sainthood
-
సామాన్యునికి సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్ (మహిమాన్విత హోదా) లభించింది. వాటికన్ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్కు మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు. 1712 ఏప్రిల్ 23న కేరళలోని ట్రావెంకోర్ రాజ్యంలో హిందూ నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. ట్రావెంకోర్ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు. దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్‌కు చెందిన కేథలిక్ బిషప్స్ సమాఖ్య పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్ గుర్తించినట్టు వెల్లడించారు. -
Sainthood: దేవసహాయం పిళ్లైకు సెయింట్‌హుడ్ హోదా!
తిరువనంతపురం: హిందూ కుటుంబంలో జన్మించి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన దేవసహాయం పిళ్లైకు సెయింట్ హుడ్ హోదా లభించనుంది. మతపరమైన కార్యకలాపాల్లో లేని ఒక సామాన్య భారతీయ క్యాథలిక్కు సెయింట్ హోదా దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేవసహాయంతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన మరో ఐదుగురికి సెయింట్ హుడ్ హోదా ఇవ్వనున్నట్లు ఇక్కడి చర్చి వర్గాలు బుధవారం వెల్లడించాయి. వచ్చే ఏడాది మే 15వ తేదీన వాటికన్లోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఈ ఆరుగురికి సెయింట్ హుడ్ హోదాను అధికారికంగా ప్రకటిస్తారు. హోదా ఇవ్వాలని మంగళవారం వాటికన్లో మతాధికారుల సమ్మేళనంలో నిర్ణయించారు. అప్పటి ట్రావన్‌కోర్ సంస్థానం పాలనలోని తమిళనాడు ప్రాంతంలో 1712, ఏప్రిల్ 23న నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. 1745లో క్రైస్తవ మతాన్ని స్వీకరించాక తన పేరును లాజరస్‌గా మార్చుకున్నారు. ధనిక పేద తారతమ్యాలు లేకుండా సమాజంలో అందరికీ సమాన హోదా దక్కాలని ఆయన అభిలషించారు. ఇది ఆనాటి సమాజంలోని అగ్రవర్గాలకు నచ్చేది కాదు. దీంతో 1749లో పాలకులు ఆయనను నిర్బంధించారు. 1752 జనవరి 14న ఆయనను చంపేశారు. -
సిస్టర్ థ్రెషియాకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: భారత్‌కు చెందిన సిస్టర్ మరియం థ్రెషియాకు ఆదివారం వాటికన్ సిటీలో ఘనంగా జరిగిన ఒక కార్యక్రమంలో ‘సెయింట్‌హుడ్’ను పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. మరియంతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్ జాన్‌హెన్రీ న్యూమన్, స్విట్జర్లాండ్‌కు చెందిన నన్ మార్గెరెట్ బేయస్, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ డల్స్ లోపెస్, ఇటలీ నన్ గ్యూసెప్పిన వానినిలను కూడా దైవ దూతలుగా పోప్ ప్రకటించారు. ‘ఈ రోజు ఈ ఐదుగురు దైవదూతల కోసం ఆ ప్రభువుకు కృతజ్ఞతలు తెల్పుకుందాం’ అని పోప్ ఫ్రాన్సిస్ అక్కడికి భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ఈ ఐదుగురి భారీ చిత్రపటాలకు వేలాడదీశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్ హాజరయ్యారు. భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ నేతృత్వం వహించారు. తాజాగా సెయింట్‌హుడ్ పొందిన ఐదుగురిలో ముగ్గురు మహిళలున్నారన్న పోప్ ఫ్రాన్సిస్.. ‘వారు ఈ లౌకిక ప్రపంచానికి పవిత్రమైన ప్రేమపూరిత జీవన మార్గాన్ని చూపారు’ అని ప్రశంసించారు. ‘సెయింట్ మార్గరెట్ బేయస్ కుట్టుపని చేసే స్త్రీ అయినా చిన్న ప్రార్థన, సహనపూరిత జీవితంలోని శక్తిని మనకు చూపారు’ అని పోప్ పేర్కొన్నారు. న్యూమన్ రాసిన ఒక ప్రార్థన గీతాన్ని కూడా ఆయన ఉటంకించారు. 1801లో జన్మించిన న్యూమన్ గొప్ప కవి. బోధకుడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావి. బ్రెజిల్లో అతిపెద్ద సేవా సంస్థను సిస్టర్ డల్స్ లోపెస్ ప్రారంభించారు. రెండు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. బ్రెజిల్‌కు చెందిన తొలి మహిళా సెయింట్ లోపెస్‌నే కావడం విశేషం. ఆ చర్చ్ నుంచి నాలుగో సెయింట్ సెయింట్ మరియం థ్రెషియాతో కలిపి కేరళలోని శతాబ్దాల చరిత్ర కలిగిన సైరో మలబార్ కేథలిక్ చర్చ్ లేదా చర్చ్ ఆఫ్ మలబార్ సిరియన్ కేథలిక్స్ నుంచి ఇప్పుడు నలుగురు సెయింట్స్ ఉన్నారు. ఈ చర్చ్ నుంచి 2008లో సిస్టర్ అల్ఫోన్సా సెయింట్‌హుడ్ పొందారు. ఆ తరువాత 2014లో ఫాదర్ కురియాకోస్ ఎలియాస్ చావర, సిస్టర్ యూఫ్రేసియా(యూఫ్రేసియమ్మగా చిరపరిచితం)లకు కూడా ఈ హోదా లభించింది. జీసస్ తరఫున మరియం థ్రెషియా పేదలకు ఎంతో సాయమందించారని, రోగులకు స్వాంత్వన చేకూర్చారని చర్చ్ పేర్కొంది. జీసస్ క్రైస్ట్‌కు శిలువ వేసినప్పుడు ఆయన శరీరంపై పడిన గుర్తు వంటిది మరియం థ్రెషియా శరీరంపై కూడా ఉండేదని, అయితే, ఆమె ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని వెల్లడించింది. ఆమె చుట్టూ ఒక కాంతిపుంజం ఉండేదని, వ్యాధులను నయం చేయగలగడం వంటి ప్రత్యేక శక్తులు ఆమెకు ఉన్నాయని పేర్కొంది. కేరళలోని త్రిచూర్ దగ్గరలోని పుతెంచిరలో తోమ, తాండ దంపతులకు 1876, ఏప్రిల్ 26న సిస్టర్ థ్రెషియా జన్మించారు. 