prince williams
-
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్‌హాం ప్యాలెస్‌లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’గా కేట్ మిడిల్టన్
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 తన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియమ్స్‌ను ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’గా, ఆయన భార్య కేట్ మిడిల్టన్ను ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’గా ప్రకటించారు. అంతేకాకుండా డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్‌గానూ విలియమ్స్ కొనసాగుతారు. ప్రిన్సెస్ డయానా తర్వాత ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ హోదా పొందిన తొలివ్యక్తి కేట్ మిడిల్టన్ కావడం గమనార్హం. డయానా మరణం తర్వాత ఈ హోదా ఇన్నాళ్లూ ఖాళీగానే ఉంది. యునైటెడ్ కింగ్డమ్(యూకే)తోపాటు కామన్వెల్త్ దేశాలకు విధేయుడిగా ఉంటానని, అంకితభావంతో సేవలందిస్తానని కింగ్ చార్లెస్ అన్నారు. బ్రిటన్ రాజు హోదాలో ఆయన శుక్రవారం సాయంత్రం తొలిసారిగా టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రియమైన తల్లి ఎలిజబెత్–2 తనపై అమితమైన ప్రేమ చూపించారని, ఆప్యాయత అందించారని, మార్గదర్శిగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. జీవితాంతంప్రజా సేవలో గడిపారని అన్నారు. ఆమె జీవితం తనకొక ఉదాహరణగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఆమె లోటును తనతోపాటు ఎంతోమంది అనుభవిస్తున్నారన్నారు. రెండో కుమారుడు హ్యారీ, అతడి భార్య మేఘన్‌కు కింగ్ చార్లెస్–3 శుభాకాంక్షలు తెలిపారు. జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్న వారిద్దరి పట్ల తన ప్రేమను వ్యక్తీకరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హ్యారీ రాచరిక హోదా వదులుకుని భార్యతో పాటు అమెరికాలో ఉంటున్నారు. -
ఎలిజబెత్ అస్తమయంతో మారిన వారసుల జాబితా
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనమెక్కారు. కింగ్ చార్లెస్–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. రాణి మృతితో బ్రిటన్ సింహాసనానికి వారసుల జాబితాలో కూడా మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం, ఆయన సంతానానికే వారసత్వంలో ఇక అగ్ర తాంబూలం దక్కనుంది. ఆ లెక్కన విలియం, తర్వాత ఆయన పిల్లలు జార్జ్, చార్లెటీ, లూయిస్ జాబితాలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉంటారు. తర్వాత ఐదో స్థానంలో మాత్రమే విలియం సోదరుడు హ్యారీ ఉంటారు! ఆ తర్వాత ఆయన పిల్లలిద్దరూ వస్తారు. రాణి బతికుండగా చార్లెస్, విలియం తర్వాత హ్యారీ మూడో స్థానంలో ఉండేవారు. ► బ్రిటన్‌లో రాజు/రాణి పెద్ద కుమారుడు మాత్రమే రాజయ్యే సంప్రదాయం ఇటీవలిదాకా కొనసాగింది. తొలి సంతానమైనా సరే అమ్మాయికి అవకాశం ఉండేది కాదు. గురువారం మరణించిన రాణి ఎలిజబెత్–2 కింగ్ జార్జి–6కు తొలి సంతానంగా జన్మించింది. ఆమెకు తమ్ములెవరూ లేకపోవడం వల్ల మాత్రమే రాణి కాగలిగింది. ఈ పురాతన సంప్రదాయాన్ని 2013లో సింహాసన వారసత్వ చట్టం ద్వారా మార్చారు. దాని ప్రకారం తొలిచూరు అమ్మాయైనా బ్రిటన్ సింహాసనం ఆమెకే దక్కుతుంది. దీని ప్రకారం ప్రిన్స్ విలియం కూతురు చార్లెట్ వారసత్వ జాబితాలో తన తమ్ముడు లూయీస్ కంటే ముందుంది. ► రోమన్ క్యాథలిక్కును పెళ్లాడే రాజ కుటుంబీకులు సింహాసనానికి అనర్హులన్న నిబంధనను కూడా 2013 చట్టం ద్వారా తొలగించారు. అయితే రాజు/రాణి కావాలనుకునేవారు మాత్రం రోమన్ క్యాథలిక్కులు అయి ఉండరాదు. ► సింహాసనానికి వారసులను చట్టాల ద్వారా నియంత్రించడానికి, మార్చడానికి కూడా బ్రిటన్ పార్లమెంటుకు అధికారముంది. పాలన సరిగా లేకుంటే రాజు/రాణిని కూడా పార్లమెంటు మార్చగలదు. సింహాసనమెక్కే వారు ఇంగ్లండ్ చర్చికి, ప్రొటస్టెంట్ సంప్రదాయాలకు విధేయులై ఉండాలి. జాతీయ గీతమూ మారుతుంది చార్లెస్ రాజు కావడంతో బ్రిటన్ జాతీయ గీతమూ మారనుంది. ఎలిజబెత్–2 హయాంలో 70 ఏళ్లుగా బ్రిటన్‌లో ‘గాడ్ సేవ్స్ ద క్వీన్’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇకపై అది ‘గాడ్ సేవ్ అవర్ గ్రేషియస్ కింగ్’ అంటూ మొదలవుతుంది. బ్రిటన్ రాచరికాన్ని లాంఛనంగా అంగీకరించే న్యూజిలాండ్‌కూ ఇదే జాతీయ గీతం కాగా ఆస్ట్రేలియా, కెనడాలకు రాయల్ ఆంథెమ్‌గా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం కరెన్సీపై కూడా ఎలిజబెత్ బదులు ఇక చార్లెస్ ఫొటో వస్తుంది. అయితే ఇందుకు కొన్నేళ్లు పట్టవచ్చు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ పాస్‌పోర్టుల్లోనూ రాణి స్థానంలో రాజు పేరు వస్తుంది. బకింగ్‌హం ప్యాలెస్ బయట విధులు నిర్వహించే క్వీన్స్ గార్డ్ ఇకపై కింగ్ గార్డ్‌గా మారుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంపై దిగులుగా ఉంది'
లండన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. బ్రిటన్ రాజకుటుంబం కూడా మహమ్మారి బారీన పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకుటుంబంలో క్వీన్ ఎలిజబెత్ పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కరోనా బారీన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారు. కాగా తండ్రి ఆరోగ్యంపై ప్రిన్స్ విలియమ్స్ స్పందించాడు. ' 70 ఏళ్ల వయసున్న నా తండ్రి ప్రిన్స్ చార్లెస్ గత నెలలో కోవిడ్-19 బారీన పడ్డాడు. ఒక వారం పాటు స్కాట్లాండ్లోని తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే నా తండ్రికి చాతి ఇన్ఫెక్షన్తో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఇప్పట్లో కోలుకోలేడోమోనని భావించాం. కానీ కరోనాను జయించిన వారిలో ఇప్పుడు మా నాన్న ముందు వరుసలో ఉంటాడు. అయితే నానమ్మ క్వీన్ ఎలిజబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ వయసులో పెద్దవారు కావడంతో వారి ఆరోగ్యంపై కొంచెం దిగులుగా ఉంది. అయినా వారి ఆరగ్యో పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. కరోనా మహమ్మారి వారి దరి చేరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిడంతో ప్రజలంతా తమ మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దని, అది అంతా మన మంచికేనని ప్రిన్స్ విలియమ్స్, అతని భార్య కేట్ పేర్కొన్నారు. దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు ప్రజలంతా మనో నిబ్భరం కోల్పోవద్దని, అందరూ దైర్యంగా ఉండాలని తెలిపారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల కరోనా పూర్తిగా తగ్గదు: చైనా) -
మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాణి కేట్
లండన్: బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, యువరాణి కేట్ మిడిల్టన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం మగ బిడ్డ పుట్టినట్లు ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపాయి. ఇప్పటికే రాజ దంపతులకు నాలుగేళ్ల రాకుమారుడు జార్జ్, రెండేళ్ల రాకుమారి చార్లెట్లు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన రాకుమారుడి పేరు ఇంకా ఖరారు చేయలేదు. బ్రిటిష్ సింహాసనం అధిష్టించే వారిలో నూతన రాకుమారుడు ఐదో వారసుడు. -
దోశ మేకర్‌ను ఆర్డరిచ్చిన ప్రిన్స్ విలియమ్స్
చెన్నై: కరకరలాడుతూ ఘుమఘుమలాడే కడక్ దోశ దక్షిణాదితో ఎంతో ఫేమ్. భారత్ పర్యటనలో భాగంగా ముంబై సందర్శించిన బ్రిటన్ యువరాజు దంపతులు ప్రిన్స్ విలియమ్స్, కేట్లు కూడా ఈ దోశ రుచి చూసి వారెవ్వా! అంటూ ప్రశంసించారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి చెందిన మాజీ బీటెక్ విద్యార్థి 24 ఏళ్ల వికాస్ ఈశ్వర్, తాను కనిపెట్టిన దోశ మేకర్‌పై వేసిన దోశనే వారికి తినిపించి శభాష్ అనిపించుకున్నారు. ముకుంద ఫుడ్స్ వ్యవస్థాపక సీఈవో అయిన ఈశ్వర్ తన బ్యాచ్‌మేట్ సుబీత్ సాబత్తో కలసి ఈ దోశ మేకర్‌ను కనుగొన్నారు. దానికి ‘దోశామేటిక్’ అని కూడా పేరుపెట్టారు. రాజ దంపతుల గౌరవార్థం ముంబైలో ఏర్పాటు చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రదర్శనలో పాల్గొన్న ఈశ్వర్ రాజదంపతులను ఎంతగానో ఆకర్షించారు. వెంటనే ఓ దోశా మేకర్‌ను బ్రిటన్‌కు షిప్పింగ్ చేయాల్సిందిగా కూడా ఆర్డర్ పొందారు. చెన్నైలో దొరికే ఒకే రీతి మందం, ఒకే సైజు, ఒకే తీరు కడక్గల దోశ తనకు భారత్ దేశమంతటా పర్యటించినా ఎక్కడా దొరకలేదని, అందుకనే ఎప్పుడూ ఒకే తీరుండే దోశను తయారుచేసే పరికరాన్ని కనుగొనాలనే తపన నుంచే ఈ దోశ మేకర్ పుట్టుకొచ్చిందని ఈశ్వర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ ప్రదర్శనలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన దోశ మేకర్ ఆకర్షించిందని, అయితే ఆయన అలా దూరం నుంచి చూసుకుంటూ వెళ్లారని చెప్పారు. ఇప్పుడు కూడా రాజ దంపతుల నుంచి అలాంటి అనుభవమే ఎదురవుతుందని భావించానని, అయితే అందుకు విరుద్ధంగా వారొచ్చి తన దోశను తినడం, పరికరం పనిచేసే విధానం కూడా అడిగి తెలుసుకోవడం ఆనందం వేసిందని ఆయన వివరించారు. అంతకుమించిన ఆనందం తన దోశమేటిక్‌కు ఆర్డరివ్వడమన చెప్పారు. ఈ దోశమేటిక్ను తాను రెండు వర్షన్లుగా తయారు చేశానని, ఒక వర్షన్ రెస్టారెంట్లలో ఉపయోగించుకోవడానికని, అది 1.5 లక్షల రూపాయలని, ఇంటిలో ఉపయోగించడానికి తయారుచేసిన మోడల్ 12,500 రూపాయలకే లభిస్తుందని ఈశ్వర్ తెలిపారు. తన ఈ దోశమేటిక్‌కు అమెరికా, బ్రిటన్ దేశాల్లో యమగిరాకీ ఉందని చెప్పారు.