
తిరువనంతపురం: హిందూ కుటుంబంలో జన్మించి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన దేవసహాయం పిళ్లైకు సెయింట్ హుడ్ హోదా లభించనుంది. మతపరమైన కార్యకలాపాల్లో లేని ఒక సామాన్య భారతీయ క్యాథలిక్‌కు సెయింట్ హోదా దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేవసహాయంతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన మరో ఐదుగురికి సెయింట్ హుడ్ హోదా ఇవ్వనున్నట్లు ఇక్కడి చర్చి వర్గాలు బుధవారం వెల్లడించాయి.
వచ్చే ఏడాది మే 15వ తేదీన వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఈ ఆరుగురికి సెయింట్ హుడ్ హోదాను అధికారికంగా ప్రకటిస్తారు. హోదా ఇవ్వాలని మంగళవారం వాటికన్‌లో మతాధికారుల సమ్మేళనంలో నిర్ణయించారు. అప్పటి ట్రావన్‌కోర్ సంస్థానం పాలనలోని తమిళనాడు ప్రాంతంలో 1712, ఏప్రిల్ 23న నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు.
1745లో క్రైస్తవ మతాన్ని స్వీకరించాక తన పేరును లాజరస్‌గా మార్చుకున్నారు. ధనిక పేద తారతమ్యాలు లేకుండా సమాజంలో అందరికీ సమాన హోదా దక్కాలని ఆయన అభిలషించారు. ఇది ఆనాటి సమాజంలోని అగ్రవర్గాలకు నచ్చేది కాదు. దీంతో 1749లో పాలకులు ఆయనను నిర్బంధించారు. 1752 జనవరి 14న ఆయనను చంపేశారు.
Comments
Please login to add a commentAdd a comment