1902లో జోసెఫ్ విద్యాతిల్‌ను తన గురువుగా స్వీకరించారు. 1904లో తన పేరుకు మరియంను చేర్చుకున్నారు. 1914 మే నెలలో ‘కాంగ్రెగెషన్ ఆఫ్ ద సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ’ని ప్రారంభించారు. 1926 జూన్ 8న, తన 50 ఏళ్ల వయసులో మరణించారు. సిస్టర్ థ్రెషియా చేసిన ఒక అద్భుతాన్ని నిర్ధారించిన పోప్ ఫ్రాన్సిస్ ఈ ఫిబ్రవరి 12న ఆమెను సెయింట్‌హుడ్‌కు అర్హురాలిగా ప్రకటించారు. అక్టోబర్ 13న కెనొనైజేషన్ ఉంటుందన్నారు. 2000లో బీటిఫికేషన్ పొందిన సిస్టర్ థ్రెషియాకు 2019లో సెయింట్‌హుడ్ అందింది. బీటిఫికేషన్ తరువాత అత్యంత తొందరగా, 19 ఏళ్లలోనే, సెయింట్‌హుడ్ పొందిన వ్యక్తి సిస్టర్ థ్రెషియానే కావడం విశేషం. సిస్టర్ థ్రెషియా సెయింట్ హోదా పొందనుండడం భారతీయులందరికీ గర్వకారణమని ఇటీవల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రస్తావించారు. పోప్‌తో మురళీధరన్ భేటీ: విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఆదివారం పోప్ ఫ్రాన్సిస్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ‘భగవద్గీత అకార్డింగ్ టు గాంధీ’ అనే పుస్తకాన్ని, కేరళ దేవాలయల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగు ప్రతిమను పోప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన శుభాకాంక్షలు తెలపాలని పోప్ కోరారు. నా వైకల్యం దూరమైంది సిస్టర్ థ్రెషియాకు సెయింట్ హుడ్ ప్రకటించడంపై త్రిచూర్ దగ్గర్లోని ఆమడంకి చెందిన మేథ్యూ పెలిస్రీ(69) చాలా సంతోషంగా ఉన్నారు. సిస్టర్ థ్రెషియా కారణంగానే తన వైకల్యం దూరమైందని ఆయన చెప్పారు. ‘వాటికన్ సిటీలో జరిగే సెయింట్‌హుడ్ ప్రదాన కార్యక్రమానికి వెళ్లాలనుకున్నాను కానీ వృద్ధాప్య సమస్యల వల్ల వీలు కాలేదు. 2000 సంవత్సరంలో జరిగిన బీటిఫికేషన్ కార్యక్రమానికి వెళ్లాను’ అని వివరించారు. పుట్టినప్పటినుంచే మేథ్యూ రెండు కాళ్లలోనూ వైకల్యం ఉండేది. పట్టుదలతో 33 రోజుల పాటు నిరాహారంగా ఉంటూ, నిరంతరం సిస్టర్ థ్రెషియాకు ప్రార్థన చేశారు. ఒక రాత్రి సిస్టర్ థ్రెషియా ఆయనకు స్వప్నంలో కనిపించారు. ఆ మర్నాడు లేచి చూస్తే ఆయన వైకల్యం మాయమైంది. తన కుమారుడికి సిస్టర్ థ్రెషియా సాంత్వన చేకూర్చినట్లు ఆయన తల్లికి సైతం కల వచ్చింది. సిస్టర్ మరి యం థ్రెషియాకు సెయింట్ హుడ్ను ప్రకటించడంపై కేరళలోని కేథలిక్కులు ఆనందోత్సాహాలతో పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పోప్ ఫ్రాన్సిస్ -
కేరళ నన్‌కు సెయింట్‌హుడ్ నేడే
కొచ్చి: కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని (నన్) మరియం థ్రెసియా చిరమెల్ మంకిడియాన్‌కు క్రైస్తవ మతాధినేత పోప్ ఫ్రాన్సిస్ ‘పునీత హోదా’ (సెయింట్‌హుడ్)ను ప్రదానం చేయనున్నారు. వాటికన్లోని సెయింట్ పీటర్ ప్రధాన ప్రార్థనాస్థలిలో ఆమెతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్ జాన్ హెన్రీ, స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళ మార్గరెట్ బేస్‌కు, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ డూస్లెకు, ఇటలీకి చెందిన సిస్టర్ గిసెప్పినాలకు పునీత హోదా ప్రకటించనున్నారు. 2000వ సంవత్సరంలో పోప్ సెయింట్ జాన్‌పాల్2, మరియం థ్రెసియాకు ‘బ్లెస్డ్’ హోదాను ప్రకటించారు. -
పోప్ జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్!
వాటికన్ సిటీ: 33 రోజులు పోప్‌గా ఉన్న దివంగత పోప్ జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్ హోదా ఇచ్చే ప్రతిపాదనకు పోప్ ఫ్రాన్సిస్ ఆమోదం తెలిపారు. 1978 ఆగస్టు 26న పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈయన గుండెపోటుతో అదే ఏడాది సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచారు. పోప్‌జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్ హోదా ఇవ్వాలంటే ముందుగా బీటిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వాలి. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా పోప్ జాన్‌పాల్1ను ‘సద్గుణశీలి’గా పోప్ ఫ్రాన్సిస్ గుర్తించారు. ఆ తర్వాత జాన్‌పాల్ పేరిట జరిగిన మొదటి అద్భుతాన్ని రోమన్ క్యాథలిక్ చర్చి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆయన మరణం తర్వాత జరిగిన అద్భుతాన్ని సైతం చర్చి గుర్తించాలి. -
విశ్వజనని
మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ హోదా ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్ ఆమె సేవాతత్పరతకు అందిన గౌరవం అన్న పోప్ వాటికన్ సిటీలో అంగరంగ వైభవంగా కార్యక్రమం - వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవ మత పెద్దలు, అభిమానులు.. - హాజరైన 13 దేశాల అధినేతలు.. కోల్‌కతాలో పండుగ వాతావరణం - సంప్రదాయాలను తోసిరాజని స్క్రీన్లకు అతుక్కుపోయిన నన్స్ - గంటలు మోగిస్తూ, చప్పట్లు చరుస్తూ హర్షాతిరేకాలు ఎక్కడో మేసిడోనియాలో కళ్లు తెరిచింది.. ప్రేమే ధర్మం.. సేవే మార్గమంటూ కదిలింది.. పేదలు, దీనులను అక్కున చేర్చుకుంది.. విశ్వజననిగా మానవత్వాన్ని పరిమళింపజేసింది.. 87 ఏళ్ల వయసులో ఆ కళ్లు మూతపడ్డాయి.. 19 ఏళ్ల తర్వాత.. నేడు.. ఆ కళ్లు మళ్లీ ‘తెరుచుకున్నాయి’.. కళ్ల నిండా విశ్వప్రేమను వర్షిస్తూ.. మానవత్వంలోనే ‘దైవత్వం’ ఉందని చాటిచెబుతూ.. థెరిసా ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నాకు వాళ్ల (పేదలు) భాష రాకపోవచ్చు. కానీ వారి ముఖాలపై చిరునవ్వు విరిసేలా చేయగలను అనేవారు. ఆ చిరునవ్వులను మన హృదయాల్లో నింపుకుందాం. మన జీవన ప్రయాణంలో లక్షలాది దీనులకు వాటిని పంచుదాం. - పోప్ వాటికన్ సిటీ/కోల్‌కతా: మానవ సేవకు తన జీవితాన్ని అంకితం చేసి, క్రీస్తు ప్రేమ సందేశాన్ని లోకానికి చాటిచెప్పిన మానవతామూర్తి మదర్ థెరిసాకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ హోదా ప్రకటించారు. ఆదివారం రోమ్‌లోని వాటికన్ సిటీలో ప్రపంచం నలుమూలల నుంచి తరలి వచ్చిన క్రైస్తవ మతపెద్దలు, వేలాది మంది యాత్రికులు, 13 దేశాలకు చెందిన అధినేతలు, థెరిసా ఆర్డర్‌కు చెందిన నన్స్ మధ్య ఈ మేరకు ప్రకటన చేశారు. ఇది మూర్తీభవించిన మాతృప్రేమకు, అనాథలను, పేదలను అక్కున చేర్చుకున్న సేవాతత్పరతకు అందిస్తున్న గౌరవమని పేర్కొన్నారు. ‘‘ఆమె పవిత్ర హృదయం మాకు అత్యంత సమీపంలో ఉంది. నిర్మలమైన ఆమె మనసును తలచుకున్నప్పుడల్లా మా గుండెలోతుల్లోంచి ‘మదర్’ అని వినిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన థెరిసాను నేటి నుంచి సెయింట్స్ జాబితాలో చేరుస్తున్నాం..’’ అని భావోద్వేగంతో అన్నారు. పేదరికాన్ని సృష్టిస్తున్న ఈ ప్రపంచ దేశాల నాయకుల నేరాన్ని పేద గొంతుల తరఫున థెరిసా వినిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో వినిపించాల్సిన సందేశాన్ని ముందుగానే రాతపూర్వకంగా రూపొంది స్తారు. అయితే అందులో ఈ విషయాలు పేర్కొనకపోయినా పోప్ ఫ్రాన్సిన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మదర్ గొప్పతనాన్ని కొనియాడారు. మదర్ థెరిసా దైవానికి అత్యంత సమీపంలో ఉందనడానికి.. భారత్‌లోని కోల్‌కతా మురికివాడల్లో నిరుపేదలకు చేసిన సేవలే నిదర్శనమన్నారు. ‘‘ఆమె ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ‘నాకు వాళ్ల(పేదలు) భాష రాకపోవచ్చు. కానీ వారి ముఖాలపై చిరునవ్వు విరిసేలా చేయగలను’ అని థెరిసా అనేవారు. ఆ చిరునవ్వులను మన హృదయాల్లో నింపుకుందాం. మన జీవన ప్రయాణంలో లక్షలాది దీనులకు వాటిని పంచుదాం’’ అని అన్నారు. గర్భస్థ శిశువులు ఈ లోకంలో అత్యంత బలహీనమైన వారని, అబార్షన్లతో వారిని చంపేయడాన్ని థెరిసా తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సెయింట్‌హుడ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ టాప్‌లెస్ జీప్‌లో సెయింట్‌పీటర్స్ స్క్వేర్‌లో తిరుగుతూ వేలాది మంది అభిమానులకు అభివాదం చేశారు. కోల్‌కతాలో పండగ వాతావరణం వాటికన్ సిటీలో మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ ప్రకటిస్తున్న సమయంలో ఆమె కార్యక్షేత్రమైన కోల్‌కతాలో పండగ వాతావరణం కనిపించింది. నగరంలో అనేకచోట్ల పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటికన్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇక థెరిసా సేవా కార్యక్రమాలకు హెడ్‌క్వార్టర్‌గా ఉన్న మదర్హౌస్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. సాధారణంగా భావోద్వేగాలకు అతీతంగా, ప్రశాంత వదనాలతో కనిపించే నన్స్ ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. టీవీలు, సెల్ఫోన్లకు దూరంగా ఉండే సిస్టర్స్ అంతా స్క్రీన్ల ముందు వాలిపోయి వాటికన్లో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆనందంతో పెద్దగా అరుస్తూ, చప్పట్లు చరుస్తూ, గంటలు మోగిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. మదర్‌హౌస్ ముందు థెరిసా నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచారు. పూలు, విద్యుద్దీపాలు, థెరిసా చిత్రపటాలతో భవనాన్ని అలంకరించారు. సందర్శకులకు వీలుగా రోజంతా మదర్హౌస్ను తెరిచి ఉంచారు. ఉదయం 6 గంటలకే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనేక మంది విదేశీయులు కూడా మదర్హౌస్కు తరలివచ్చారు. థెరిసా సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. మానవ సేవే మాధవ సేవగా.. 1910 ఆగస్ట్ 26న మేసిడోనియాలోని స్కోప్జేలో జన్మించిన థెరిసా నన్‌గా మారి తన సేవా కార్యక్రమాలకు కోల్‌కతాను కేంద్రంగా చేసుకున్నారు. దీనులు, అన్నార్థులు, రోగపీడితులు, అనాథలను అక్కున చేర్చుకొని ఆదరించింది. 1931 నుంచి 1997 సెప్టెంబర్ 5న కన్ను మూసేవరకు కోల్‌కతాలోనే సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. 1997లో ఆమెను పవిత్రమూర్తి (బీటిఫికేషన్)గా గుర్తించే ప్రక్రియ మొదలైంది. మదర్ థెరిసా మరణానంతరం జరిగిన రెండు అద్భుతాల(1998లో ఒకటి, 2008లో మరొకటి)ను ధ్రువీకరించుకున్న తర్వాత థెరిసాకు.. ఆమె 19వ వర్ధంతి సందర్భంగా రోమన్ కేథలిక్ చర్చి సెయింట్‌హుడ్ హోదాతో గౌరవించింది. ఆమె ఆదర్శాలను అలవర్చుకుందాం.. సెయింట్‌హుడ్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ఎందరో క్రైస్తవ మత పెద్దలు, థెరిసా అభిమానులు తరలివచ్చారు. ఇటలీలో థెరిసా ఆర్డర్‌కు చెందిన 1,500 మంది ఇళ్లు లేని నిరుపేదలను పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి వీఐపీ సీట్లు కేటాయించి ముందు వరుసలో కూర్చోబెట్టారు. బ్రెజిల్లో థెరిసా మహిమతో బ్రెయిన్‌ట్యూమర్ నుంచి బయటపడిన ఆండ్రినో, ఆయన భార్య ఫెర్నాండా కూడా హాజరయ్యారు. 2003లో నిర్వహించిన బీటిఫికేషన్ కార్యక్రమానికి ఏకంగా 3 లక్షల మంది తరలివచ్చారు. కానీ ఈసారి లక్ష మంది మాత్రమే హాజరయ్యార ని చెబుతున్నారు. కార్యక్రమానికి 3 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆగస్టు 26, 1910: మేసిడోనియాలో అల్బేనియన్ దంపతులకు జననం. ఆగ్నస్ గోన్షా బోజాక్షియుగా నామకరణం. 1928: ఐర్లండ్‌లో కేథలిక్ నన్ (సిస్టర్ మేరీ థెరిసాగా) మార్పు. 1929: కోల్‌కతాలో మిషనరీ, చారిటీ కార్యక్రమం ప్రారంభం. 1948: వరకు సెయింట్ మేరీ స్కూల్లో బోధన. 1950 అక్టోబర్: మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రారంభం. 1960ల్లో: కుష్టువ్యాధి, అతిసారం, క్షయవ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు. 1979: నోబెల్ శాంతి బహుమతి ప్రదానం. 1997 సెప్టెంబర్ 5: కోల్‌కతాలో చివరి శ్వాస. 2003: బెంగాలీ యువతికి వ్యాధి నయం చేసినందుకు పోప్ జాన్‌పాల్ -2 ద్వారా బీటిఫైడ్ (పవిత్రమూర్తిగా) గుర్తింపు. 2015: బ్రెజిల్ యువకుడికి బ్రెయిన్ ట్యూమర్‌ను తగ్గించటం ద్వారా సెయింట్‌హుడ్ ఇవ్వాలని నిర్ణయం. 2016 సెప్టెంబర్ 4: మదర్ థెరిసాకు సెయింట్ (మహిమాన్విత) హోదా ఇచ్చినట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన. సెయింట్ థెరిసా మహిమలు భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత సెయింట్ థెరిసా పేదల పాలిట కల్పతరువు. ఆదివారం ‘మహిమాన్విత’ (సెయింట్‌హుడ్) గౌరవాన్ని అందుకున్న థెరిసా.. బతికున్నన్ని రోజులూ జీవితాన్ని అనాథలు, అభాగ్యులకే అంకితం చేసింది. ఎవరు బాధపడుతూ..తనను తలచుకున్నా.. మరుక్షణమే నేనున్నానంటూ ఆదుకునే ఆ చేతులు.. కోల్‌కతాలో ఒకరికి, బ్రెజిల్లో మరొకరికి ప్రాణదానం చేశాయి. చికిత్సలేని భయంకరమైన రోగాలనుంచి విముక్తి కలిగించాయి. బ్రెజిల్లో.. బ్రెజిల్‌కు చెందిన మార్సిలియో ఆండ్రినో అనే వ్యక్తి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. మెదడులో సమస్య కారణంగా జీవితాంతం సమస్యలు తప్పవని డాక్టర్లు తేల్చేశారు. ఈ సమయంలోనే థెరిసా చిత్రపటాన్ని ఆండ్రినో మంచం వద్ద ఉంచిన అతని భార్య.. తీవ్రమైన వ్యాధినుంచి కాపాడమని ప్రార్థన చేసింది. కొంతకాలం తర్వాత (2008లో) ఓ రోజు రాత్రి ఆండ్రినోకు తీవ్రమైన తలనొప్పి వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆరోజు రాత్రి ఏదో ప్రశాంతమైన వాతావరణంలో తన నొప్పిని ఎవరో తీసేసినట్లు అనిపించిందని.. తెల్లవారాక ఆండ్రినో చెప్పాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కూడా వ్యాధి నయమైపోయినట్లు గుర్తించారు. ఈ విషయం పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి వచ్చింది. ఆ తర్వాత జరిపిన పరిశోధనల ఆధారంగానే మదర్‌కు థెరిసా సెయింట్‌హుడ్ బహూకరించారు. కోల్‌కతాలో.. మోనిక బెస్రా పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ. 1997లో తీవ్రమైన కడుపునొప్పితో ఆమె ఆసుపత్రిలో చేరింది. కడుపులో కణితి కారణంగానే నొప్పి అని తేల్చిన వైద్యులు.. చికిత్సనందించలేమని చేతులెత్తేశారు. కొన్ని నెలల తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో జరిగే ఆసుపత్రిలో చేరారు. ఈమెను పరిశీలించిన వైద్యులు.. ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. అయితే, 1998 సెప్టెంబర్ 5న కోల్‌కతాలో మదర్ థెరిసా తొలి వర్ధంతి సభ జరుగుతోంది. అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో.. థెరిసా చేతినుంచి ఓ జ్యోతి ఆకారం వచ్చి మోనిక కడుపులోకి వెళ్లినట్లు గుర్తించారు. ఆ రోజు సాయంత్రం కూడా ఇద్దరు నన్స్.. థెరిసా చిత్రపటాన్ని మోనిక కడుపుకు కట్టారు. దీంతో ఏడాది కాలంగా నొప్పితో రాత్రుళ్లు సరిగా నిద్రపోని మోనిక.. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లవారాక పరీక్షలు చేస్తే.. అసలు ఆమెకు కడుపులో కణితి కాదుకదా.. కణితి ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో వైద్యులంతా ఆశ్చర్యపోయారు. దేశానికే గర్వకారణం: మోదీ మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించటం దేశానికే గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జీ-20 సదస్సులో భాగంగా చైనాలో ఉన్న మోదీ.. బహుకరణ కార్యక్రమం కాగానే.. ‘సెయింట్‌హుడ్ ఇవ్వటం మదర్ థెరిసాకు దక్కిన గొప్ప గౌరవం. భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఈ గౌరవం దక్కటం భారత్‌కే గర్వకారణం’ అని ట్వీట్ చేశారు. సేవలకు గుర్తింపు: సోనియా సమాజంలో అణగారిన వర్గాలకు, అభాగ్యులకు చేసిన సేవలకు ప్రతిఫలంగానే మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారు. ప్రేమ, కరుణ, మానవత్వానికి థెరిసా జీవితమే పర్యాయపదమన్నారు. ప్రపంచంలోని పేదలకు, అభాగ్యులకు సేవచేయాలనుకునే వారికి మదర్ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన థెరిసా అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రజాసేవలో తరించారు: సుష్మ వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన సెయింట్‌హుడ్ కార్యక్రమానికి భారత్ తరపున కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ పాల్గొన్నారు. ప్రజల సేవలో తరించిన మహోన్నత వ్యక్తిత్వానికి సుష్మా నివాళులర్పిం చారు. ‘భారతదేశంలోని నలు మూలలు, వివిధ విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులతో ఇక్కడికి వచ్చాను. మదర్ థెరిసా జీవితాన్ని గౌరవించేందుకే మేమంతా ఇక్కడికి వచ్చాం’ అని సుష్మ వెల్లడించారు. వీరితోపాటు ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రుల నేతృత్వంలోనూ రెండు బృందాలు ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లాయి. 1997లో మరణం తర్వాత రెండు సందర్భాల్లో థెరిసా తన దివ్యత్వాన్ని చూపించినందుకు ఈ గౌరవాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. సేవాభావానికి ప్రతీక సెయింట్ థెరిసా వైఎస్ జగన్ ఘన నివాళి సాక్షి, హైదరాబాద్: సెయింట్ హోదాను పొందిన దివంగత మదర్ థెరిసాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సేవాభావం, దయాగుణానికి ప్రతీక అయిన థెరిసా ప్రేమ, దయ, కరుణకున్న తిరుగులేని శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో శ్లాఘించారు. మదర్ థెరిసాను సెయింట్ల జాబితాలో చేర్చడం (క్యాననైజేషన్) భారతదేశానికి ఎనలేని ప్రాధాన్యతను తెచ్చి పెట్టిందని కొనియాడారు. భారతదేశంలో ఆమె స్థాపించిన మిషనరీలు విశ్వవ్యాప్తంగా విస్తరించి పేదల పట్ల సేవా భావాన్ని పెంపొందించాయన్నారు. ఆమె పేదలకు, ఆపదలో ఉన్న వారికి నిరంతరం అలుపెరుగకుండా చేసిన సేవలకు ఎన్నో అవార్డులు లభించాయని, నోబెల్ బహుమతిని కూడా గెల్చుకున్న దయాశీలి థెరిసా అన్నారు. ‘సెయింట్‌హుడ్’ ప్రదానం చేసిన క్షణం ప్రతి భారతీయుడు గర్వించ దగిందన్నారాయన. సోమవారం సెయింట్ థెరిసా 19వ వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ‘నేనివాళే ఉండవచ్చు. కానీ ఈ సేవలు కలకాలం నిలిచి పోతాయి’ అన్న కరుణామయి మాటల్లోని సందేశం విశ్వవ్యాప్తంగా విస్తరించేలా చేస్తూ ముందుకు సాగాలని జగన్ తెలిపారు. సేవాతత్పరతకు దక్కిన గౌరవం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెయింట్ థెరిసాకు మహిమాన్విత హోదా ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆమె చూపిన మానవత్వానికి, సేవాతత్పరతకు దక్కిన అరుదైన గౌరవమే ఈ సెయింట్ హోదా అని ప్రశంసించారు. మనుషుల్లో దైవత్వం ఉంటుందని సెయింట్ మదర్ థెరిసా నిరూపించారని చంద్రబాబు తెలిపారు. పోప్‌కు మమత అరుదైన కానుక వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అరుదైన కానుకను అందించారు. బెంగాలీ లిపిలో.. బలుచురీ సిల్క్‌పై రాసిన బైబిల్‌ను బహుమానంగా అందించారు. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ సిస్టర్ ప్రేమ, ఆర్చ్ బిషప్.. ఈ పుస్తకాన్ని పోప్‌కు అందిస్తారు’ అని మమత ట్వీట్ చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆహ్వానితురాలిగా మమత వాటికన్ వెళ్లిన సంగతి తెలిసిందే. 1,500 మంది పేదలకు పిజ్జా వాటికన్‌సిటీలో సెయింట్‌హుడ్ బహూకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత.. మదర్ థెరిసా బాటలో పోప్ ఫ్రాన్సిస్ 15వందల పేదలకు పిజ్జాలు పంచిపెట్టారు. మదర్ థెరిసా సంస్థ సిస్టర్స్ ఆఫ్ చారిటీ సంస్థకు చెందిన చాలా మంది.. ఆదివారం నాటి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేకమైన బస్సుల్లో వచ్చారు. వారికి పోప్ పిజ్జాలు ఇచ్చారు. మొత్తం లక్షమందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘మదర్’కు పునీత పట్టం ఆనందదాయకం
