జయహో.. దేవరాయ | Sri Krishna Devarayala celebrations | Sakshi
Sakshi News home page

జయహో.. దేవరాయ

Published Fri, Aug 29 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

Sri Krishna Devarayala celebrations

- పండగను తలపించిన రాయల పట్టాభిషేక మహోత్సవాలు
- రూ.2 కోట్లతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ
- పర్యాటక కేంద్రాలుగా పెనుకొండ, గుత్తి కోట
- గుప్త నిధుల కేటుగాళ్లపై నిఘా
- ముగింపు ఉత్సవాల్లో మంత్రి పరిటాల సునీత
సాక్షి, అనంతపురం : శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలు పండగను తలపించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. పెనుకొండలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉత్సవా లు గురువారం ముగిశాయి. పెనుకొండ కోటపై ఎమ్మె ల్యే బీకే పార్థసారథి అధ్యక్షతన గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో, అనంతరం విలేకరుల సమావేశంలో మం త్రి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో రాయల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.

వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్విహ స్తామన్నారు. ముందుగా కొండపైకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. కోటలో శిథిలావస్థకు చేరుకున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రూ.2 కోట్లతో పునరుద్ధరిస్తామని, ఇస్కాన్ ఆధ్వర్యంలో కోటపై శ్రీకృష్ణుడి ఆల యం నిర్మిస్తామని ప్రకటించారు. రాయల కీర్తి, చారిత్రక నిర్మాణాల గురించి తెలియజేసేందుకు వీలుగా కోటపై మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. కోట సంపద పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.

రాయల కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పేందుకు, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించే వారిపై నిఘా పెంచుతామన్నారు. అనంతరం రాయల ఉత్సవాల్లో ప్రదర్శనలు నిర్వహించిన కళాకారులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అంతకు ముందు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని మంత్రి సునీత ప్రారంభించారు.
 
కోట పునఃనిర్మాణానికి చర్యలు
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ పెనుకొండ కోటను పునఃనిర్మిస్తామన్నారు. కోటపై విద్యుత్ దీపాలు, రోడ్లు, తాగునీటి వసతి కల్పించేందుకు రూ.25 కోట్లు మంజూరు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. రాయలేలిన సీమలో ఫ్యాక్షన్ సంస్కృతిని చెరిపి వేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో రాయల కీర్తి గురించి తప్ప ఫ్యాక్షన్ మాట వినపడడానికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు.
 
పోటెత్తిన కోట
రాయల ఉత్సవాల సందర్భంగా పెనుకొండ కోట జనంతో పోటెత్తింది. కోటపై ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు చివరకు చేతులెత్తేసినా.. ప్రజలు, విద్యార్థులు మాత్రం తెలుగు జాతి ఔన్నత్వాన్ని చాటిచెప్పేందుకు, రాయలపై ఉన్న అపార  గౌరవంతో ఎనిమిది కిలోమీటర్ల మేర కాలినడకన కోటకు చేరుకున్నారు. కోట నలువైపులా కలియ దిరిగారు. చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంపై ఆవేదన చెందారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement