సాక్షి, అనంతపురం : పెనుకొండలో బుధ, గురువారాల్లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలకు జనం నుంచి విశేష స్పందన లభించినా, ఏర్పాట్లు చేయడంలో పాలకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. కింద నుంచి కోట పైకి ఆర్టీసీ బస్సులు రెండు ఏర్పాటు చేస్తామని ఉత్సవాలకు ముందు ప్రకటించిన అధికారులు.. చివరకు చేతులెత్తేశారు. దీంతో జనం ఎనిమిది కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి వచ్చింది. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు ఉత్సాహంగా వచ్చిన విద్యార్థులు సైతం వేషధారణలతోనే కోటపైకి కాలినడకన చేరుకోవాల్సి వచ్చింది.
తీరా పైకి చేరుకునే సరికి చాలా మంది పిల్లలు అలసిపోయారు. కృష్ణదేవరాయల వేషధారణలో కోటపైకి కాలినడకన వచ్చిన కొత్తచెరువు జిల్లాపరిషత్ హైస్కూలు విద్యార్థి మీసం ఊడిపోయి ఎక్కడో పడిపోవడంతో వేదికపై రాయల పాత్ర వేయలేకపోయాడు. జనానికి భోజన ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదు. కొంత మందికి పులిహోర ప్యాకెట్లు విసిరారు. మరికొందరికి ఉడికీ ఉడకని అన్నం పెట్టారు. తాగునీటి సౌకర్యం తగినంత లేక ప్రజలు తల్లడిల్లిపోయారు. దీనికితోడు వర్షం కురవడంతో వేదికల వద్ద కాసేపు కూర్చునే విధంగా షామియానాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. వర్షం వచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుత్సాహపరిచిన మంత్రులు
రాయల ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు హాజరవుతున్నట్లు తెలియడంతో జనం కూడా ఉత్సాహంగా వచ్చారు. రాయలేలిన పెనుకొండ కోట ఇటీవల కాలంలో రూపాంతరం కోల్పోతుండడంతో దాని పునరుద్ధరణకు, రాయల కీర్తి గురించి భావితరాలకు తెలియజేసేందుకు మంత్రులు ఎలాంటి చర్యలు ప్రకటిస్తారోనని ఉత్కంఠతో ఎదురు చూశారు. అయితే.. తొలిరోజు పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ట రాయల కీర్తిని పక్కనబెట్టి, తమ ప్రభుత్వ కీర్తినే చెప్పుకుని జనానికి బోర్ కొట్టించారు.
రెండో రోజైన గురువారం కోటపై ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత హాజరవుతారని ప్రచారం సాగడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. తీరా అక్కడ మంత్రి పరిటాల సునీత తప్ప మిగతా వారు కనిపించలేదు. ఆమె సైతం తనకు అత్యవసర పని ఉండడంతో ఉత్సవాల్లో చివరి వరకు ఉండలేకపోతున్నానని చెప్పి.. నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు.
ఈ ఘనత వీరిదా?
టీడీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే ఉత్సవాల విజయవంతం తమ ఘనతేనని చెప్పుకోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం జరిగిన రాయల ఉత్సవాలకు గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచే రూ.32 లక్షలు విడుదల చేశారు. రెండోరోజు కోటపై జరిగిన ఉత్సవాల సందర్భంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ కోట అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.25 కోట్ల నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. తొలి రోజు ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోట అభివృద్ధికి ఏమేరకు నిధులు కేటాయిస్తారో చెప్పలేదు కానీ..సెప్టెంబర్‌లో నిర్వహించే లేపాక్షి ఉత్సవాలకు మాత్రం రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
అధికారులపై కళాకారుల ఆగ్రహం
సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి తయారు చేసిన షెడ్యూల్ గందరగోళంగా ఉంది. దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన కళాకారులు తమ కళాప్రదర్శనలు పూర్తి స్థాయిలో ప్రదర్శించే వీలు లేకుండా పోయింది. దీంతో వారుఅధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో.. ఉత్సవాలను విజయవంతం చేశారని పలువురు ఆధికారులకు మెమొంటోలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
చేతులెత్తేశారు..
Published Fri, Aug 29 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement