దోశ మేకర్‌ను ఆర్డరిచ్చిన ప్రిన్స్ విలియమ్స్
చెన్నై: కరకరలాడుతూ ఘుమఘుమలాడే కడక్ దోశ దక్షిణాదితో ఎంతో ఫేమ్. భారత్ పర్యటనలో భాగంగా ముంబై సందర్శించిన బ్రిటన్ యువరాజు దంపతులు ప్రిన్స్ విలియమ్స్, కేట్‌లు కూడా ఈ దోశ రుచి చూసి వారెవ్వా! అంటూ ప్రశంసించారు. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి చెందిన మాజీ బీటెక్ విద్యార్థి 24 ఏళ్ల వికాస్ ఈశ్వర్, తాను కనిపెట్టిన దోశ మేకర్‌పై వేసిన దోశనే వారికి తినిపించి శభాష్ అనిపించుకున్నారు.
ముకుంద ఫుడ్స్ వ్యవస్థాపక సీఈవో అయిన ఈశ్వర్ తన బ్యాచ్‌మేట్ సుబీత్ సాబత్‌తో కలసి ఈ దోశ మేకర్‌ను కనుగొన్నారు. దానికి ‘దోశామేటిక్’ అని కూడా పేరుపెట్టారు. రాజ దంపతుల గౌరవార్థం ముంబైలో ఏర్పాటు చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రదర్శనలో పాల్గొన్న ఈశ్వర్ రాజదంపతులను ఎంతగానో ఆకర్షించారు. వెంటనే ఓ దోశా మేకర్‌ను బ్రిటన్‌కు షిప్పింగ్ చేయాల్సిందిగా కూడా ఆర్డర్ పొందారు.
చెన్నైలో దొరికే ఒకే రీతి మందం, ఒకే సైజు, ఒకే తీరు కడక్‌గల దోశ తనకు భారత్ దేశమంతటా పర్యటించినా ఎక్కడా దొరకలేదని, అందుకనే ఎప్పుడూ ఒకే తీరుండే దోశను తయారుచేసే పరికరాన్ని కనుగొనాలనే తపన నుంచే ఈ దోశ మేకర్ పుట్టుకొచ్చిందని ఈశ్వర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ ప్రదర్శనలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన దోశ మేకర్ ఆకర్షించిందని, అయితే ఆయన అలా దూరం నుంచి చూసుకుంటూ వెళ్లారని చెప్పారు. ఇప్పుడు కూడా రాజ దంపతుల నుంచి అలాంటి అనుభవమే ఎదురవుతుందని భావించానని, అయితే అందుకు విరుద్ధంగా వారొచ్చి తన దోశను తినడం, పరికరం పనిచేసే విధానం కూడా అడిగి తెలుసుకోవడం ఆనందం వేసిందని ఆయన వివరించారు. అంతకుమించిన ఆనందం తన దోశమేటిక్‌కు ఆర్డరివ్వడమన చెప్పారు.
ఈ దోశమేటిక్‌ను తాను రెండు వర్షన్లుగా తయారు చేశానని, ఒక వర్షన్ రెస్టారెంట్లలో ఉపయోగించుకోవడానికని, అది 1.5 లక్షల రూపాయలని, ఇంటిలో ఉపయోగించడానికి తయారుచేసిన మోడల్ 12,500 రూపాయలకే లభిస్తుందని ఈశ్వర్ తెలిపారు. తన ఈ దోశమేటిక్‌కు అమెరికా, బ్రిటన్ దేశాల్లో యమగిరాకీ ఉందని చెప్పారు.