విశ్వజనని | Sainthood to Mother Teresa | Sakshi
Sakshi News home page

విశ్వజనని

Published Mon, Sep 5 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

విశ్వజనని

విశ్వజనని

మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ హోదా ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్
ఆమె సేవాతత్పరతకు అందిన గౌరవం అన్న పోప్
 
 వాటికన్ సిటీలో అంగరంగ వైభవంగా కార్యక్రమం
- వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవ మత పెద్దలు, అభిమానులు..
- హాజరైన 13 దేశాల అధినేతలు.. కోల్‌కతాలో పండుగ వాతావరణం
- సంప్రదాయాలను తోసిరాజని స్క్రీన్లకు అతుక్కుపోయిన నన్స్
- గంటలు మోగిస్తూ, చప్పట్లు చరుస్తూ హర్షాతిరేకాలు
 
 ఎక్కడో మేసిడోనియాలో కళ్లు తెరిచింది..
ప్రేమే ధర్మం.. సేవే మార్గమంటూ కదిలింది..
పేదలు, దీనులను అక్కున చేర్చుకుంది..
విశ్వజననిగా మానవత్వాన్ని పరిమళింపజేసింది..
87 ఏళ్ల వయసులో ఆ కళ్లు మూతపడ్డాయి..
19 ఏళ్ల తర్వాత.. నేడు..
ఆ కళ్లు మళ్లీ ‘తెరుచుకున్నాయి’..
కళ్ల నిండా విశ్వప్రేమను వర్షిస్తూ..
మానవత్వంలోనే ‘దైవత్వం’ ఉందని చాటిచెబుతూ..
 
 థెరిసా ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నాకు వాళ్ల (పేదలు) భాష రాకపోవచ్చు. కానీ వారి ముఖాలపై చిరునవ్వు విరిసేలా చేయగలను అనేవారు. ఆ చిరునవ్వులను మన హృదయాల్లో నింపుకుందాం. మన జీవన ప్రయాణంలో లక్షలాది దీనులకు వాటిని పంచుదాం.  
 - పోప్
 
 వాటికన్ సిటీ/కోల్‌కతా: మానవ సేవకు తన జీవితాన్ని అంకితం చేసి, క్రీస్తు ప్రేమ సందేశాన్ని లోకానికి చాటిచెప్పిన మానవతామూర్తి మదర్ థెరిసాకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ హోదా ప్రకటించారు.  ఆదివారం రోమ్‌లోని వాటికన్ సిటీలో ప్రపంచం నలుమూలల నుంచి తరలి వచ్చిన క్రైస్తవ మతపెద్దలు, వేలాది మంది యాత్రికులు, 13 దేశాలకు చెందిన అధినేతలు,  థెరిసా ఆర్డర్‌కు చెందిన నన్స్ మధ్య ఈ మేరకు ప్రకటన చేశారు. ఇది మూర్తీభవించిన మాతృప్రేమకు, అనాథలను, పేదలను అక్కున చేర్చుకున్న సేవాతత్పరతకు అందిస్తున్న గౌరవమని పేర్కొన్నారు. ‘‘ఆమె పవిత్ర హృదయం మాకు అత్యంత సమీపంలో ఉంది. నిర్మలమైన ఆమె మనసును తలచుకున్నప్పుడల్లా మా గుండెలోతుల్లోంచి ‘మదర్’ అని వినిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన థెరిసాను నేటి నుంచి సెయింట్స్ జాబితాలో చేరుస్తున్నాం..’’ అని భావోద్వేగంతో అన్నారు.

