ఇద్దరు పోప్లకు సెయింట్ హోదా ప్రకటించిన తరువాత ప్రజలకు అభివాదం చేస్తున్న పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీ: పోప్ 23వ జాన్, పోప్ రెండో జాన్‌పాల్‌లకు సెయింట్ హోదాను కల్పిస్తూ పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ వారికి సెయింట్ హోదాతో అరుదైన గౌరవం కట్టబెట్టారు. వీరి పేర్లను ఇకపై సెయింట్ 23వ జాన్, సెయింట్ రెండో జాన్‌పాల్‌గా సంబోధిస్తారు. ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు.
రిటైర్డ్ పోప్ పదహారో బెనెడిక్ట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంతకుముందెప్పుడూ పోప్, రిటైర్డ్ పోప్‌లిద్దరూ ఇలాంటి బహిరంగ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రఖ్యాతి గాంచిన పోప్‌లను గౌరవించే కార్యక్రమాల్లో ఇద్దరు పోప్‌లు పాల్గొన్నదీ తక్కువే . అయితే కేథలిక్ చర్చి ఐక్యతను చాటేలా ఇద్దరు పోప్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోప్‌లకు సెయింట్ హోదాపై భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా చూడాలనేదానికి సంకేతంగా వీరి కలయిక నిలిచింది.