ఆహూతుల కళ్లెదుట రాణిపై పవిత్ర తైలం చిలకరించారు. తర్వాత 1911లో క్వీన్ మేరీ ధరించిన 2,200 వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ఆమె ధరించారు. కోహినూర్ సహా మూడు పెద్ద వజ్రాలతో ఈ కిరీటం మెరిసిపోయేది. వివాదాలకు తావు లేకుండా ఇటీవల కోహినూర్‌ను కిరీటం నుంచి తొలగించారు.
అనంతరం ఎడ్వర్డ్ కిరీటాన్ని తీసేసి అధికారిక రాజ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. రాణితో కలిసి దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ బంగారు రథంలో బకింగ్‌హాం ప్యాలెస్‌కు తిరిగి వెళ్లారు.
ప్యాలెస్ బాల్కనీ నుంచి పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి చార్లెస్ దంపతులు ప్రజలకు దర్శనమివ్వడంతో పట్టాభిషేక కార్యక్రమానికి తెరపడింది.
చివరగా రాయల్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు విన్యాసాలతో అలరించాయి.
వర్షం కారణంగా చాలా కార్యక్రమాలను కుదించి త్వరగా ముగించారు.
బంగారు ఆకుల డిజైన్లలో బైబిల్
చార్లెస్ ప్రమాణస్వీకారం కోసం వాడిన బైబిల్‌ను ఆక్స్‌ఫర్డ్ ప్రెస్‌లో ప్రత్యేకంగా తయారు చే యించారు. బంగారు ఆకులు తదితర డిజైన్లతో తీర్చిదిద్దారు. అందులో దాదాపు 350 అచ్చు తప్పులను సరిచేసి మరీ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు. అచ్చం 1611 నాటి కింగ్ జేమ్స్ బైబిల్‌లా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
రాజు వెడలె...
లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ అబేలో శనివారం చార్లెస్ 3 పట్టాభిషేక కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. 1066లో విలియం ద కాంకరర్‌కి ఇక్కడే పట్టాభిషేకం జరిగింది. నాటి నుంచీ ఈ కార్యక్రమం ఇక్కడే జరుగుతోంది.
చార్లెస్, కెమిల్లా దంపతులు ఉదయం 11 గంటలకు బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి ప్రత్యేక బంగారు రథంలో ఊరేగింపుగా వెస్ట్ మినిస్టర్స్ అబేకు తరలి వెళ్లారు. ఈ రథాన్ని 1831 నుంచి ప్రతి పట్టాభిషేక వేడుకకూ ప్రత్యేకంగా వాడుతున్నారు.
సైనిక సిబ్బంది గుర్రాలపై, కాలి నడకన రథాన్ని అనుసరించారు.
వేలాదిగా ప్రజలు సెంట్రల్ లండన్ వీధుల నిండా బారులు తీరి రాజ దంపతులకు చేతులూపుతూ కన్పించారు.
దేశ విదేశాల నుంచి వచ్చిన 2,200 మంది పై చిలుకు ఆహూతులు అబే వద్ద రాజ
దంపతులకు స్వాగతం పలికారు.
భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్ ఖడ్ దంపతులు పాల్గొన్నారు. వారు కామన్వెల్త్ దేశాధినేతల వరుసలో కూర్చున్నారు.
దూరదూరంగా హారీ
రాచరికాన్ని వదులుకుని రాజ కుటుంబానికి దూరమైన చార్లెస్ రెండో కుమారుడు హారీ పట్టాభిషేక కార్యక్రమంలో అంటీ ముట్టనట్టుగా పాల్గొన్నారు. 10 వరుసల ఆవల మౌనంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయన భార్య మెగన్ మార్కెల్, ఇద్దరు పిల్లలు కార్యక్రమానికి రాకుండా అమెరికాలోనే ఉండిపోయారు. శనివారమే నాలుగో పుట్టినరోజు జరు పుకున్న కుమారుడు ఆర్చీ కోసం కార్యక్రమం ముగియగానే హారీ అమెరికా పయనమయ్యా రు. రాజ దంపతులు, అన్న విలియం తనను ఎన్నడూ సరిగా చూడలేదంటూ ఇటీవలి ఆత్మకథలో ఆయన తూర్పారబట్టడం తెలిసిందే.
చార్లెస్ తమ్ముడు కూడా...
రాచరిక హోదాను కోల్పోయిన చార్లెస్ తమ్ముడు ఆండ్రూ కూడా దూరంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించడానికే పరిమితమయ్యారు. లైంగిక వేధింపుల కేసు తదితరాల్లో చిక్కడంతో ఆండ్రూ రాచరికపు హోదాలను తల్లి ఎలిజబెత్ తొలగించారు.
𝐓𝐡𝐞 𝐂𝐫𝐨𝐰𝐧𝐢𝐧𝐠 𝐨𝐟 𝐓𝐡𝐞 𝐊𝐢𝐧𝐠
— The Royal Family (@RoyalFamily) May 6, 2023
The Archbishop of Canterbury places St Edward’s Crown on The King’s anointed head. The clergy, congregation and choir all cry ‘God Save The King’.#Coronation pic.twitter.com/kGrV3W0bky
look at camilla she can’t believe what her and charles have gotten away with and that smirk says it all #Coronation pic.twitter.com/gtQ9rIGiEj
— ᴀᴅᴇʏᴇᴍɪ 🚩 (@LE4NDROAI) May 6, 2023
Comments
Please login to add a commentAdd a comment