పేదరికాన్ని సృష్టిస్తున్న ఈ ప్రపంచ దేశాల నాయకుల నేరాన్ని పేద గొంతుల తరఫున థెరిసా వినిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో వినిపించాల్సిన సందేశాన్ని ముందుగానే రాతపూర్వకంగా రూపొంది స్తారు. అయితే అందులో ఈ విషయాలు పేర్కొనకపోయినా పోప్ ఫ్రాన్సిన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మదర్ గొప్పతనాన్ని కొనియాడారు. మదర్ థెరిసా దైవానికి అత్యంత సమీపంలో ఉందనడానికి.. భారత్‌లోని కోల్‌కతా మురికివాడల్లో నిరుపేదలకు చేసిన సేవలే నిదర్శనమన్నారు. ‘‘ఆమె ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ‘నాకు వాళ్ల(పేదలు) భాష రాకపోవచ్చు. కానీ వారి ముఖాలపై చిరునవ్వు విరిసేలా చేయగలను’ అని థెరిసా అనేవారు. ఆ చిరునవ్వులను మన హృదయాల్లో నింపుకుందాం. మన జీవన ప్రయాణంలో లక్షలాది దీనులకు వాటిని పంచుదాం’’ అని అన్నారు. గర్భస్థ శిశువులు ఈ లోకంలో అత్యంత బలహీనమైన వారని, అబార్షన్లతో వారిని చంపేయడాన్ని థెరిసా తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సెయింట్‌హుడ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ టాప్‌లెస్ జీప్‌లో సెయింట్‌పీటర్స్ స్క్వేర్‌లో తిరుగుతూ వేలాది మంది అభిమానులకు అభివాదం చేశారు.

 కోల్‌కతాలో పండగ వాతావరణం
 వాటికన్ సిటీలో మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ ప్రకటిస్తున్న సమయంలో ఆమె కార్యక్షేత్రమైన కోల్‌కతాలో పండగ వాతావరణం కనిపించింది. నగరంలో అనేకచోట్ల పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటికన్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇక  థెరిసా సేవా కార్యక్రమాలకు హెడ్‌క్వార్టర్‌గా ఉన్న మదర్‌హౌస్‌లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. సాధారణంగా భావోద్వేగాలకు అతీతంగా, ప్రశాంత వదనాలతో కనిపించే నన్స్ ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండే సిస్టర్స్ అంతా స్క్రీన్ల ముందు వాలిపోయి వాటికన్‌లో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆనందంతో పెద్దగా అరుస్తూ, చప్పట్లు చరుస్తూ, గంటలు మోగిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. మదర్‌హౌస్ ముందు థెరిసా నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచారు. పూలు, విద్యుద్దీపాలు, థెరిసా చిత్రపటాలతో భవనాన్ని అలంకరించారు. సందర్శకులకు వీలుగా రోజంతా మదర్‌హౌస్‌ను తెరిచి ఉంచారు. ఉదయం 6 గంటలకే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనేక మంది విదేశీయులు కూడా మదర్‌హౌస్‌కు తరలివచ్చారు. థెరిసా సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.

 మానవ సేవే మాధవ సేవగా..
 1910 ఆగస్ట్ 26న మేసిడోనియాలోని స్కోప్జేలో జన్మించిన థెరిసా నన్‌గా మారి తన సేవా కార్యక్రమాలకు కోల్‌కతాను కేంద్రంగా చేసుకున్నారు. దీనులు, అన్నార్థులు, రోగపీడితులు, అనాథలను అక్కున చేర్చుకొని ఆదరించింది. 1931 నుంచి 1997 సెప్టెంబర్ 5న కన్ను మూసేవరకు కోల్‌కతాలోనే సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. 1997లో ఆమెను పవిత్రమూర్తి (బీటిఫికేషన్)గా గుర్తించే ప్రక్రియ మొదలైంది. మదర్ థెరిసా మరణానంతరం జరిగిన రెండు అద్భుతాల(1998లో ఒకటి, 2008లో మరొకటి)ను ధ్రువీకరించుకున్న తర్వాత థెరిసాకు.. ఆమె 19వ వర్ధంతి సందర్భంగా రోమన్ కేథలిక్ చర్చి సెయింట్‌హుడ్ హోదాతో గౌరవించింది.
 
 ఆమె ఆదర్శాలను అలవర్చుకుందాం..
 సెయింట్‌హుడ్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ఎందరో క్రైస్తవ మత పెద్దలు, థెరిసా అభిమానులు తరలివచ్చారు. ఇటలీలో థెరిసా ఆర్డర్‌కు చెందిన 1,500 మంది ఇళ్లు లేని నిరుపేదలను పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి వీఐపీ సీట్లు కేటాయించి ముందు వరుసలో కూర్చోబెట్టారు. బ్రెజిల్‌లో థెరిసా మహిమతో బ్రెయిన్‌ట్యూమర్ నుంచి బయటపడిన ఆండ్రినో, ఆయన భార్య ఫెర్నాండా కూడా  హాజరయ్యారు. 2003లో నిర్వహించిన బీటిఫికేషన్ కార్యక్రమానికి ఏకంగా 3 లక్షల మంది తరలివచ్చారు. కానీ ఈసారి లక్ష మంది మాత్రమే హాజరయ్యార ని చెబుతున్నారు. కార్యక్రమానికి 3 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
 
 ఆగస్టు 26, 1910: మేసిడోనియాలో అల్బేనియన్ దంపతులకు జననం. ఆగ్నస్ గోన్షా బోజాక్షియుగా నామకరణం.
 1928: ఐర్లండ్‌లో కేథలిక్ నన్ (సిస్టర్ మేరీ థెరిసాగా) మార్పు.
 1929: కోల్‌కతాలో మిషనరీ, చారిటీ కార్యక్రమం ప్రారంభం.
 1948: వరకు సెయింట్ మేరీ స్కూల్‌లో బోధన.
 1950 అక్టోబర్: మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రారంభం.
 1960ల్లో: కుష్టువ్యాధి, అతిసారం, క్షయవ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు.
 1979: నోబెల్ శాంతి బహుమతి ప్రదానం.
 1997 సెప్టెంబర్ 5: కోల్‌కతాలో చివరి శ్వాస.
 2003: బెంగాలీ యువతికి వ్యాధి నయం చేసినందుకు పోప్ జాన్‌పాల్ -2 ద్వారా బీటిఫైడ్ (పవిత్రమూర్తిగా) గుర్తింపు.
 2015: బ్రెజిల్ యువకుడికి బ్రెయిన్ ట్యూమర్‌ను తగ్గించటం ద్వారా సెయింట్‌హుడ్ ఇవ్వాలని నిర్ణయం.
 2016 సెప్టెంబర్ 4: మదర్ థెరిసాకు సెయింట్ (మహిమాన్విత) హోదా ఇచ్చినట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన.
 
 సెయింట్ థెరిసా మహిమలు
 భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత సెయింట్ థెరిసా పేదల పాలిట కల్పతరువు. ఆదివారం ‘మహిమాన్విత’ (సెయింట్‌హుడ్) గౌరవాన్ని అందుకున్న థెరిసా.. బతికున్నన్ని రోజులూ జీవితాన్ని అనాథలు, అభాగ్యులకే అంకితం చేసింది. ఎవరు బాధపడుతూ..తనను తలచుకున్నా.. మరుక్షణమే నేనున్నానంటూ ఆదుకునే ఆ చేతులు.. కోల్‌కతాలో ఒకరికి, బ్రెజిల్‌లో మరొకరికి ప్రాణదానం చేశాయి. చికిత్సలేని భయంకరమైన రోగాలనుంచి విముక్తి కలిగించాయి.
 
 బ్రెజిల్‌లో..
 బ్రెజిల్‌కు చెందిన మార్సిలియో ఆండ్రినో అనే వ్యక్తి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. మెదడులో సమస్య కారణంగా జీవితాంతం సమస్యలు తప్పవని డాక్టర్లు తేల్చేశారు. ఈ సమయంలోనే థెరిసా చిత్రపటాన్ని ఆండ్రినో మంచం వద్ద ఉంచిన అతని భార్య.. తీవ్రమైన వ్యాధినుంచి కాపాడమని ప్రార్థన చేసింది. కొంతకాలం తర్వాత (2008లో) ఓ రోజు రాత్రి ఆండ్రినోకు తీవ్రమైన తలనొప్పి వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆరోజు రాత్రి ఏదో ప్రశాంతమైన వాతావరణంలో తన నొప్పిని ఎవరో తీసేసినట్లు అనిపించిందని.. తెల్లవారాక ఆండ్రినో చెప్పాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కూడా వ్యాధి నయమైపోయినట్లు గుర్తించారు. ఈ విషయం పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి వచ్చింది. ఆ తర్వాత జరిపిన పరిశోధనల ఆధారంగానే మదర్‌కు థెరిసా సెయింట్‌హుడ్ బహూకరించారు.
 
 కోల్‌కతాలో..
 మోనిక బెస్రా పశ్చిమబెంగాల్‌లోని మారుమూల ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ. 1997లో తీవ్రమైన కడుపునొప్పితో ఆమె ఆసుపత్రిలో చేరింది. కడుపులో కణితి కారణంగానే నొప్పి అని తేల్చిన వైద్యులు.. చికిత్సనందించలేమని చేతులెత్తేశారు. కొన్ని నెలల తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో జరిగే ఆసుపత్రిలో చేరారు. ఈమెను పరిశీలించిన వైద్యులు.. ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. అయితే, 1998 సెప్టెంబర్ 5న కోల్‌కతాలో మదర్ థెరిసా తొలి వర్ధంతి సభ జరుగుతోంది. అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో.. థెరిసా చేతినుంచి ఓ జ్యోతి ఆకారం వచ్చి మోనిక కడుపులోకి వెళ్లినట్లు గుర్తించారు. ఆ రోజు సాయంత్రం కూడా ఇద్దరు నన్స్.. థెరిసా చిత్రపటాన్ని మోనిక కడుపుకు కట్టారు. దీంతో ఏడాది కాలంగా నొప్పితో రాత్రుళ్లు సరిగా నిద్రపోని మోనిక.. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లవారాక పరీక్షలు చేస్తే.. అసలు ఆమెకు కడుపులో కణితి కాదుకదా.. కణితి ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో వైద్యులంతా ఆశ్చర్యపోయారు.
 
 దేశానికే గర్వకారణం: మోదీ
 మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించటం దేశానికే గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జీ-20 సదస్సులో భాగంగా చైనాలో ఉన్న మోదీ.. బహుకరణ కార్యక్రమం కాగానే.. ‘సెయింట్‌హుడ్ ఇవ్వటం మదర్ థెరిసాకు దక్కిన గొప్ప గౌరవం. భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఈ గౌరవం దక్కటం భారత్‌కే గర్వకారణం’ అని ట్వీట్ చేశారు.
 
 సేవలకు గుర్తింపు: సోనియా
 సమాజంలో అణగారిన వర్గాలకు, అభాగ్యులకు చేసిన సేవలకు ప్రతిఫలంగానే మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారు. ప్రేమ, కరుణ, మానవత్వానికి థెరిసా జీవితమే పర్యాయపదమన్నారు. ప్రపంచంలోని పేదలకు, అభాగ్యులకు సేవచేయాలనుకునే వారికి మదర్ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన థెరిసా అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
 
 ప్రజాసేవలో తరించారు: సుష్మ
 వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన సెయింట్‌హుడ్ కార్యక్రమానికి భారత్ తరపున కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ పాల్గొన్నారు. ప్రజల సేవలో తరించిన మహోన్నత వ్యక్తిత్వానికి సుష్మా నివాళులర్పిం చారు.  ‘భారతదేశంలోని నలు మూలలు, వివిధ విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులతో ఇక్కడికి వచ్చాను. మదర్ థెరిసా జీవితాన్ని గౌరవించేందుకే మేమంతా ఇక్కడికి వచ్చాం’ అని సుష్మ వెల్లడించారు. వీరితోపాటు ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రుల నేతృత్వంలోనూ రెండు బృందాలు ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లాయి. 1997లో మరణం తర్వాత రెండు సందర్భాల్లో థెరిసా తన దివ్యత్వాన్ని చూపించినందుకు ఈ గౌరవాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.
 
 సేవాభావానికి ప్రతీక సెయింట్ థెరిసా
 వైఎస్ జగన్ ఘన నివాళి
 సాక్షి, హైదరాబాద్: సెయింట్ హోదాను పొందిన దివంగత మదర్ థెరిసాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సేవాభావం, దయాగుణానికి ప్రతీక అయిన థెరిసా ప్రేమ, దయ, కరుణకున్న తిరుగులేని శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో శ్లాఘించారు. మదర్ థెరిసాను సెయింట్ల జాబితాలో చేర్చడం (క్యాననైజేషన్) భారతదేశానికి ఎనలేని ప్రాధాన్యతను తెచ్చి పెట్టిందని కొనియాడారు. భారతదేశంలో ఆమె స్థాపించిన మిషనరీలు విశ్వవ్యాప్తంగా విస్తరించి పేదల పట్ల సేవా భావాన్ని పెంపొందించాయన్నారు. ఆమె పేదలకు, ఆపదలో ఉన్న వారికి నిరంతరం అలుపెరుగకుండా చేసిన సేవలకు ఎన్నో అవార్డులు లభించాయని, నోబెల్ బహుమతిని కూడా గెల్చుకున్న దయాశీలి థెరిసా అన్నారు. ‘సెయింట్‌హుడ్’ ప్రదానం చేసిన క్షణం ప్రతి భారతీయుడు గర్వించ దగిందన్నారాయన. సోమవారం సెయింట్ థెరిసా 19వ వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ‘నేనివాళే ఉండవచ్చు. కానీ ఈ సేవలు కలకాలం నిలిచి పోతాయి’ అన్న కరుణామయి మాటల్లోని సందేశం విశ్వవ్యాప్తంగా విస్తరించేలా చేస్తూ ముందుకు సాగాలని జగన్ తెలిపారు.
 
 సేవాతత్పరతకు దక్కిన గౌరవం
 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
 సెయింట్ థెరిసాకు మహిమాన్విత హోదా ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆమె చూపిన మానవత్వానికి, సేవాతత్పరతకు దక్కిన అరుదైన గౌరవమే ఈ సెయింట్ హోదా అని ప్రశంసించారు. మనుషుల్లో దైవత్వం ఉంటుందని సెయింట్ మదర్ థెరిసా నిరూపించారని చంద్రబాబు తెలిపారు.
 
 పోప్‌కు మమత అరుదైన కానుక
 వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అరుదైన కానుకను అందించారు. బెంగాలీ లిపిలో.. బలుచురీ సిల్క్‌పై రాసిన బైబిల్‌ను బహుమానంగా అందించారు. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ సిస్టర్ ప్రేమ, ఆర్చ్ బిషప్.. ఈ పుస్తకాన్ని పోప్‌కు అందిస్తారు’ అని మమత ట్వీట్ చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆహ్వానితురాలిగా మమత వాటికన్ వెళ్లిన సంగతి తెలిసిందే.
 
 1,500 మంది పేదలకు పిజ్జా
 వాటికన్‌సిటీలో సెయింట్‌హుడ్ బహూకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత.. మదర్ థెరిసా బాటలో పోప్ ఫ్రాన్సిస్ 15వందల పేదలకు పిజ్జాలు పంచిపెట్టారు. మదర్ థెరిసా సంస్థ సిస్టర్స్ ఆఫ్ చారిటీ సంస్థకు చెందిన చాలా మంది.. ఆదివారం నాటి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేకమైన బస్సుల్లో వచ్చారు. వారికి పోప్ పిజ్జాలు ఇచ్చారు. మొత్తం లక్షమందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement