అమ్మో.. ఇంతటి రాక్షసత్వమా!
ముంబయి: మూగజీవాల కోసం నిత్యం పోరాడే పెటా ఓ సంచలన వీడియోను విడుదల చేసింది. థాయిలాండ్లో లెదర్ కంపెనీలు పాల్పడుతున్న దాష్టీకాలకు అద్ధం పట్టేలా ఆ వీడియోను రూపొందించింది. అందమైన అబద్ధాల వెనుక అతి భయంకరమైన నిజాలు ఉన్నాయని ఆ వీడియోలో చెప్పకనే చెప్పింది. ఈ వీడియోను అలా విడుదల చేసిన క్షణాల్లోనే దాదాపు 50 మిలియన్ల మంది వీక్షించారంటే అర్థం చేసుకోవచ్చు. థాయిలాండ్ లెదర్ గూడ్స్కు పెట్టింది పేరు. ఇక్కడ పాములు, ముసళ్ల చర్మాలతో బ్యాగులు, షూస్, బెల్టులు, కోట్లు తదితర వస్తువులు తయారు చేస్తుంటారు.
వాస్తవానికి ఇది ఎంతటి దారుణమైన చర్యనో.. దీని వెనుక ఎన్ని మూగజీవాలను బతికుండగానే బలిచేస్తున్నారో అంశాన్ని.. థాయిలాండ్లో జరుగుతున్న లెదర్ మాఫియాను రచ్చకీడ్చేలా ఆసియా ప్రాంతానికి చెందిన పెటా సంస్థ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఎంత భయంకరంగా ఉందంటే.. పలువురు వ్యక్తులు షాపింగ్ కోసమని లగ్జరీ లెదర్ మాల్ కు వెళతారు. అక్కడ పాము, ముసళ్ల చర్మాలతో తయారు చేసిన ఎన్నో అందమైన వస్తువులు దర్శనమిస్తాయి. కొంతమంది అక్కడి షూలను ట్రై చేస్తుంటారు.
ఆ తర్వాత ఒకసారి ఆ బ్యాగులను చూద్దామని ఓపెన్ చేసి చూడగానే అందులో రక్తంతో నిండి ఉన్న ముసలి లోపలి భాగం దర్శనం ఇవ్వడంతోపాటు.. అందులో గుండె రక్తంలోనే కొట్టుకుంటూ ఉంటుంది. ఇలా ప్రతి వస్తువును ఓపెన్ చేసి చూడగా అదే దృశ్యం దర్శనమిస్తుంది. ఒక మహిళ తాను వేసుకున్న షూ విప్పగా రక్తం కనిపిస్తుంది. అంటే అంతటి అందమైన వస్తువుల వెనుక అన్ని మూగజీవాలను బతికుండగానే దారుణంగా హత్య చేసి వ్యక్తుల స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని చెప్పడం ఆ వీడియో ఉద్దేశం.
'ప్రతి సంవతర్సరం వందల మొసళ్లను అత్యంత దారుణంగా చంపుతూ అవి ఊపిరితో ఉండగానే వాటి చర్మాన్ని చీలుస్తూ లగ్జరీ వస్తువుల కోసం ఉపయోగిస్తున్నారు' అని పెటా ఇండియా ముఖ్య కార్యదర్శి పూర్వా జోషిపురా చెప్పారు. అందుకే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వీడియోను విడుదల చేసినట్లు చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో మొసళ్ల పెంపకం నిర్వహిస్తున్న దేశంగా థాయిలాండ్ ఉంది. దాదాపు ఏడు లక్షల మొసళ్లను వారు పెంచుతున్నారు. అది కూడా కేవలం లెదర్ లగ్జరీ వస్తువుల ఉత్పత్తి కోసమే.