
తిరువనంతపురం: ఈ రోజుల్లో మూగ జీవులు పై ప్రేమ చూపించే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వాటిని రక్షించే వృత్తిలో మాత్రం తక్కువ మంది ఎంచుకుంటారు. ఇటువంటి వృత్తిని ఎంచుకోనే జాబితాలో జంతుప్రదర్శనశాలలో పనిచేసే వారు ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి. నిత్యం వాళ్ల ప్రాణాలకు తెగించి జంతువుల మధ్య పనిచేస్తారు. కొన్ని సార్లు అదే జంతువులకు బలైపోతారు. నిత్యం పాములకు పాలు పోసిన వ్యక్తే.. చివరకు అదే పాము కాటుకు గురై ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన కేరళలోని తిరువనంతపురం జంతుప్రదర్శనశాలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కట్టకడ తాలుకాలోని అంబూరి పంచాయతీకి చెందిన హర్షద్ గత నాలుగేళ్లుగా తిరువనంతపురం జూలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి పాముల సంరక్షణ బాధ్యతను అప్పగించారు. యథావిధిగా గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కోబ్రాలు ఉండే ప్రదేశం ఎన్‌క్లోజర్‌ను శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. హర్షద్ మూడు కోబ్రాలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రపరిచాడని.. ఈ క్రమంలో ఒక పాము హర్షద్ చేతిపై కాటు వేసినట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత కొంతసేపటికే హర్షద్ సృహతప్పి పడిపోయాడని.. వెంటనే తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు జూ అధికారి తెలిపారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment