ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో మరియం థ్రెషియా కటౌట్‌తో భారతీయుల సంబరాలు
వాటికన్ సిటీ: భారత్‌కు చెందిన సిస్టర్ మరియం థ్రెషియాకు ఆదివారం వాటికన్ సిటీలో ఘనంగా జరిగిన ఒక కార్యక్రమంలో ‘సెయింట్‌హుడ్’ను పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. మరియంతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్ జాన్‌హెన్రీ న్యూమన్, స్విట్జర్లాండ్‌కు చెందిన నన్ మార్గెరెట్ బేయస్, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ డల్స్ లోపెస్, ఇటలీ నన్ గ్యూసెప్పిన వానినిలను కూడా దైవ దూతలుగా పోప్ ప్రకటించారు. ‘ఈ రోజు ఈ ఐదుగురు దైవదూతల కోసం ఆ ప్రభువుకు కృతజ్ఞతలు తెల్పుకుందాం’ అని పోప్ ఫ్రాన్సిస్ అక్కడికి భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ఈ ఐదుగురి భారీ చిత్రపటాలకు వేలాడదీశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్ హాజరయ్యారు.
భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ నేతృత్వం వహించారు. తాజాగా సెయింట్‌హుడ్ పొందిన ఐదుగురిలో ముగ్గురు మహిళలున్నారన్న పోప్ ఫ్రాన్సిస్.. ‘వారు ఈ లౌకిక ప్రపంచానికి పవిత్రమైన ప్రేమపూరిత జీవన మార్గాన్ని చూపారు’ అని ప్రశంసించారు. ‘సెయింట్ మార్గరెట్ బేయస్ కుట్టుపని చేసే స్త్రీ అయినా చిన్న ప్రార్థన, సహనపూరిత జీవితంలోని శక్తిని మనకు చూపారు’ అని పోప్ పేర్కొన్నారు. న్యూమన్ రాసిన ఒక ప్రార్థన గీతాన్ని కూడా ఆయన ఉటంకించారు. 1801లో జన్మించిన న్యూమన్ గొప్ప కవి. బోధకుడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావి. బ్రెజిల్‌లో అతిపెద్ద సేవా సంస్థను సిస్టర్ డల్స్ లోపెస్ ప్రారంభించారు. రెండు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. బ్రెజిల్‌కు చెందిన తొలి మహిళా సెయింట్ లోపెస్‌నే కావడం విశేషం.
ఆ చర్చ్ నుంచి నాలుగో సెయింట్
సెయింట్ మరియం థ్రెషియాతో కలిపి కేరళలోని శతాబ్దాల చరిత్ర కలిగిన సైరో మలబార్ కేథలిక్ చర్చ్ లేదా చర్చ్ ఆఫ్ మలబార్ సిరియన్ కేథలిక్స్ నుంచి ఇప్పుడు నలుగురు సెయింట్స్ ఉన్నారు. ఈ చర్చ్ నుంచి 2008లో సిస్టర్ అల్ఫోన్సా సెయింట్‌హుడ్ పొందారు. ఆ తరువాత 2014లో ఫాదర్ కురియాకోస్ ఎలియాస్ చావర, సిస్టర్ యూఫ్రేసియా(యూఫ్రేసియమ్మగా చిరపరిచితం)లకు కూడా ఈ హోదా లభించింది. జీసస్ తరఫున మరియం థ్రెషియా పేదలకు ఎంతో సాయమందించారని, రోగులకు స్వాంత్వన చేకూర్చారని చర్చ్ పేర్కొంది.
జీసస్ క్రైస్ట్‌కు శిలువ వేసినప్పుడు ఆయన శరీరంపై పడిన గుర్తు వంటిది మరియం థ్రెషియా శరీరంపై కూడా ఉండేదని, అయితే, ఆమె ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని వెల్లడించింది. ఆమె చుట్టూ ఒక కాంతిపుంజం ఉండేదని, వ్యాధులను నయం చేయగలగడం వంటి ప్రత్యేక శక్తులు ఆమెకు ఉన్నాయని పేర్కొంది. కేరళలోని త్రిచూర్ దగ్గరలోని పుతెంచిరలో తోమ, తాండ దంపతులకు 1876, ఏప్రిల్ 26న సిస్టర్ థ్రెషియా జన్మించారు. 1902లో జోసెఫ్ విద్యాతిల్‌ను తన గురువుగా స్వీకరించారు. 1904లో తన పేరుకు మరియంను చేర్చుకున్నారు.
1914 మే నెలలో ‘కాంగ్రెగెషన్ ఆఫ్ ద సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ’ని ప్రారంభించారు. 1926 జూన్ 8న, తన 50 ఏళ్ల వయసులో మరణించారు. సిస్టర్ థ్రెషియా చేసిన ఒక అద్భుతాన్ని నిర్ధారించిన పోప్ ఫ్రాన్సిస్ ఈ ఫిబ్రవరి 12న ఆమెను సెయింట్‌హుడ్‌కు అర్హురాలిగా ప్రకటించారు. అక్టోబర్ 13న కెనొనైజేషన్ ఉంటుందన్నారు. 2000లో బీటిఫికేషన్ పొందిన సిస్టర్ థ్రెషియాకు 2019లో సెయింట్‌హుడ్ అందింది. బీటిఫికేషన్ తరువాత అత్యంత తొందరగా, 19 ఏళ్లలోనే, సెయింట్‌హుడ్ పొందిన వ్యక్తి సిస్టర్ థ్రెషియానే కావడం విశేషం. సిస్టర్ థ్రెషియా సెయింట్ హోదా పొందనుండడం భారతీయులందరికీ గర్వకారణమని ఇటీవల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రస్తావించారు.
పోప్‌తో మురళీధరన్ భేటీ: విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఆదివారం పోప్ ఫ్రాన్సిస్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ‘భగవద్గీత అకార్డింగ్ టు గాంధీ’ అనే పుస్తకాన్ని, కేరళ దేవాలయల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగు ప్రతిమను పోప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన శుభాకాంక్షలు తెలపాలని పోప్ కోరారు.
నా వైకల్యం దూరమైంది
సిస్టర్ థ్రెషియాకు సెయింట్ హుడ్ ప్రకటించడంపై త్రిచూర్ దగ్గర్లోని ఆమడంకి చెందిన మేథ్యూ పెలిస్రీ(69) చాలా సంతోషంగా ఉన్నారు. సిస్టర్ థ్రెషియా కారణంగానే తన వైకల్యం దూరమైందని ఆయన చెప్పారు. ‘వాటికన్ సిటీలో జరిగే సెయింట్‌హుడ్ ప్రదాన కార్యక్రమానికి వెళ్లాలనుకున్నాను కానీ వృద్ధాప్య సమస్యల వల్ల వీలు కాలేదు. 2000 సంవత్సరంలో జరిగిన బీటిఫికేషన్ కార్యక్రమానికి వెళ్లాను’ అని వివరించారు. పుట్టినప్పటినుంచే మేథ్యూ రెండు కాళ్లలోనూ వైకల్యం ఉండేది. పట్టుదలతో 33 రోజుల పాటు నిరాహారంగా ఉంటూ, నిరంతరం సిస్టర్ థ్రెషియాకు ప్రార్థన చేశారు. ఒక రాత్రి సిస్టర్ థ్రెషియా ఆయనకు స్వప్నంలో కనిపించారు. ఆ మర్నాడు లేచి చూస్తే ఆయన వైకల్యం మాయమైంది. తన కుమారుడికి సిస్టర్ థ్రెషియా సాంత్వన చేకూర్చినట్లు ఆయన తల్లికి సైతం కల వచ్చింది. సిస్టర్ మరి యం థ్రెషియాకు సెయింట్ హుడ్‌ను ప్రకటించడంపై కేరళలోని కేథలిక్కులు ఆనందోత్సాహాలతో పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పోప్ ఫ్రాన్సిస్
Comments
Please login to add a commentAdd a comment