మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’
- సెప్టెంబర్ 4న ఇస్తాం...
- అధికారిక ప్రకటన చేసిన పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీ: మదర్ థెరిసాను ‘సెయింట్’గా ప్రకటించేందుకు వాటికన్ సిటీ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 4న అధికారికంగా సెయింట్‌హుడ్ ఇస్తామని కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీకి మంగళవారం పంపిన వర్తమానంలో పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. దీంతో 45 ఏళ్ల పాటు పేదల సేవలో తరించిన మదర్ మరణించిన 19 ఏళ్ల అనంతరం సెయింట్ హోదా పొందనున్నారు.
థెరిసాను పరిశుద్ధురాలిగా ప్రకటించే ప్రక్రియకు పోప్ ఆమోదం తెలిపారన్న వర్తమానం అందగానే మిషనరీస్ ఆఫ్ చారిటీలో ఆనందం మిన్నంటింది. విషయం తెలియగానే ఎంతో ఉద్వేగం, ఆనందానికి గురయ్యామంటూ చారిటీ ప్రతినిధి సునీత కుమార్ తెలిపారు. మదర్ థెరిసాకు ఉన్న పేరుప్రఖ్యాతుల వల్ల సెయింట్ హోదా ప్రక్రియకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని ఆమె చెప్పారు. సెయింట్‌గా ప్రకటించే ప్రక్రియ సంప్రదాయం మాత్రమేనని, అయితే చాలా ముఖ్యమైనదని ఆర్చిబిషప్ డిసౌజా తెలిపారు.
రోమ్‌లో జరిగే కార్యక్రమానికి సిస్టర్ ప్రేమతో పాటు డిసౌజా హాజరవనున్నారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 2న భారీ కృతజ్ఞతా సమావేశం, ప్రార్థనలు నిర్వహించాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ భావిస్తోంది.
జీవితమంతా పేదలు, రోగుల సేవలో
1910లో మాసిడోనియాలో అల్బేనియా దంపతులకు అంజెజె గోన్క్సే బొజాక్షిహుగా జన్మించిన మదర్ 18 ఏళ్ల వయసులో ఐర్లాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి భారత్‌కు వచ్చి మరణించేంతవరకూ ఇక్కడే జీవించారు. పేదలు, రోగుల సేవకే జీవితాన్ని అర్పించిన థెరిసాను క్యాథలిక్కులు పూజ్యనీయురాలిగా భావిస్తారు. సేవాతత్పరతకు గుర్తింపుగా 1979లో ఆమె నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
1951లో భారత పౌరసత్వాన్ని అందుకున్న మదర్ 87 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 5, 1997న కోల్‌కతాలో మరణించారు. మరణానంతరం మదర్ చేసిన అద్భుతాన్ని 2002లో వాటికన్ గుర్తించడంతో సెయింట్ హోదా ప్రక్రియను 2003లో పోప్ జాన్ పాల్ 2 ప్రకటించారు. ఆ కార్యక్రమానికి దాదాపు 3 లక్షలమంది హాజరయ్యారు. 1998లో కడుపులో కణితితో తీవ్రంగా జబ్బుపడ్డ బెంగాలీ గిరిజన మహిళ మోనికా బెర్సా అనారోగ్యం నుంచి కోలుకుంది. 2008లో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి మదర్ మహిమతో అనారోగ్యం నుంచి బయటపడ్డాడు. సెయింట్‌గా ప్రకటించేందుకు అవసరమైన రెండు అద్భుతాలు జరగడంతో గత ఏడాది వాటికన్ పరిశీలకులు సెయింట్‌హుడ్ ప్రక్రియలోని చివరి దశను మొదలుపెట్టారు.