విజయవాడ (మొగల్రాజపురం) : మదర్ థెరిస్సాకు పునీత పట్టం (సెయింట్ హుడ్) అందజేయడం చాలా సంతోషించదగిన విషయమని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం ఉదయం సిద్ధార్థ కళాశాల సమీపంలోని మదర్ థెరిస్సా విగ్రహానికి ఆయన పూలమాలవేసి అంజలిఘటించారు. మదర్‌థెరిస్సాకు వాటికన్ సిటీలో లక్షలాది మంది మధ్య పోప్ ఫ్రాన్సస్ సెయింట్ హుడ్ (పునీత పట్టం) అందజేస్తున్న సందర్భంగా నగరంలోని సీఆర్ఐ, విజయవాడ కేథటిక్ డయోసిస్, మిషనరీ ఆఫ్ చారిటీ సిస్టర్స్ సంయుక్త ఆధ్వర్యంలో పటమట సైంట్ పాల్స్ కథెడ్రల్ చర్చి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు మీదుగా సిద్ధార్థ కళాశాల సమీపంలో ఉన్న మదర్‌థెరిస్సా విగ్రహం వరకు సాగింది. అక్కడ జరిగిన కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు రోగులు, దీనులు, అనాథలను అక్కున చేర్చుకొన్న మహిమాన్వితురాలు మదర్ థెరిస్సా అని కొనియాడారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా అందరితో అమ్మ అని అప్యాయంగా పిలిపించుకున్న మహోన్నత వ్యక్తి మదర్థెరిస్సాని పేర్కొన్నారు. లయోలా కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ ఫాదర్ రవిశేఖర్ మాట్లాడుతూ 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెనలో మృతి చెందిన వారి శరీరాలకు మదర్‌థెరిస్సా స్వయంగా దహన సంస్కారాలను నిర్వహించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్, మూడో డివిజన్ కార్పొరేటర్ బొప్పన భవకుమార్, ఆంధ్రా లయోలా కళాశాల డైరెక్టర్ రెక్స్ ఎంజిలో, గుణదల మాత పుణ్యక్షేత్రం ఫాదర్స్ మువ్వల ప్రసాద్, జోబిబాబు, మరియదాస్, సిస్టర్ రోజా, డయోసిస్ గురువులు, సిస్టర్స్, మదర్‌థెరిస్సా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయహో.. మదర్ థెరిస్సా జయహో మదర్‌థెరిస్సా అనే నినాదంతో సిద్ధార్థ కళాశాల సమీపంలోని మదర్‌థెరిస్సా విగ్రహం పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. వాటికన్ సిటీలో విశ్వమాత మదర్‌థెరిస్సాకు పునీత పట్టం అందజేస్తున్న సందర్భంగా నగరంలో ‘అమ్మ’ అభిమానులు ఆమె ఫొటోలు చేతపట్టుకుని లబ్బీపేట, పెజ్జోనిపేట, పటమట ప్రాంతాల నుంచి బైక్ ర్యాలీ ద్వారా కొందరు, పాదయాత్రగా ఇంకొందరు సిద్ధార్థ కళాశాల సమీపంలో ఉన్న మదర్‌థెరిస్సా విగ్రహం వద్దకు చేరుకున్నారు. అమ్మపై అభిమానాన్ని చాటుకున్నారు. తెల్ల జెండాలతో అధిక సంఖ్యలో సిస్టర్స్ పాదయాత్రలో పాల్గొన్నారు. -
మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’
- సెప్టెంబర్ 4న ఇస్తాం... - అధికారిక ప్రకటన చేసిన పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీ: మదర్ థెరిసాను ‘సెయింట్’గా ప్రకటించేందుకు వాటికన్ సిటీ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 4న అధికారికంగా సెయింట్‌హుడ్ ఇస్తామని కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీకి మంగళవారం పంపిన వర్తమానంలో పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. దీంతో 45 ఏళ్ల పాటు పేదల సేవలో తరించిన మదర్ మరణించిన 19 ఏళ్ల అనంతరం సెయింట్ హోదా పొందనున్నారు. థెరిసాను పరిశుద్ధురాలిగా ప్రకటించే ప్రక్రియకు పోప్ ఆమోదం తెలిపారన్న వర్తమానం అందగానే మిషనరీస్ ఆఫ్ చారిటీలో ఆనందం మిన్నంటింది. విషయం తెలియగానే ఎంతో ఉద్వేగం, ఆనందానికి గురయ్యామంటూ చారిటీ ప్రతినిధి సునీత కుమార్ తెలిపారు. మదర్ థెరిసాకు ఉన్న పేరుప్రఖ్యాతుల వల్ల సెయింట్ హోదా ప్రక్రియకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని ఆమె చెప్పారు. సెయింట్‌గా ప్రకటించే ప్రక్రియ సంప్రదాయం మాత్రమేనని, అయితే చాలా ముఖ్యమైనదని ఆర్చిబిషప్ డిసౌజా తెలిపారు. రోమ్‌లో జరిగే కార్యక్రమానికి సిస్టర్ ప్రేమతో పాటు డిసౌజా హాజరవనున్నారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 2న భారీ కృతజ్ఞతా సమావేశం, ప్రార్థనలు నిర్వహించాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ భావిస్తోంది. జీవితమంతా పేదలు, రోగుల సేవలో 1910లో మాసిడోనియాలో అల్బేనియా దంపతులకు అంజెజె గోన్క్సే బొజాక్షిహుగా జన్మించిన మదర్ 18 ఏళ్ల వయసులో ఐర్లాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి భారత్‌కు వచ్చి మరణించేంతవరకూ ఇక్కడే జీవించారు. పేదలు, రోగుల సేవకే జీవితాన్ని అర్పించిన థెరిసాను క్యాథలిక్కులు పూజ్యనీయురాలిగా భావిస్తారు. సేవాతత్పరతకు గుర్తింపుగా 1979లో ఆమె నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1951లో భారత పౌరసత్వాన్ని అందుకున్న మదర్ 87 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 5, 1997న కోల్‌కతాలో మరణించారు. మరణానంతరం మదర్ చేసిన అద్భుతాన్ని 2002లో వాటికన్ గుర్తించడంతో సెయింట్ హోదా ప్రక్రియను 2003లో పోప్ జాన్ పాల్ 2 ప్రకటించారు. ఆ కార్యక్రమానికి దాదాపు 3 లక్షలమంది హాజరయ్యారు. 1998లో కడుపులో కణితితో తీవ్రంగా జబ్బుపడ్డ బెంగాలీ గిరిజన మహిళ మోనికా బెర్సా అనారోగ్యం నుంచి కోలుకుంది. 2008లో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి మదర్ మహిమతో అనారోగ్యం నుంచి బయటపడ్డాడు. సెయింట్‌గా ప్రకటించేందుకు అవసరమైన రెండు అద్భుతాలు జరగడంతో గత ఏడాది వాటికన్ పరిశీలకులు సెయింట్‌హుడ్ ప్రక్రియలోని చివరి దశను మొదలుపెట్టారు. -
సెయింట్ థెరిసా!
కన్నపేగు తల్లడిల్లుతుంటే ఏ అమ్మ మనసైనా చివుక్కుమంటుంది. ఆ బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని లాలిస్తుంది...ఊరడిస్తుంది...బుజ్జగిస్తుంది. పేగు బంధం గొప్పతనమది. అలాంటి మాతృత్వపు పరిమాళాన్ని సమాజంలో లక్షలాదిమందికి పంచడం మాత్రమే కాదు...ఆ విషయంలో ఎందరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి కనుమరుగైన మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటన వెలువడింది. వాటికన్ మతాచార్యుడు పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ ప్రకటన కోసమే దేశదేశాల్లోని కోట్లాదిమంది ఆమె అభిమానులు చిరకాలంగా నిరీక్షిస్తు న్నారు. 2003లో ఆనాటి పోప్ జాన్‌పాల్ 2 మదర్‌కు సెయింట్ హోదా ఇచ్చే ప్రక్రి యను ప్రారంభించామని ప్రకటించినప్పుడు ఈ నిరీక్షణ మొదలైంది. రోగగ్ర స్తులకు సేవలందించడానికి, పేద హృదయాలను ఊరడించడానికి, అనాథలకు నీడై నిలవడానికి సరిహద్దులు అడ్డురావని నిరూపించిన ప్రేమమయి ఆమె. ఈ ప్రస్థానంలో సెయింట్‌హుడ్ అనేది ఒక సంప్రదాయకమైన లాంఛనమే కావొచ్చు. ఒక మతంలో లభించే ఉత్కృష్టమైన గౌరవమే కావొచ్చు. కానీ ఆమె చేసిన సేవలకూ, ఆమె స్థాపించిన విలువలకూ, ఆమె నెలకొల్పిన ఆదర్శాలకూ ఏమి చ్చినా తక్కువే అవుతుంది. ప్రపంచం కూటములుగా మారడం, పరస్పర పోటీ పెరగడం, దేశాలమధ్య విద్వేషాలు రాజుకోవడం, అవి ముదిరి యుద్ధాలుగా రూపాంతరం చెందడంవంటి పరిణామాలవల్ల సమాజాలు సంక్షోభంలో కూరుకుపోతాయి. మానవ పరిణామ క్రమంలో రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన విధ్వంసం అసాధారణమైనది. ఆ యుద్ధాల పర్యవసానాలు అతి భయంకరమైనవి. ఎంతో వినాశనాన్ని తీసుకొచ్చిన మొదటి ప్రపంచ యుద్ధమే మదర్ థెరిసా లాంటి గొప్ప మానవతామూర్తిని అందించిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ యుద్ధం జనజీవితాల్లో కలిగించిన సంక్షోభాన్ని, అందువల్ల చుట్టూ ఉన్నవారు పడుతున్న ఇబ్బందులనూ, క్షతగాత్రుల రోదనలనూ, వేదనలనూ పసి వయసులో అప్పటికి అంజెజె గోన్క్సే బొజాక్షిహుగా ఉన్న మదర్‌ను తల్లడిల్లజేశాయి. సమాజంలోని అసహాయులకు ఏదో ఒకటి చేయా లని, వారికి అండగా నిలవాలని అప్పుడే ఆమె నిర్ణయించుకున్నారు. వయసు పెరిగేకొద్దీ ఆ భావన మరింతగా బలపడింది. సేవ చేయడానికి నన్‌గా మారడమే మార్గమని పన్నెండేళ్ల ప్రాయంలోనే భావించినా అందుకు వయసు సరిపోదని తెలిసి మరో నాలుగేళ్లు ఆగారామె. పద్దెనిమిదేళ్ల వయసులో ఇల్లు విడిచి ఐర్లండ్ లోని సిస్టర్స్ ఆఫ్ లోరెటోలో చేరిననాటినుంచి 1997లో కోల్‌కతాలో 87 ఏళ్ల వయ సులో మరణించేవరకూ ఆమె సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే ఉన్నారు. భార త్ను భయంకరమైన కరువుకాటకాలు పీడిస్తున్న సమయంలో... పేద జనం రోగాలబారినపడి తల్లడిల్లుతున్న సమయంలో...ఎటుచూసినా దారిద్య్రం తాండ విస్తున్న సమయంలో తన సేవలు ఇక్కడ అవసరమని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పంనుంచి ఆమె వెనుదిరగలేదు. మొదట్లో ఉపాధ్యాయినిగా, అనంతరం ప్రిన్సిపాల్‌గా సేవలందించినా ఆ తర్వాత పూర్తిగా వీధి బాలల, నిరుపేదల, రోగగ్రస్తుల సేవలోనే ఆమె గడిపారు. అందుకవసరమని భావించి వైద్యరంగంలో సైతం శిక్షణపొందారు. వారు కుష్టురోగులైనా, మరే ఇతర అంటువ్యాధితో బాధ పడుతున్నా అక్కున చేర్చుకుని ఆదరించారు. గాయాలను శుభ్రపరచడం, కట్టు కట్టడం దగ్గరనుంచి ఎన్నో సేవలందించి అలాంటివారిలో మానసిక స్థైర్యాన్ని నింపారు. అప్పటి కలకత్తా నగర వీధుల్లో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం. ఆరో జుల్లో ఇలాంటి సేవలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఆ తరహా ఆచరణకు ఎందరినో పురిగొల్పేవి. ఈ క్రమంలో ఆమె కొచ్చిన బిరుదులు, పురస్కారాలు ఎన్నెన్నో! 1962లో పద్మశ్రీ పురస్కారం మొదలుకొని జాతీయంగా, అంతర్జాతీయంగా ఆమె అందుకున్న అవార్డులు అన్నీ ఇన్నీ కాదు. 1979లో నోబెల్ శాంతి బహుమతికి థెరిసాను ఎంపిక చేసినప్పుడు తనకా స్థాయి లేదని తిరస్కరించిన వ్యక్తిత్వం ఆమెది. ఆ తర్వాత ఎందరో బతిమాలగా, ఒత్తిడి తీసుకురాగా ఆ పురస్కారాన్ని అందుకోవడానికి అంగీకరించారు. అవార్డుల ద్వారా లభించే నగదును తన సేవా కార్యక్రమాలకే ఆమె వెచ్చించారు. అలాంటి సొమ్ముతోనే మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ నెలకొల్పి దాని ఆధ్వర్యంలో అనాథాశ్రమాలనూ, ఆస్పత్రులనూ, ధర్మశాలలనూ, ఆహారకేంద్రాలనూ ఏర్పాటుచేశారు. వేలాదిమందికి ఆరోగ్యం చేకూర్చడంతోపాటు వారికవసరమైన తిండి, బట్ట సమకూర్చారు. తనకు జీసస్‌పై నమ్మకం ఉన్నా దానికి అతీతంగా కుల మతాల ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరినీ తాను నిర్మించిన నిర్మల్ హృదయ్‌లో చేర్చుకున్న విశాల స్వభావం ఆమెది. నిత్యం ఈసడింపులు ఎదుర్కొంటూ, ఎన్నో అవమానాలను చవిచూస్తూ బతుకీడ్చేవారికి ఆపన్నహస్తం అందించడం, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం సామాన్యమైన విషయం కాదు. ఈ గడ్డపై జన్మించకపోయినా, దూరతీరాలనుంచి ఇక్కడికొచ్చినా ఈ దేశ ప్రజల కష్టాల్లో పాలుపంచుకొని, వారి కన్నీళ్లను తుడవడానికి మదర్ ప్రయత్నించారు. ఆమె సామాజిక సేవలో స్వార్ధమున్నదని, మతాన్ని వ్యాప్తి చేయడానికి దాన్ని సాధనంగా ఉపయోగించుకున్నారని విమర్శించినవారున్నారు. ఇలాంటి సేవా తత్పరత యధాతథ స్థితి కొనసాగటానికి మాత్రమే తోడ్పడుతుందన్నవారున్నారు. కానీ ఎలాంటివారైనా, వారి సిద్ధాంతాలు ఏవైనా... సేవాభావంతోనే జన హృదయాలను గెలవడం సాధ్యమన్న అంశాన్ని గ్రహించగలిగారు. మదర్ థెరిసా ఈ దేశంలో అడుగిడేనాటికి దాదాపుగా ఉనికిలో లేని స్వచ్ఛంద సంస్థలు ఈరోజు లక్షల్లో ఉండటమే దీనికి తార్కాణం. ప్రభుత్వం దృష్టి సోకని మారుమూల ప్రాంతాల్లో సైతం పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, అనాథాశ్రమాల వంటివి అంతో ఇంతో చురుగ్గా పనిచేస్తున్నాయంటే అది మదర్ థెరిసా పెట్టిన ఒరవడే. అంతటి మహనీయురాలికి సెయింట్‌హుడ్ లభించడం హర్షించదగింది. -
1998 సెప్టెంబర్ 5 నాకు మరుపురాని రాత్రి
కోలకత్తా: నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ ప్రకటించడం పట్ల కోలకత్తా దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ మోనికా బెస్రా (50) సంతోషం వ్యక్తం చేశారు. మానవతామూర్తి, ప్రపంచ శాంతిదూత మదర్ థెరిస్సా తనకు దైవంతో సమానమని ఆమె అభివర్ణించారు. తన అద్భుతమైన శక్తితో క్యాన్సర్ మహమ్మారి నుంచి తనకు విముక్తి కల్పించారని కొనియాడారు. 1998 సెప్టెంబర్ 5వ తేదీ తనకు మరుపురాని రాత్రి అని మోనికా బెస్రా తెలిపారు. మదర్ ఫోటోనూ చూస్తున్న సందర్భంగా... తెల్లటి కాంతి కిరణాలతో పాటు, అపురూపమైన వెలుగును దర్శించానని మోనికా బెస్రా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అద్భుతమైన శక్తి ఏదో తనను ఆవహించి స్పృహ కోల్పోయానన్నారు. మరుసటి ఉదయానికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి కణాలు నాశనమైపోయాయని బెర్సా తెలిపారు. నిజంగా ఇదొక మర్చిపోలేని అద్భుతమన్నారు. ఈ ఘటనతో మదర్ థెరిస్సాకు సెయిండ్ హుడ్ దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రాణాంతకమైన మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తికి పూర్తిగా ఆరోగ్యం వంతుడిని చేయడాన్ని మొదటి అద్భుతంగా, 17 ఏళ్లుగా ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నమోనికా బెస్రాకు స్వస్థత చేకూరడం రెండవ అద్భుతంగా గుర్తించారు. మదర్ థెరిస్సా తన అద్భుత దివ్యశక్తితో వీరిద్దరిని దీవించినట్లు పోప్ పేర్కొన్న విషయం విదితమే. తద్వారా ఆమెకు అద్భుతమైన దైవశక్తి ఉన్నట్టుగా అంగీకరించినట్టు తెలిపారు. 2016 సంవత్సరంలో మదర్ థెరిస్సా దైవదూతగా అవతరించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ను అధికారికంగా ప్రకటించనున్నట్లు ఇటలీకి చెందిన క్యాథలిక్ పత్రిక అవినైర్ ప్రచురించింన సంగతి తెలిసిందే. -
మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్
నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసాకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ను ప్రకటించనున్నారు. 2016 సంవత్సరంలో ఆమెను సెయింట్‌గా ప్రకటించేందుకు పోప్ ఫ్రాన్సిస్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అనాథలకు, వృద్ధులకు అందించిన అపురూపమైన సేవలతో ప్రపంచ శాంతిదూతగా పేరొందిన థెరిస్సా ఇక దైవదూతగా అవతరించనున్నారు. మదర్ థెరిస్సా శక్తులు అద్భుతమని ఫ్రాన్సిస్ కొనియాడినట్లు ఇటలీకి చెందిన క్యాథలిక్ పత్రిక అవినైర్ ప్రచురించింది. ప్రాణాంతక మెదడు వ్యాధితో బాధపడుతున్న ఓ బ్రెజిల్ వ్యక్తిని మదర్ థెరిస్సా తన అద్భుత దివ్యశక్తితో దీవించినట్లు పోప్ పేర్కొన్నారు. తద్వారా ఆమెకు అద్భుతమైన దైవశక్తి ఉన్నట్టుగా అంగీకరించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరిగే కార్యక్రమంలో మదర్ థెరిస్సాకు సెయింట్ వుడ్ హోదా అధికారికంగా ప్రకటిస్తారు. వాటికన్ సిటీ నిర్ణయంపై వివిధ క్రిష్టియన్ మత సంస్థలు, మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. క్రైస్తవ మిషనరీస్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' స్థాపనకు అనుమతి పొందారు. రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన సేవలందించారు. -
ఇద్దరు భారతీయులకు సెయింట్ హుడ్
హైదరాబాద్: ఇద్దరు భారతీయులకు సెయింట్ హుడ్ హోదా లభించింది. కేరళకు చెందిన ఫాదర్ కురియకోన్, సిస్టర్ యూఫ్రెషియాలకు ఈ గౌరవం దక్కింది. వాటికన్ సిటీలో ఆదివారం జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ హోదా ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఫాదర్ కురియకోన్, సిస్టర్ యూఫ్రెషియా విశేష సేవలకుగాను వారికి మరణాంతరం ఈ హోదా దక్కింది. -
ఇద్దరు పోప్‌లకు సెయింట్ హోదా
వాటికన్ సిటీ: పోప్ 23వ జాన్, పోప్ రెండో జాన్పాల్లకు సెయింట్ హోదాను కల్పిస్తూ పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ వారికి సెయింట్ హోదాతో అరుదైన గౌరవం కట్టబెట్టారు. వీరి పేర్లను ఇకపై సెయింట్ 23వ జాన్, సెయింట్ రెండో జాన్పాల్గా సంబోధిస్తారు. ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. రిటైర్డ్ పోప్ పదహారో బెనెడిక్ట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంతకుముందెప్పుడూ పోప్, రిటైర్డ్ పోప్లిద్దరూ ఇలాంటి బహిరంగ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రఖ్యాతి గాంచిన పోప్లను గౌరవించే కార్యక్రమాల్లో ఇద్దరు పోప్లు పాల్గొన్నదీ తక్కువే . అయితే కేథలిక్ చర్చి ఐక్యతను చాటేలా ఇద్దరు పోప్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోప్‌లకు సెయింట్ హోదాపై భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా చూడాలనేదానికి సంకేతంగా వీరి కలయిక నిలిచింది.