ఆర్యా రాజేంద్రన్ (ఫైల్‌ఫోటో)
తిరువనంతపురం\: వయసు కేవలం 21 సంవత్సరాలు. చదువుతున్నది బీఎస్సీ రెండో సంవత్సరం. దక్కిన పదవి కీలకమైన నగరానికి మేయర్. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ అనే విద్యార్థిని పేరు ఖరారైంది. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం తిరువనంతపురంలోని అల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సెకండియర్ చదువుతున్నారు. సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీపీఎం చిన్నారుల విభాగమైన బాలసంఘం కేరళ రాష్ట్ర అధ్యక్షురాలిగానూ పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవన్‌ముగళ్ వార్డు కౌన్సిలర్‌గా సీపీఎం టికెట్‌పై పోటీ చేశారు.
కేరళలో స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. తిరువనంతపురం ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. దీంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది. అయితే, మేయర్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఓడిపోయారు. ఆర్య రాజేంద్రన్ పేరును సీపీఎం జిల్లా నేతలు తెరపైకి తీసుకు రాగా అగ్ర నాయకత్వం అంగీకరించింది. దీంతో ఆర్య రాజేంద్రన్ మేయర్ పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ అప్పగించిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తానని ఆమె చెప్పారు. ప్రజలకు సేవ చేయడంతోపాటు తన చదువును కొనసాగిస్తానని తెలిపారు. ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్, తల్లి ఎల్‌ఐసీ ఏజెంట్.
ఇప్పటిదాకా రికార్డు తెలుగమ్మాయి పేరిటే..
దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా రికార్డు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య పేరిట ఉంది. ఆమె 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌టిక్కెట్‌పై పోటీ చేశారు. 26 ఏళ్ల వయసులోనే మేయర్‌గా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment