ఎలిజబెత్‌ అస్తమయంతో మారిన వారసుల జాబితా | Queen Elizabeth II son Charles III becomes king of Britain | Sakshi
Sakshi News home page

ఎలిజబెత్‌ అస్తమయంతో మారిన వారసుల జాబితా

Published Sat, Sep 10 2022 5:28 AM | Last Updated on Sat, Sep 10 2022 5:31 AM

Queen Elizabeth II son Charles III becomes king of Britain - Sakshi

ప్రిన్స్‌ చార్లెస్‌

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ సింహాసనమెక్కారు. కింగ్‌ చార్లెస్‌–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. రాణి మృతితో బ్రిటన్‌ సింహాసనానికి వారసుల జాబితాలో కూడా మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. చార్లెస్‌ పెద్ద కుమారుడు ప్రిన్స్‌ విలియం, ఆయన సంతానానికే వారసత్వంలో ఇక అగ్ర తాంబూలం దక్కనుంది. ఆ లెక్కన విలియం, తర్వాత ఆయన పిల్లలు జార్జ్, చార్లెటీ, లూయిస్‌ జాబితాలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉంటారు. తర్వాత ఐదో స్థానంలో మాత్రమే విలియం సోదరుడు హ్యారీ ఉంటారు! ఆ తర్వాత ఆయన పిల్లలిద్దరూ వస్తారు. రాణి బతికుండగా చార్లెస్, విలియం తర్వాత హ్యారీ మూడో స్థానంలో ఉండేవారు.

► బ్రిటన్లో రాజు/రాణి పెద్ద కుమారుడు మాత్రమే రాజయ్యే సంప్రదాయం ఇటీవలిదాకా కొనసాగింది. తొలి సంతానమైనా సరే అమ్మాయికి అవకాశం ఉండేది కాదు. గురువారం మరణించిన రాణి ఎలిజబెత్‌–2 కింగ్‌ జార్జి–6కు తొలి సంతానంగా జన్మించింది. ఆమెకు తమ్ములెవరూ లేకపోవడం వల్ల మాత్రమే రాణి కాగలిగింది. ఈ పురాతన సంప్రదాయాన్ని 2013లో సింహాసన వారసత్వ చట్టం ద్వారా మార్చారు. దాని ప్రకారం తొలిచూరు అమ్మాయైనా బ్రిటన్‌ సింహాసనం ఆమెకే దక్కుతుంది. దీని ప్రకారం ప్రిన్స్‌ విలియం కూతురు చార్లెట్‌ వారసత్వ జాబితాలో తన తమ్ముడు లూయీస్‌ కంటే ముందుంది.

► రోమన్‌ క్యాథలిక్కును పెళ్లాడే రాజ కుటుంబీకులు సింహాసనానికి అనర్హులన్న నిబంధనను కూడా 2013 చట్టం ద్వారా తొలగించారు. అయితే రాజు/రాణి కావాలనుకునేవారు మాత్రం రోమన్‌ క్యాథలిక్కులు అయి ఉండరాదు.

► సింహాసనానికి వారసులను చట్టాల ద్వారా నియంత్రించడానికి, మార్చడానికి కూడా బ్రిటన్‌ పార్లమెంటుకు అధికారముంది. పాలన సరిగా లేకుంటే రాజు/రాణిని కూడా పార్లమెంటు మార్చగలదు. సింహాసనమెక్కే వారు ఇంగ్లండ్‌ చర్చికి, ప్రొటస్టెంట్‌ సంప్రదాయాలకు విధేయులై ఉండాలి.   
        
 
జాతీయ గీతమూ మారుతుంది
చార్లెస్‌ రాజు కావడంతో బ్రిటన్‌ జాతీయ గీతమూ మారనుంది. ఎలిజబెత్‌–2 హయాంలో 70 ఏళ్లుగా బ్రిటన్లో ‘గాడ్‌ సేవ్స్‌ ద క్వీన్‌’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇకపై అది ‘గాడ్‌ సేవ్‌ అవర్‌ గ్రేషియస్‌ కింగ్‌’ అంటూ మొదలవుతుంది. బ్రిటన్‌ రాచరికాన్ని లాంఛనంగా అంగీకరించే న్యూజిలాండ్‌కూ ఇదే జాతీయ గీతం కాగా ఆస్ట్రేలియా, కెనడాలకు రాయల్‌ ఆంథెమ్‌గా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం కరెన్సీపై కూడా ఎలిజబెత్‌ బదులు ఇక చార్లెస్‌ ఫొటో వస్తుంది. అయితే ఇందుకు కొన్నేళ్లు పట్టవచ్చు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ పాస్‌పోర్టుల్లోనూ రాణి స్థానంలో రాజు పేరు వస్తుంది. బకింగ్‌హం ప్యాలెస్‌ బయట విధులు నిర్వహించే క్వీన్స్‌ గార్డ్‌ ఇకపై కింగ్‌ గార్డ్‌గా మారుతుంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement