reptiles
-
నాటి ప్రళయంలో అంతమవని ‘తొండ’!
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం.. ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొని ప్రళయం సంభవించింది. అప్పట్లో భూమిపై జీవిస్తున్న సరీసృపాల (పాకే జంతువులు)లో 83 శాతం వరకు అంతరించిపోయాయి. రాక్షస బల్లులూ అంతమయ్యాయి. కానీ తొండలా ఉండే ఓ జీవి మాత్రం ఆ పరిస్థితిని తట్టుకుని.. న్యూజిలాండ్, అర్జెంటీనా ప్రాంతాల్లో బతకగలిగింది. క్రమంగా అర్జెంటీనాలోనూ కనుమరుగైన ఆ జీవులు న్యూజిలాండ్‌లోని పలు ద్వీపాల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ జీవుల పేరు స్పినోడాన్.. న్యూజిలాండ్‌లో వాటిని టువాటరా అని పిలుస్తారు. అయితే ఇప్పుడు అమెరికా కేంద్రంగా వెలువడే సైన్స్ జర్నల్ ‘వెర్టిబ్రేట్ పేలియంటాలజీ’ కొత్త విషయాన్ని ప్రపంచం ముందుంచింది. నాటి ప్రళయం నుంచి తెలంగాణలోని నష్కల్ ప్రాంతంలోనూ స్పినోడాన్ బతికి నిలిచింది. సెప్టెంబర్ 26న తమ ఆన్లైన్ ఎడిషన్‌లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. వచ్చే నెలలో ఈ జర్నల్ ప్రింట్ ఎడిషన్ విడుదల కానుంది. వెన్నుపై ముళ్లలాంటి నిర్మాణాలతో.. చూడటానికి తొండలా కనిపించే స్పినోడాన్లు రింకోసెఫాలియా ప్రజాతికి చెందినవి. వీటికి మొసలిలాంటి తోక, మందమైన చర్మం, శరీరంపై పొలుసులు, తల నుంచి తోక చివరిదాకా పైభాగంలో ముళ్లలాంటి భాగాలు ఉంటాయి. కోట్ల ఏళ్లుగా పెద్దగా రూపాంతరం చెందకుండా ఉండటంతో వీటిని బతికున్న శిలాజాలు (లివింగ్ ఫాజిల్స్)గా అభివర్ణిస్తుంటారు. భూమిని భారీ గ్రహశకలం ఢీకొన్న తర్వాత న్యూజిలాండ్, అర్జెంటీనాలలో తప్ప మరెక్కడా ఈ ప్రజాతి జీవులు బతికిలేవని ఇంతకుముందు జరిగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ తెలంగాణలో వికారాబాద్‌కు సమీపంలోని నష్కల్‌లోనూ బతికాయని ఇటీవల గుర్తించారు. మరోసారి వార్తల్లోకి.. నష్కల్‌లో మూడు దశాబ్దాల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో పరిశోధనలు జరిగాయి. నాటి శాస్త్రవేత్తలు అనంతరామన్, చకిలం వేణుగోపాల్‌లతో కూడిన బృందం తవ్వకాలు జరిపి.. సరీసృపాలు, క్షీరదాలకు చెందిన ఎన్నో శిలాజాలను గుర్తించింది. అందులో సూక్ష్మ క్షీరదాల శిలాజాలు ఉన్నట్టు నిర్ధారించడంతో ప్రపంచ పరిశోధకుల దృష్టి నష్కల్పై పడింది. ఇప్పుడు మరో విశిష్టతనూ సొంతం చేసుకుంది. శిలాజాల్లోని ఓ జీవికి చెందిన దవడ, ఇతర భాగాలపై.. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జి.డీమర్ జూనియర్, గ్రెగరీ పి.విల్సన్ మాంటిల్లా, జెఫ్రీ ఎ.విల్సన్ మాంటిల్లాలతోపాటు మన దేశ శాస్త్రవేత్తలు ఎస్.అనంతరామన్, ఆర్.శివకుమార్, దిలీప్ చంద్ర దస్సారామ్లతో కూడిన బృందం పరిశోధనలు చేసింది. అది స్పినోడాన్ శిలాజమని, గ్రహశకలం ఢీకొన్న చాలా కాలం తర్వాతది అని తేల్చింది. అంటే గ్రహశకలం ఢీకొన్న తర్వాత కూడా ఈ ప్రాంతంలో స్పినోడాన్ జీవులు తిరుగాడినట్టు నిర్ధారించింది. శాస్త్రవేత్తలు దీనికి యాక్రా స్పినడాంటియాగా నామకరణం చేశారు. నష్కల్ ప్రాంతాన్ని కాపాడాలి నష్కల్ చాలా విలువైన ఆధారాన్ని అందించింది. ఇప్పుడు ప్రపంచ పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ పరిశోధనలు కొనసాగిస్తే మరెన్నో అద్భుత విషయాలను గుర్తించవచ్చు. ఇంత ముఖ్యమైన ప్రాంతాన్ని ప్రభుత్వం పరిరక్షించాలి. – చకిలం వేణుగోపాల్, ఆధారాలు సేకరించిన శాస్త్రవేత్తల బృందం సభ్యుడు -
ప్యాంటు చెక్ చేస్తే నిండా పాములు, బల్లులు.. అధికారులే షాక్!
వాషింగ్టన్: పాముల వంటి విష జీవులను తాకేందుకే భయంతో వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి తన దుస్తుల్లో దాచిపెట్టి వాటిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇటీవలే తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికా- మెక్సికో సరిహద్దులో వెలుగు చూసింది. 7,50,000 డాలర్ల విలువైన సరిసృపాల స్మగ్లింగ్‌లో భాగంగా ప్యాంటులో దాచిపెట్టి అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడికి రెండు దశాబ్దాలకిపైగా జైలు శిక్ష పడినట్లు వెల్లడించారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ అనే వ్యక్తి ఆరేళ్లలో 1,700 జంతువులను మెక్సికో, హాంకాంగ్‌ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసినట్లు చెప్పారు అధికారులు. నిరాటంకంగా సాగుతున్న అతడి అక్రమ రవాణా ఈ ఏడాది మార్చిలో బట్టబయలైంది. పాములు, బల్లులు వంటి వాటిని ప్యాంటులో దాచి మెక్సికో నుంచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అయితే, ముందు తన పెంపుడు బల్లులను తీసుకెళ్తున్నాని కస్టమ్స్ అధికారులకు తెలిపాడు. కానీ, అతడి దుస్తులు మొత్తం విప్పి పరిశీలించగా ప్యాంటులో 60 పాములు, బల్లుల వంటివి బయపడినట్లు అధికారులు తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా తన స్మగ్లింగ్‌పై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు నిందితుడు జోస్ పెరెజ్. కొన్నిసార్లు గాడిదలపై తరలించేందుకు డబ్బులు చెల్లించానని, ఇతర సమయాల్లో తానే సరిహద్దులు దాటానని ఒప్పుకున్నాడు. అతడు అక్రమ రవాణా చేసి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తన ఖాతాదారులకు సుమారు 7,39,000 డాలర్లకు సరిసృపాలను విక్రయించినట్లు పత్రాలు సమర్పించారు అధికారులు. అందులో యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. రెండు కేసుల్లో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇదీ చదవండి: ప్రపంచం చుట్టేశాడు.. రెండు గిన్నిస్ రికార్డులు పట్టేశాడు -
డ్రైవర్ వింత ప్రవర్తన.. ప్యాంటు, జాకెట్‌ను చెక్ చేస్తే 9 పాములు, 43 బల్లులు
కాలిఫోర్నియాలోని అమెరికా సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తి దుస్తుల్లో ఏకంగా 52 బల్లులు, పాములు బయటపడటంతో బోర్డర్ అధికారులు షాక్‌కి గురయ్యారు. వివరాల ప్రకారం.. మెక్సికో సరిహద్దుల్లో ఉన్న శాన్సిడ్రో సరిహద్దు వద్దకు ఓ వ్యక్తి ట్రక్కుతో వచ్చాడు. అయితే తనిఖీల్లో భాగంగా అధికారులు అతన్ని బయటకు పిలిచారు. ఈ క్రమంలో అతని ప్రవర్తన వింతగా ఉండేసరికి అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేసేసరికి అసలు బాగోతమంతా బయటపడింది. (చదవండి: యుద్దం ఎఫెక్ట్.. దేశం వీడుతున్న ప్రేయసి.. లవ్ ప్రపోజ్ చేసిన ఉక్రెయిన్ సైనికుడు.. వీడియో వైరల్ ) అతను ఏకంగా 52 సరీసృపాలను చిన్న చిన్న సంచుల్లో దాచి సరఫరా చేసేందుకు ప్రయత్నించాడు. 9 పాములు, 43 అరుదైన బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి వేసుకున్న జాకెట్, ప్యాంటు పాకెట్లు, ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ వాటిని దాచిపెట్టుకుని సరిహద్దు దాటేందుకు ప్రయత్నించబోయాడు. అతను తరలిస్తున్న వాటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. "స్మగ్లర్లు ఇలాంటి వాటిని సరఫరా చేసేందుకు రకరకాల దారులు ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు. -
Stegosaurus: గుడ్డు నుంచి ఆకాశానికి..
అవతార్ సినిమా చూశారా.. అందులో హీరో, హీరోయిన్ భారీ సరీసృపాల మీద స్వారీ చేస్తూ గాల్లో తేలిపోతుంటారు. ఆ వింత ఆకారం జేమ్స్ కామెరాన్ అద్భుతసృష్టి. కానీ నిజంగా అలాంటి జీవులు ఉండేవని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిపై మనుషులు ఎగిరారో.. లేదో.. తెలియదు కానీ అంత భారీ సరీసృపాలు జీవించింది మాత్రం వాస్తవం. 10 మీటర్లకు పైగా రెక్కలతో ఆకాశాన్ని శాసించిన ఆ సరీసృపం పేరు.. స్టెరోసార్స్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పాలియోంటాలజీకి చెందిన కెవిన్ పాడియన్తో పాటు మరికొందరు శాస్త్రవేత్తలు కొన్ని భారీ శిలాజాలపై శాస్త్రీయ అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. దాదాపు 228 మిలియన్ సంవత్సరాల క్రితం జీవం పోసుకున్న ఈ స్టెరోసార్స్.. 66 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. ఇవి అత్యంత పురాతన ఎరిగే సరీసృపాలు. డైనోసార్లు జీవించిన కాలంలోనే ఇవి మనుగడసాగించాయి. ఇవి గుడ్లను పెట్టి పొదుగుతాయి. స్టెరోసార్స్ను ఎగిరే డైనోసార్లు అని అంటారు. అయితే ప్రారంభం దశలో ఇవి ఎలా జీవనం సాగించాయో ఇప్పటికీ చాలా మంది శాస్త్రవేత్తలకు తెలియదట. గుడ్డు నుంచి ఆకాశానికి.. ఏ పక్షి అయినా పుట్టగానే ఎగరలేదు.. కొద్ది రోజుల తర్వాత రెక్కలు బలపడి గాలిలోకి ఎగురుతుంది.. ఇదీ మనకు తెలిసిందే. కానీ.. పుట్టిన వెంటనే ఎగిరే పక్షి ఈ స్టెరోసార్స్. అలా.. ఇలా.. కాదు.. తల్లితో సమానంగా.. ఒకదశలో తల్లి కంటే సౌకర్యవంతంగా ఆకాశమార్గాన ప్రయాణిస్తుంది. గాలితో నిండి ఉండే ఆస్థికలు... స్టెరోసార్స్ శరీర నిర్మాణమే పుట్టగానే ఎగిరేందుకు సాయం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పిండాలు, పిల్లలు, పెద్ద జీవుల్లో ఆస్థికలను పోల్చి పరిశోధన చేశారు. దీని ఆస్థికలు బలంగా ఉండి.. గాలితో నిండి ఉంటాయి. పిల్ల సరీసృపాలు పెద్ద వాటి కంటే చురుకుగా ఎరగగలుగుతాయి. రెక్కలు చిన్నగా ఉన్నా.. విస్తృతంగా ఉండటంతో చిన్నవి పెద్ద వాటి కంటే సులభంగా గమ్యాన్ని మార్చుకోగలవు. వేగాన్ని నియంత్రించుకోగలవు. అయితే పెద్దవి ప్రయాణించినంత దూరం ఇవి ఏకదాటిగా వెళ్లలేవు. పిల్ల స్టెరోసార్స్కు ఇతర ప్రాణుల నుంచి ముప్పు తప్పేదికాదు. పుట్టగానే ఎగడరం.. ఇతర ప్రాణుల నుంచి రక్షణ పొందడం కోసం వీటికి ఉపయోగపడేదని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇతర ప్రాణాల నుంచి రక్షణకే కాదు.. దట్టమైన అడవులను దాటడానికి ఈ బలమైన రెక్కలు వినియోగపడేవి. ఇక, డైనోసార్ల కాలంలో ఇలాంటి భారీ జీవులు చాలానే ఉన్నాయని గుర్తించారు. మొసళ్లు, ప్లీసియోసార్ లాంటి మనుగడసాగించేవి. ఆ కాలాన్ని మెసోజాయిక్ శకంగా పేర్కొంటారు. ఆ శకం నాటి 100 కంటే ఎక్కువ జాతుల శిలాజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ అవశేషాలను పరిశీలించగా హృదయ విధారక విషయాలు తెలిశాయి. ఆ జీవుల్లో కొన్ని కేవలం తినడానికి తిండిలేక మరణించాయని గుర్తించారు. ప్లీసియోసార్కు పొడవాటి మెడ ఉండి.. డజన్ల కొద్దీ ఎముకలు ఉంటాయి. పెంగి్వన్కు ఉన్నట్లు ఉండే పొడవైన ఫ్లిప్పర్లు ఈదడానికి తోడ్పడతాయి. ప్లీసియోసార్లకు త్రిమింగలం లాంటి మోసాసార్ల నుంచి ముప్పు ఉండేది. అవి వీటిని వేటాడి తినేవి. ఈ మోసాసార్లను సముద్ర రాక్షసులుగా పిలుస్తారని పరిశోధకులు వివరించారు. స్టెరోసార్స్ బతికి ఉంటే.. మనిషి వాటికి కచి్చతంగా ‘అవతార్’ చూపించేవాడు. మలేయా పక్షి కూడా ఇంతే.. గుడ్డు పొదిగి పిల్ల బయటికి వచ్చిన వెంటనే ఎగిరే పక్షులు ఆధునిక శకంలోనూ లేవు. అయితే మలేయా అనే కోడి లాంటి పక్షికి మాత్రం ఇది మినహాయింపు. ఇండోనేషియా ద్వీపాల్లో నివసించే ఈ పక్షి కూడా గుడ్డులోంచి బయటకు రాగానే ఎగరగలుగుతుంది. తమను తాము రక్షించుకోవడం కోసమే వాటి శరీర నిర్మాణం అలా ఉంటుందని పాడియన్ పేర్కొన్నారు. -
పాములకు పాలు పోసి పెంచాడు.. చివరకు కోబ్రా కాటుకే బలయ్యాడు
తిరువనంతపురం: ఈ రోజుల్లో మూగ జీవులు పై ప్రేమ చూపించే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వాటిని రక్షించే వృత్తిలో మాత్రం తక్కువ మంది ఎంచుకుంటారు. ఇటువంటి వృత్తిని ఎంచుకోనే జాబితాలో జంతుప్రదర్శనశాలలో పనిచేసే వారు ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి. నిత్యం వాళ్ల ప్రాణాలకు తెగించి జంతువుల మధ్య పనిచేస్తారు. కొన్ని సార్లు అదే జంతువులకు బలైపోతారు. నిత్యం పాములకు పాలు పోసిన వ్యక్తే.. చివరకు అదే పాము కాటుకు గురై ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన కేరళలోని తిరువనంతపురం జంతుప్రదర్శనశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కట్టకడ తాలుకాలోని అంబూరి పంచాయతీకి చెందిన హర్షద్ గత నాలుగేళ్లుగా తిరువనంతపురం జూలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి పాముల సంరక్షణ బాధ్యతను అప్పగించారు. యథావిధిగా గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కోబ్రాలు ఉండే ప్రదేశం ఎన్క్లోజర్ను శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. హర్షద్ మూడు కోబ్రాలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రపరిచాడని.. ఈ క్రమంలో ఒక పాము హర్షద్ చేతిపై కాటు వేసినట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత కొంతసేపటికే హర్షద్ సృహతప్పి పడిపోయాడని.. వెంటనే తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు జూ అధికారి తెలిపారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు. -
ఎంత బుల్లిగా ఉన్నావే.. ‘బ్రూకీసియా నానా’
ఈ ప్రపంచంలో అత్యంత చిన్నగా లేదా పెద్దగా ఉండే వస్తువులకైనా.. జీవులకైనా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కోవకు చెందిన అతి చిన్న ఊసరవెల్లిని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మడగాస్కర్‌లో అత్యంత తక్కువ పరిమాణంలో ఉన్న మగ ఊసరవెల్లి ఒకదానిని జర్మనీ, మలగాసేకు చెందిన పరిశోధనా బృందం కనుగొంది. చాలా చిన్నగా ఉన్న ఈ ఊసరవెల్లి ప్రపంచంలోని అతి చిన్న సరీసృపంగా గుర్తింపు పొందింది. ఊసరవెల్లి ముక్కు నుంచి చివరి వరకు అర అంగుళం (13.5 ఎంఎం) మాత్రమే ఉంది. ఇది మన వేలి కొనమీద నిలబడితే చిన్న బొమ్మలా కనిపిస్తుంది. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఊసరవెల్లికి ‘బ్రూకీసియా నానా’గా నామకరణం చేశారు. తోకతో కలిపి కొలిస్తే ఈ ఊసరవెల్లి కేవలం 22 ఎంఎం(మిలీమీటర్లు) మాత్రమే ఉంది. అయితే ఈ జాతిలో ఆడ ఊసరవెల్లి తోకతో కలిపి కొలిస్తే 29 ఎంఎంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మైక్రో సిటీ స్కాన్స్, త్రీడైమెన్షనల్ ఎక్స్‌రేస్ సాయంతో ఆడ ఊసరవెల్లిలో రెండు గుడ్లు గుర్తించినట్లు వివరించారు. ఇప్పటిదాక గుర్తించిన 51 ఇతర రకాల ఊసరవెల్లులతో పోలిస్తే ఇదే అత్యంత చిన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. మడగాస్కర్ అరుదైన ప్రాణులకు ఆవాసమని, ఇప్పటిదాక ఈ ప్రాంతంలో 200కు పైగా జాతులను కనుగొన్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎంతో బుజ్జిగా ఉన్న ఈ బుల్లి ఊసరవెల్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. -
భూమ్మీద అదే అతి ప్రమాదకరమైన ప్రదేశం!
దాదాపు మిలియన్ సంవత్సరాల నుంచి మానవులు భూమిపై నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే లేవు. భూమిపై లోతైనా సముద్రాలు, పోడవైన నదులు, ఎతైనా పర్వతాలు వాటి పుర్వొత్తారాల గురించి అందరికి తెలుసు. కానీ మనం నివసించే ఈ భూమిపై ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ ప్రదేశం ఎక్కడుంది.. ఎందుకు అది అంత భయంకరమైన ప్రదేశమైందో ఇంగ్లాండ్ పాలియోంటాలజిస్టు(శిలాజాల అధ్యయనం, భూమిపై జీవ పరిమాణం) శాస్త్రవేత్తలు ఇటివల ఆధ్యయనం చేసి అధికారికంగా ప్రకటించారు. పోర్ట్స్మౌత్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాకు చెందిన ఏజ్ ఆఫ్ డైనోసార్ల శిలాజాలపై ఇటీవల పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో 100 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను వారు సమీక్షించగా ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్నేయ మొరాకోలోని క్రెటేషియస్ శిలల ప్రదేశాలలో పరిశోధనలు జరిపిన వారికి అక్కడ ఎగిరే సరీసృపాలు, మొసళ్లతో పాటు భయంకరమైన మాంసాహార నీటి జంతువుల శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రదేశాన్ని కెమ్ కెమ్ గ్రూప్ అని కూడా పిలుస్తారని, ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఎండిన భూమిగా ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు విస్తృతమైన నదీ వ్యవస్థను కలిగి ఉండేదని కూడా వెల్లడించారు. అంతేగాక ఈ నది వ్యవస్థ చుట్టూ వివిధ రకాల జల, భూసంబంధమైన జంతువులు నివసించేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక దీనిపై డెట్రాయిట్ మెర్సీ విశ్వవిద్యాలయం పరిశోధకుడు, బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిజార్ ఇబ్రహీం పుస్తకం కూడా రచించించారు. దీని ప్రకారం ఈ ప్రదేశం కెమ్ కెమ్ గ్రూప్‌కు చెందినదని, ఇక్కడ అతిపెద్ద డైనోసార్లు నివసించేవని తెలిపారు. వాటితో పాటు సాబెర్-టూత్ కార్చరోడోంటోసారస్, టెరోసార్స్ వంటి భయంకరమైన మొసళ్లు, ఎగిరే సరిసృపాలు నీటి వేట జంతువులు నివసించేవని వెల్లడించారు. అంతేగాక ఇది ఒక గ్రహమని, భూమిపై ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పుస్తకంలో పేర్కొన్నాడు. ఇక ఇక్కడ మానవులు జీవించినప్పటికీ.. భయంకరమైన సరిసృపాల వేట వల్ల ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేక పోయారని కూడా చెప్పారు. -
అమ్మో.. ఇంతటి రాక్షసత్వమా!
ముంబయి: మూగజీవాల కోసం నిత్యం పోరాడే పెటా ఓ సంచలన వీడియోను విడుదల చేసింది. థాయిలాండ్‌లో లెదర్ కంపెనీలు పాల్పడుతున్న దాష్టీకాలకు అద్ధం పట్టేలా ఆ వీడియోను రూపొందించింది. అందమైన అబద్ధాల వెనుక అతి భయంకరమైన నిజాలు ఉన్నాయని ఆ వీడియోలో చెప్పకనే చెప్పింది. ఈ వీడియోను అలా విడుదల చేసిన క్షణాల్లోనే దాదాపు 50 మిలియన్ల మంది వీక్షించారంటే అర్థం చేసుకోవచ్చు. థాయిలాండ్ లెదర్ గూడ్స్‌కు పెట్టింది పేరు. ఇక్కడ పాములు, ముసళ్ల చర్మాలతో బ్యాగులు, షూస్, బెల్టులు, కోట్లు తదితర వస్తువులు తయారు చేస్తుంటారు. వాస్తవానికి ఇది ఎంతటి దారుణమైన చర్యనో.. దీని వెనుక ఎన్ని మూగజీవాలను బతికుండగానే బలిచేస్తున్నారో అంశాన్ని.. థాయిలాండ్‌లో జరుగుతున్న లెదర్ మాఫియాను రచ్చకీడ్చేలా ఆసియా ప్రాంతానికి చెందిన పెటా సంస్థ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఎంత భయంకరంగా ఉందంటే.. పలువురు వ్యక్తులు షాపింగ్ కోసమని లగ్జరీ లెదర్ మాల్ కు వెళతారు. అక్కడ పాము, ముసళ్ల చర్మాలతో తయారు చేసిన ఎన్నో అందమైన వస్తువులు దర్శనమిస్తాయి. కొంతమంది అక్కడి షూలను ట్రై చేస్తుంటారు. ఆ తర్వాత ఒకసారి ఆ బ్యాగులను చూద్దామని ఓపెన్ చేసి చూడగానే అందులో రక్తంతో నిండి ఉన్న ముసలి లోపలి భాగం దర్శనం ఇవ్వడంతోపాటు.. అందులో గుండె రక్తంలోనే కొట్టుకుంటూ ఉంటుంది. ఇలా ప్రతి వస్తువును ఓపెన్ చేసి చూడగా అదే దృశ్యం దర్శనమిస్తుంది. ఒక మహిళ తాను వేసుకున్న షూ విప్పగా రక్తం కనిపిస్తుంది. అంటే అంతటి అందమైన వస్తువుల వెనుక అన్ని మూగజీవాలను బతికుండగానే దారుణంగా హత్య చేసి వ్యక్తుల స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని చెప్పడం ఆ వీడియో ఉద్దేశం. 'ప్రతి సంవతర్సరం వందల మొసళ్లను అత్యంత దారుణంగా చంపుతూ అవి ఊపిరితో ఉండగానే వాటి చర్మాన్ని చీలుస్తూ లగ్జరీ వస్తువుల కోసం ఉపయోగిస్తున్నారు' అని పెటా ఇండియా ముఖ్య కార్యదర్శి పూర్వా జోషిపురా చెప్పారు. అందుకే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వీడియోను విడుదల చేసినట్లు చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో మొసళ్ల పెంపకం నిర్వహిస్తున్న దేశంగా థాయిలాండ్ ఉంది. దాదాపు ఏడు లక్షల మొసళ్లను వారు పెంచుతున్నారు. అది కూడా కేవలం లెదర్ లగ్జరీ వస్తువుల ఉత్పత్తి కోసమే. -
అన్నింటికీ ‘మూల’కణం..!
మూలకణ చికిత్సలో నవశకం.. కొత్త అవయవాలు సృష్టించే అవకాశం అవయవాలు కోల్పోయిన వారికి వరం.. ఎలుకలపై పరిశోధనలు విజయవంతం వచ్చే ఏడాది మానవులపై ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: బల్లి తోక తెగిపోతే ఏమవుతుంది.. తిరిగి కొంత కాలానికి పెరుగుతుంది. ఆటోటోమి అనే ఈ ప్రక్రియ సరీసృపాలు, కొన్ని జాతుల ఉభయచరాల్లో సర్వసాధారణం. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు వీటిల్లో ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే ఏదైనా ప్రమాదంలో మనుషులు అవయవాలు కోల్పోతే కృత్రిమ అవయవాలను అమర్చుకోవాల్సిందే. అయితే వారికి కూడా బల్లుల మాదిరిగానే కోల్పోయిన అవయవాలు తిరిగి వస్తే.. ఇది నిజంగా వారికి ఓ వరం లాంటిదే. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై ఈ మేరకు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలనిచ్చాయి. ఎముక, కొవ్వు కణాలను మూలకణాలుగా మార్చడం ద్వారా కొత్త అవయవాలు పెరిగేలా చేయొచ్చని వారు నిరూపించారు. త్వరలోనే మానవులపై ప్రయోగాలు చేసి అవయవాలు కోల్పోయిన వారికి శుభవార్త చెబుతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే కనుక నిజమైతే అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్లవుతారు. మూల కణాలంటే..? పిండస్థ దశలో ఉండే మూల కణాల నుంచే శిశువు వివిధ శరీర భాగాలు ఏర్పడతాయి. పెద్ద పెరిగిన తర్వాత కూడా ఈ మూల కణాలు ఉంటాయి. అయితే ఒక్కో అవయవంలో దానికి సంబంధించినవే ఉంటాయి. ఆ అవయవంలోని కణాలు కానీ, కణజాలం కాదెబ్బ తింటే తిరిగి పెరిగేందుకు పెద్దల మూల కణాలు దోహదపడుతాయి. అంటే ఈ కణాలు కేవలం సంబంధిత అవయవ కణాలుగానే వృద్ధి చెందగలవు. అయితే ఈ పెద్దల మూల కణాలను కూడా పిండ కణాలుగా మార్చేయొచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ శాస్త్రవేత్తలు నిరూపించారు. మానవుని కొవ్వు కణాల నుంచి వేరు చేసిన మూలకణాలను పిండంలోని మూల కణాల మాదిరిగా మార్చి ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. దీంతో ఎలుకల్లో దెబ్బ తిన్న కణజాలం స్థానంలో కొత్తది ఏర్పడటం గుర్తించినట్లు పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాన్ పిమాండా తెలిపారు. తెగిపోయిన బల్లుల తోకల స్థానంలో ఈప్రక్రియ ద్వారానే కొత్త తోకలు ఏర్పడతాయని ఆయన వివరించారు. వచ్చే ఏడాది చివరిలో మానవులపై చేపట్టే ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స అందజేయొచ్చని పేర్కొన్నారు. గుండె కణాలు, నాడీ కణాలు, వెన్నుముక వంటి కీలకమైనవి దెబ్బ తిన్నపుడు వాటిని ఈ ప్రక్రియ ద్వారా పునరుద్ధరించొచ్చని చెప్పారు.